అమ్మా... అదా కారణం

గర్భందాల్చకముందు తల్లి తీసుకునే ఆహారం, జీవనవిధానాలు పిల్లలు ఊబకాయులుగా అయ్యేందుకు కారణమవుతాయట. గర్భందాల్చిన తరువాత కదా తల్లి అలవాట్లు కడుపులోని బిడ్డ మీద ప్రభావం చూపించేది అంటున్నారా. సహజంగా అందరూ అలానే అనుకుంటారు. కాని మహిళ గర్భం దాల్చకముందు నుంచీ ఆమె అలవాట్లు పిల్లల్ని ఊబకాయం బారిన పడేస్తున్నాయని తేల్చేశారు సౌతాంప్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ‘‘పిల్లలు ఊబకాయులుగా మారకుండా ఉండాలంటే గర్భం దాల్చక ముందునుంచే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మహిళలు ఎక్కువ బరువు ఉండకూడదు. పొగతాగే అలవాటు ఉంటే అది మరింత ప్రమాదకరం’’ అని పరిశోధకుల్లో ఒకరైన సియాన్‌ రాబిన్సన్‌.
 
దాదాపుగా వెయ్యిమంది పిల్లలపై ఈ పరిశోధన చేశారు. ఇందులో ప్రధానంగా ఐదు అంశాలను గమనించారు. ఒకనెలకంటే తక్కువ రోజులు స్తన్యం ఇచ్చే అంశంతో పాటు గర్భం దాల్చిన తరువాత- ఒబెసిటీ, అధిక బరువు, పొగతాగడం, విటమిన్‌-డి తక్కువ స్థాయిలో ఉండడాన్ని పరిశీలించారు. అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్న నాలుగేళ్ల వయసు పిల్లల్లో పైన చెప్పిన ఐదు అంశాలు లేదా నాలుగు అంశాలు కనిపించాయి. ఆరేళ్ల వయసు వచ్చేసరికి అధికబరువు లేదా ఊబకాయం రిస్క్‌ నాలుగున్నర రెట్లు పెరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పిల్లలు తీసుకునే ఆహార నాణ్యత, శారీరక వ్యాయామం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం.