బరువు తగ్గాలంటే ఈ స్నాక్స్‌ తినాల్సిందే

25-02-2019:బరువు తగ్గాలనుకునేవారు తక్కువ తినడం కన్నా సరైన ఆహారం తినడం ముఖ్యమని చెబుతున్నారు పోషకాహార, ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గడంలో హెల్తీ స్నాక్‌ తినడం ఒక భాగమే. ఇవి ఆకలిని తగ్గించమేగాక జీవక్రియలు సవ్యంగా జరిగేందుకు తోడ్పడుతాయి.
 
సెనగలు: వీటిలో ప్రొటీన్స్‌, పీచు పదార్థాలుంటాయి. ఇవి తింటే తొందరగా ఆకలి వేయదు. కూరగాయ ముక్కలు లేదా నిమ్మరసంతో ఉడికించిన సెనగల్ని తీసుకోవాలి.
మినప పప్పు: మినపపప్పులో శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ ఉంటుంది. మినప పప్పుతో సాయత్రం స్నాక్‌గా ఇడ్లీలు చేసుకుని తినొచ్చు. ఈ ఇడ్లీలు తొందరగా జీర్ణమవుతాయి.
 
నట్స్‌: బఠాణీ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో గ్లూటెన్‌ ఉండదు. వీటిలో ముఖ్యమైన ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని వేగించి లేదా వీటికి కొద్దిగా మొక్కజొన్నలు కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి.
 
మొలకెత్తిన విత్తనాలు: వీటిలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. బరువు పెరుగుతామనే ఆందోళన లేకుండా వీటిని తినొచ్చు. ఈ విత్తనాల్లో ప్రొటీన్లతో పాటు, జీర్ణక్రియకు ఉపకరించే పీచు ఉంటుంది. వీటితో కూరగాయ ముక్కల్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
 
తామర గింజలు: వీటిలో కొలెస్ట్రాల్‌, కొవ్వులు, సోడియం వంటివి అస్సలుండవు. ప్రొటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌, క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటాయి.
ఎండు బఠాణి: ప్రొటీన్స్‌, కొవ్వులు, పీచుపదార్థం సమృద్ధిగా ఉంటాయి. ఇవి తింటే బరువు తగ్గడంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.