ఊబకాయంలో ఆరు రకాలు!

ఆంధ్రజ్యోతి, 28-04-2015:లావవుతున్నారని ఎవరైనా అంటే చాలు చాలామంది తెగ ఆందోళనపడిపోతుంటారు. అలాంటిది ఊబకాయంలోనూ రకాలున్నాయని తెలిస్తే ఇంకెంత ఆందోళన పడతారో కదా. ఊబకాయంలో ఆరు వెరైటీలు ఉన్నాయట. వాటిల్లో మనం ఏ రకం కిందకు వస్తామో దానికి తగ్గ వైద్య చికిత్స చేయించుకోవాలట. ఇంతకూ ఊబకాయంలో ఆరు రకాలున్నాయన్న విషయం ఎలా చెప్తున్నారంటారా? ఈ విషయం ఒక స్టడీలో వెల్లడైంది.
 
ఈ స్టడీని అమెరికా, బ్రిటన్‌లు కలిసి నిర్వహించాయి. ఊబకాయాన్ని నిరోధించాలంటే అది ఏ రకానికి చెందిన ఊబకాయమో మొదట వైద్యులు గుర్తించాలని ఈ స్టడీని చేసిన అధ్యయనకారులు అభిప్రాయపడ్డారు. ఊబకాయం ఏ వెరైటీకి చెందినదో గుర్తించిన తర్వాత దానికనుగుణంగా చికిత్సనందిస్తే మంచి ఫలితాలుంటాయని వారు వెల్లడించారు. ఈ స్టడీలో వ్యక్తుల ఆరోగ్యం, వారు నివసిస్తున్న ప్రాంతం, వారి ప్రవర్తన అంశాల ప్రాతిపదికగా ఊబకాయంలోని రకాలను వర్గీకరించారు. బ్రిటన్‌లోని షెఫ్‌ఫీల్డ్‌ యూనివర్సిటీ, అమెరికాలోని హార్వార్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధ్యయనకారులు సంయుక్తంగా ఈ స్టడీ చేశారు. ఈ స్టడీలో భాగంగా ఊబకాయంతో ఉన్న మొత్తం 4,144 మందిని పరిశీలించారు. వీరి బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బిఎంఐ) కనీసం 30కి మించి ఉండడాన్ని గమనించారు. వీరిలో 58 శాతం మంది మహిళలు ఉన్నారు.
 
స్టడీ చేసిన అభ్యర్థుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు చేస్తున్నారా, గతంలో ఎప్పుడైనా బరువు తగ్గడానికి ప్రయత్నించారా వంటి విషయాలను తెలుసుకున్నారు. వాటి సహాయంతో ప్రశ్నాపత్రాన్ని రూపొందించి వాటిని డాక్టర్ల ద్వారా అభ్యర్థులకు అందజేశారు. వాటికి వచ్చిన సమాధానాల ఆధారంగా ఊబకాయం ఆరు రకాలుగా ఉంటుందని తేల్చారు. వీరిలో లావుగా ఉన్న యువతుల్లో టైప్‌-2 డయాబెటి్‌సలాంటి సమస్యలేవీ లేకపోవడాన్ని గుర్తించారు. ఇంకొక కేటగిరిలో బాగా తాగే మగవాళ్లు ఉండడాన్ని గమనించారు. మరొక కేటగిరీలో ఒత్తిడి, బాధలకు గురవుతూ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలు ఉండడాన్ని గమనించారు. డబ్బున్న వారిలో ఆరోగ్యంగా ఉండే సీనియర్‌ సిటిజన్స్‌ వర్గం కూడా ఈ కేటగిరిల్లో ఉంది.
 
వీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ రక్తపోటు సమస్య ఉండడం, విపరీతంగా తాగే అలవాటు ఉండడాన్ని గుర్తించారు. ఇంకొంతమంది పెద్దవాళ్లు శారీరకంగా అనారోగ్యంగా ఉన్నా మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటున్నారు. కానీ వీళ్లు ఆర్ధరైటిస్‌ వంటి క్రానిక్‌ జబ్బులతో బాధపడుతున్నారు. ఆర్థికంగా పేద స్థితిలో ఉండేవాళ్లు రకరకాల జబ్బులతో బాధపడుతుండడం మరో కేటగిరీ. ఈ కేటగిరీల ప్రకారం పేషంటులో ఉన్న లక్షణాలను బట్టి ఊబకాయానికి చికిత్సనందివ్వాలి. ఎక్కువ తాగడం, వ్యాయామాలు చేయకపోవడం, హద్దులేకుండా తినడం వంటి అలవాట్ల వల్ల కూడా కొందరు ఊబకాయంతో బాధపడుతున్నారు. అందుకే పేషంట్లలో కనిపించే లక్షణాలను బట్టి టార్గెటెడ్‌ ఇంటర్వెన్షన్‌ను వైద్యులు చేపట్టాలని అధ్యయనకారులు ఈ స్టడీలో సూచించారు.