బరువు తగ్గించే ‘త్రీ అవర్‌’ డైట్‌

03-08-2019: ఈమధ్య ఒక మ్యాగజైన్‌లో ‘త్రీ అవర్‌’ డైట్‌ (మూడుగంటల డైట్‌) గురించి చదివాను. కేవలం మూడు గంటలు డైట్‌ చేస్తే బరువు తగ్గుతామా? ఎంతవరకు తగ్గొచ్చు?
క్రాంతి
బరువు తగ్గడం అనేది ఈమధ్య కాలంలో ఒక కామన్‌ కండీషన్‌ అయ్యింది. స్థూలకాయం బాగా విస్తరించింది. బరువు తగ్గాలి అనుకునే వారు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్య విషయాలు...
ఏ డైట్‌ చేసినా బరువు తగ్గుతారు. అయితే ఏ డైట్‌ చేయాలో నిపుణులను అడిగి, వారి సలహాలను ఫాలో అయితే ఫలితం సరిగ్గా ఉంటుంది. నిపుణులను అడగటం వల్ల మీకు ఆరోగ్య సమస్యలేమైనా ఉంటే అవి కూడా పరిగణనలోకి తీసుకుని డైట్‌ ప్లాన్‌ చేస్తారు.
 
ఎంత బరువు తగ్గుతారని ప్రశ్నిస్తుంటారు చాలామంది. ఇది చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ప్రతి ఒక్కరూ తమ తమ మెటబాలిజాన్ని బట్టి ఇంతకుముందు ఎన్నిసార్లు తగ్గి, తిరిగి పెరిగారో దాన్ని బట్టి బరువు తగ్గడం ఉంటుంది. కానీ డైట్‌ ఫాలో అవుతుంటే మాత్రం బరువు తగ్గడం ఖాయం.
 
తగ్గిన బరువుని మెయింటెయిన్‌ చెయ్యడం చాలా అవసరం. లేకపోతే పడ్డ కష్టం వృథా అవుతుంది. తగ్గిన బరువుని ఆరు నెలల పాటు మెయింటెయిన్‌ చెయ్యగలిగితే, తగ్గిన బరువు కనీసం పది నుంచి ఇరవై సంవత్సరాల దాకా కంటిన్యూ అవుతుంది.
 
ఇక ‘త్రీ అవర్‌’ డైట్‌ విషయానికొస్తే... సింపుల్‌గా చెప్పాలంటే ప్రతీ మూడు గంటలకు ఆహారం తీసుకోవడం. ఇది సాధారణంగా మనం చేసేదే. 24 గంటల్లో 12 గంటలు పగలు ఆహారం ప్లాన్‌ చేసుకుంటే 5 సార్లు ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ఉదయం 7 గంటలకు అల్పాహారం, 10 గంటలకు కొంత ఆహారం, మధ్యాహ్నం 1 గంటకు లంచ్‌, సాయంత్రం 4 గంటలకు స్నాక్స్‌, రాత్రి 7 గంటలకు డిన్నర్‌. అంటే ఉదయం  7 గంటలకు మొదలు పెడితే రాత్రి 7 గంటలకు ముగుస్తుంది. ఈ విధంగా చేస్తే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండానే బరువు ఈజీగా తగ్గుతారు. అయితే ఆహారం మోతాదు విషయంలో నియంత్రణ అవసరం. ఆహార మోతాదు 250ఎం.ఎల్‌- 300ఎం.ఎల్‌కు మించరాదు. ఎలాంటి ఆహారం అంటే... ఒకే టైపు కాకుండా, కూరగాయలు, పండ్లతో కూడిన ఆహారం ప్లాన్‌ చేసుకోవాలి. ఆలస్యంగా తినడం మానేయాలి. ఎవరికి వారు తమ ఆరోగ్య స్థితిని బట్టి ‘త్రీ అవర్‌’ డైట్‌ ప్లాన్‌ చేసుకోవాలి.
డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌