అతి డైటింగ్‌ డేంజరే

ఆంధ్రజ్యోతి, 23/06/2014:హాయిగా గాలిలో తేలిపోతున్నట్లు ఉండాల్సిన శరీరం రాను రాను బండబరువుగా ఎందుకు మారుతుంది? ఏదోలే అనుకోవడానికి స్థూలకాయంతో వచ్చే సమస్యలు ఒకటా  రెండా? కీళ్లు అరిగిపోయే ఆర్థరైటిస్‌, డిస్కులు దెబ్బతినడంతో వచ్చే స్పాండిలైటిస్‌, నాలుగు క్షణాలు నడిస్తే ఆయాసం రావడం ఎంత ఇబ్బంది కలిగిస్తాయి? వీటన్నిటికీ తోడు శరీర ఆకృతి అంతా మారిపోయి యుక్త వయసులోనే నడి వయసులా అనిపించే పరిణామాలు ఎంతటి మనస్తాపానికి దారి తీస్తాయి.

అసలు లోపం ఎక్కడ జరుగుతోంది? ఈ పరిణామాల్ని అడ్డుకునే మార్గాలే లేవా? అంటే లేకపోవడమేమిటి? జీవనశైలిని సమూలంగా మార్చేస్తే స్వల్ప వ్యవధిలోనే శరీరం తిరిగి తన సహజరూపాన్ని సంతరించుకుంటుంది అంటున్నారు నిపుణులు. ఎంత జాగ్రత్తగానో ఉంటున్నామనుకుంటాం. కానీ, జీవన శైలి విషయంలో ఎన్నెన్ని తప్పులు చేస్తామో వాటికి లెక్కే ఉండదు. వాటి ఫలితమే ఈ ఊబకాయాలు. యుక్త వయసు దాకా చక్కని ఆకృతితో ఉండే కొంతమంది శరీరాలు పాతికేళ్లకే ఊబకాయంగా ఎందుకు మారుతున్నాయి? ఇందుకు కారణాలు అనేకం. ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేసిన వారిలో కూడా ఈ సమస్య ఎందుకు ఉంటో

 

రెండే రెండు కారణాలు
శరీరం బరువు పెరగడానికి మౌలికంగా రెండే రెండు కారణాలు కనిపిస్తాయి. వాటిలో మొదటిది అవసరానికి మించి ఆహారం తీసుకోవడం. రెండవది తీసుకున్న అతి స్వల్ప ఆహారం కూడా పూర్తిగా జీర్ణం కాకుండా పోవడం. మిగతా ఐదు రోజులూ ఎంతో జాగ్రత్తగా ఉండే వారు కూడా వారాంతంలో అంటే శని ఆదివారల్లో అతిగా తినేస్తారు. దీనివల్ల మిగతా ఐదు రోజులూ తీసుకున్న జాగ్రత్తల ఫలితం ఏమీ మిగలకుండా పోతుంది. అలా అని తీసుకునే ఆహారపు మోతాదు తగ్గించుకుంటూ పోతే శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవచ్చు. దీనివల్ల శరీరం బాగా బలహీనపడి జీవక్రియలు కుంటుపడిపోయే ప్రమాదం ఉంది. జీవక్రియలు కుంటుపడే కొద్దీ జీర్ణశక్తి తగ్గిపోయి, శరీరంలో కొవ్వు నిలువలు పెరిగిపోతాయి. తక్కువ కేలరీలున్న ఆహారమే తీసుకున్నా అది కూడా జీర్ణం కాని పరిస్థితి ఏర్పడుతుంది. జీర్ణం కాకుండా మిగిలిపోయిన ఆహార పదార్థాల్ని కొవ్వుగా మార్చుకునే శరీర సహజ తత్వం వల్ల ఆ నిలువలు అలా పెరుగుతూ వెళతాయి. దీనికంతటికీ శరీర శ్రమ గానీ, వ్యాయామం గానీ, బొత్తిగా లేకపోవడమే కారణం. వ్యాయామమేదీ చేయకుండా అదే పనిగా ఆహారం తగ్గించుకుంటూ పోతే శరీరం చిక్కి శల్యం కావడ ం తప్ప మరో ప్రయోజనమేదీ ఉండదు. ఒక్క రోజు ఆపేసినా... జిమ్‌కు వెళ్లడం గానీ, వాకింగ్‌కు వెళ్లడం గానీ, ఇంట్లోనే వ్యాయామం చేయడం గానీ ఏ కారణంగానో ఒకరోజు ఆపితే ఆ మరుసటి రోజు కూడా మానేయాలనిపిస్తుంది. వ్యాయామం చెయ్యడంలో శ్రమ ఉంది. మానుకోవడంలో సుఖముంది. సహజంగా సుఖాన్ని కోరుకునే మనసు సహజంగానే ఆ ఒక్క రోజు బ్రేక్‌ను మరికొన్ని రోజుల దాకా కొససాగించాలనుకుంటుంది. వరుసగా వారం పదిరోజులు మానే శాక తిరిగి వ్యాయామానికి సిద్ధం కావడం చాలా మందికి అసలు సాధ్యమే కాదు. ఎవరో వచ్చి మనల్ని ఉత్సాహ పరచాలంటే అది జరిగే పని కాదు. దీనికి సెల్ఫ్‌ మోటివేషన్‌ ఒక్కటే మార్గం. అంతకన్నా మించి మరీ మరీ అనివార్యమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామానికి బ్రే క్‌ ఇవ్వకపోవడమే ఉత్తమం.
ఆహారం ఎలా ఉండాలి?

పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి విటమిన్లు, లవణాలు సమృద్ధిగా ఉండే ఆహారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. బరువు తగ్గాలనుకోగానే కొందరు ఘన పదార్థాల స్థానంలో ద్రవపదార్థాలు తీసుకోవాలన్న నిర్ణయానికి వస్తారు. అయితే ద్రవపదార్థాలనగానే చాలా మందికి పండ్ల రసాలు గుర్తుకొస్తాయి. కానీ, పళ్ల రసాల్లో అత్యధిక శాతం కేలరీలు, ప్రత్యేకించి ఎక్కువ షుగర్స్‌ ఉంటాయి. ఇవి ఇత ర ఆహార పదార్థాలకన్నా ఎక్కువ ప్రమాదం. ద్రవపదార్థాలంటే మజ్జిగ, కొబ్బెరి నీళ్లు, నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. అంతే గానీ అదేపనిగా పండ్ల రసాలు తీసుకోకూడదు. శరీరపోషణకు పండ్లూ అవసరమే. అయితే పండ్లను యథాతధంగా తినాలే గానీ, పీచుపదార్థం ఏమాత్రం లేకుండా చేసే పండ్ల రసాలు కాదు.

పచ్చివి శ్రేయస్కరమా?

బరువు తగ్గడానికి పచ్చికూరగాయల తినాల్సిన అవసరమేమీ లేదు. విపరీతంగా క్రిమి సంహారక మందుల్ని చల్లుతున్న కారణంగా వాటిని అలా తినేయడం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదు. ఉప్పునీళ్లలో వాటిని శుభ్రంగా కడగి తినేయవచ్చు అని చెబుతారు గానీ, ఈ రోజుల్లో చాలా మందికి అంత సమయమే లేదు. ఆ కారణంగా పచ్చిగా తినేస్తే ఆశించిన లాభాల కన్నా నష్టాలే ఎక్కువైపోతాయి. అందువల్ల జాగ్రత్తగా ఉడికించిన కూరగాయలే తీసుకోవాలి. ఏమైనా బరువు తగ్గాలనుకున్నప్పుడు అందరూ అనుసరించే విధానాన్నే తానూ అనుసరిస్తే సరిపోతుంది అనుకోకూడదు. ఆయా వ్యక్తుల శరీర ధర్మాన్ని అసుసరించి ఎవరికి వారు ఒక ప్రత్యేక పట్టికను రూపొందించుకోవాల్సి ఉంటుంది. అందుకు డైటిషన్‌ సలహాలు, సూచనలు తీసుకోవడం ఎక్కువ ప్రయోజనకరం.ఎందుకంటే కొంత వయసు వచ్చిన తర్వాత వచ్చే హార్మోన్‌ వ్యవస్థలోని మార్పులు కూడా శరీరం బరువు పెరగడానికి కారణమవుతుంటాయి. నిపుణులైతే ఆ విషయాల్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన సలహా ఇస్తారు.

డిప్రెషనూ కారణమే
తీసుకునే ఆహార పదార్థాలూ, శారీరక కారణాలే కాకుండా డిప్రషన్‌ వల్ల కూడా శరీరాలు బరువెక్కుతాయి. డిప్రెషన్‌ వల్ల కలిగే దిగులూ, ఆందోళనల కారణంగా తమకు నచ్చిన పదార్థాల్ని వీరు అతిగా తినేస్తూ ఉంటారు. అవి లేకపోతే ఏది అందుబాటులో ఉంటే అది తినేస్తూ వెళతారు. అలా చేయడం రుచి కోసం కాదు. ఏమీ తోచక అలా చే స్తూ ఉంటారు. ఇదంతా వాళ్లకు తెలియకుండానే జరిగిపోతుంది. లాంటి వారు యోగా, ప్రాణాయామాలకు కూడా అధిక ప్రాధాన్యతనివ్వాలి. ప్రాణాయామంతో నాడీ వ్యవస్థ బలపడి జీవిత సమస్యల్ని అవలీలగా అధిగమించే శక్తి కలుగుతుంది. అందుకే బరువు తగ్గడానికి నిర్దిష్టమైన ఆహారం, వ్యాయామం, ప్రాణాయామం అనే త్రిముఖ సూత్రాన్ని  పాటిస్తే, శరీరం తేలికపడటమే కాదు, గొప్ప మానసికోల్లాసమూ సొంతమవుతుంది.
 
డాక్టర్‌ ప్రశాంతి సూర్యనారాయణ్‌ 
చీఫ్‌  డైటీషియన్‌, యశోదా  హాస్పిటల్‌
సోమాజిగూడ, హైదరాబాద్‌