ఊబకాయంతో రిస్క్‌

ఆంధ్రజ్యోతి, 24-10-2015: అధిక బరువున్నారా? అయితే వెంటనే తగ్గండి. లేకపోతే కేన్సర్‌ బారిన పడే అవకాశం ఉందంటున్నారు అధ్యయనకారులు. వారు ఇటీవల చేసిన ఒక స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఈ స్టడీ కింద ఐదు మిలియన్ల మంది డేటాను అధ్యయనకారులు పరిశీలించారు. అంతేకాదు ఊబకాయానికి, కేన్సర్‌కు దగ్గర సంబంధం ఉందని కూడా పరిశీలకులు గుర్తించారు. ఒక్క బ్రిటన్‌లోనే కేవలం ఊబకాయం వల్ల ప్రతి సంవత్సరం 12,000 కేన్సర్‌ కేసులు నమోదవుతున్నాయని తేలింది. వ్యక్తి బాడీ మాస్‌ ఇండెక్స్‌లో ప్రతి ఐదు పాయింట్ల పెరుగుదలకి 62 శాతం మంది గర్భాశయ కేన్సర్‌ పాలబడుతున్నట్టు లెక్క తేలింది. అలాగే 25 శాతం మంది కిడ్నీ కేన్సర్‌ బారిన పడే అవకాశాలు ఉంటున్నాయిట. శరీరంలో చేరిన అధిక కొవ్వు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుందిట.
 
ఆ హార్మోన్లలో ఈస్ట్రోజన్‌ కూడా ఉంది. మెనోపాజ్‌ తర్వాత అండాశయాలు హార్మోన్లను ఉత్పత్తి చేయవు. ఫ్యాట్‌ వల్ల ఈస్ట్రోజన్‌ ఉంటుందని ముందరే చెప్పుకున్నాం. మెనోపాజ్‌ దాటి, ఊబకాయంతో ఉన్న స్త్రీలు ఎక్కువగా ట్యూమర్ల బారిన పడే అవకాశం ఉంది. ఈ గడ్డలు ఎక్కువవడానికి ఈస్ట్రోజన్‌ కారణమవుతుంది. శరీరంలో ఎక్కువ ఫ్యాట్‌ ఉండడం వల్ల రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. భారీకాయుల మీద ట్రీట్‌మెంట్‌ కూడా శక్తివంతమైన ఫలితాలు చూపించదుట. భారీకాయం ఉండడం వల్లే 41 శాతం వరకూ ఉదర కేన్సర్లు వస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. మగవాళ్లల్లో అయితే ఊబకాయం వల్ల పెద్దపేగు కేన్సర్‌ రిస్కు బాగా ఉంటోంది. దాదాపు 10 శాతం పెద్దపేవు కేన్సర్లు ఊబకాయం వల్లనే వస్తున్నాయట. ఊబకాయం వల్ల కాలేయం కేన్సర్‌ కూడా వచ్చే అవకాశం ఉందిట. అందుకే ఊబకాయులు కాకుండా ఉండేందుకు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి. నిత్యం వ్యాయామాలు చేయండి. స్లిమ్‌గా ఉండండి. కేన్సర్‌ని తరిమికొట్టండి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.