ఇంతింతై లావింతై..

ఆంధ్రజ్యోతి(26-10-2016): నేడు వరల్డ్ ఒబెసిటీ డే 
అధిక బరువు ఆందోళన కల్గిస్తోంది. బరువు పెరిగిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఒబెసిటీ ఇప్పుడు ప్రమాదకరమైన సమస్యగా తయారైంది. మారిన జీవనశైలి, జన్యు కారణాలతో ఒబెసిటీ బారిన పడుతున్న వారి సంఖ్య గ్రేటర్‌ హైదరాబాద్‌లో పెరిగిపోతోంది. బరువును తగ్గించుకోవడానికి బాధితులు ముప్పుతిప్పలు పడుతున్నారు. వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. బేరియాట్రిక్‌ సర్జరీలు, లైపోసెక్షన్‌ చేయించుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. గ్రేటర్‌ పరిధిలో నెలకు 100 నుంచి 150 బేరియాట్రిక్‌ సర్జరీలు జరుగుతుండగా, లైపోసెక్షన్‌ సర్జరీలు 70 నుంచి 80 వరకు ఉంటున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.                       
                                                                                                                                                                               
అధిక బరువు ప్రత్యక్షంగా, పరోక్షంగా 65కు పైగా జబ్బులకు కారణమవుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అధిక బరువు వల్ల మధుమేహం, గుండెజబ్బులు, అధిక రక్తపోటు, స్లీప్‌ అప్నెయా,ఆర్థరైటిస్,జాయింట్‌పెయిన్స్‌, పక్షవాతం వంటి సమస్యలకు దారితీస్తాయి. ఉండాల్సిన బరువు కంటే కిలో గ్రాము బరువు ఎక్కువగా ఉంటే రోజుకు 350 కిలో మీటర్ల దూరం ఎక్కువగా రక్తాన్ని నెట్టాల్సిన భారం గుండెపై పడుతుందని వైద్యులు వివరించారు. అధిక బరువును మోయలేక కీళ్లు త్వరగా అరిగిపోవడంతో నడవలేరని స్పష్టం చేస్తున్నారు. దీంతో శారీరక శ్రమ మరింత తగ్గి బరువు పెరిగే అవకాశలు ఎక్కువ అవుతాయని చెప్పారు.
 
ఏడుగురిలో ముగ్గురు యువకులే
ప్రతి రోజూ తమ వద్దకు వచ్చే ఏడు మందిలో ముగ్గురు యువకులే ఉంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. కొందరిలో 140 కిలోల వరకు బరువు వరకు ఉంటున్నారు. ఏదో ఒక రూపంలో అయిదారు సార్లు ఆహార పదార్థాలు తినడం కూడా అధిక బరువుకు కారణమవుతుందని చెప్పారు. మున్ముందు ఈ అధిక బరువు మరింత పెరిగే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యువతులకు అధిక బరువు పెళ్లికి అడ్డంకిగా మారుతుందన్నారు. కొంత మంది మహిళల్లో పిల్లలు పుట్టిన తరువాత బరువు సమస్య వస్తుందని, నడి వయస్సు వారిలో పీరియడ్స్‌ ఆగిపోవడం వల్ల కూడా బరువు పెరుగుతున్నారని చెప్పారు.
 
పాఠశాల విద్యార్థుల్లో 
పాఠశాలలకు వెళ్లే విద్యార్థులలో అధిక బరువు సమస్య మరింత తీవ్రంగా ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పదేళ్లుగా నగరంలో అధిక బరువు పిల్లలకు ప్రమాదకరంగా మారుతోందని వైద్యులు వివరిస్తున్నారు. 16 నుంచి 25 శాతం మంది విద్యార్థులు అధికబరువు సమస్యను ఎదుర్కొంటున్నారని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లల్లో ప్రతి నలుగురిలో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నారని వివరిస్తున్నారు. చాలా మంది పిల్లలు స్కూల్‌నుంచి ఇంటికి రాగానే పుస్తకాల బ్యాగ్‌ అక్కడ పడేసి రిమోట్‌ అందుకుంటున్నారు. టీవీకి అతుకుని పోతున్నారు. నగరంలో పిల్లలు ఎక్కువ సమయం టీవీ, కంప్యూటర్‌తో గడపడం, వీడియో గేమ్స్‌ ఆడడం అధిక బరువుకు దారితీస్తోందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
 
పొడుగు కంటే ఎక్కువ ఉంటే...
బరువు పొడుగును బట్టి శరీర బరువు ఉండాలని వైద్యులు సూచించారు. పొడుగు ఆధారంగా ఎంత బరువు ఉండాలో బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బిఎఐ)ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పారు. బాడీమాస్‌ ఇండెక్స్‌ 19 కన్నా తక్కువ ఉంటే బరువు పెరగడానికి సూచికలుగా భావించాలని వివరించారు. 19 నుంచి 24.9 వరకు బాడీ మాస్‌ ఇండెక్స్‌ ఉంటే మాములు బరువు ఉన్నట్లు పరిగణించాలి. 26 నుంచి 29.9 బిఎఐ ఉంటే మాత్రం అధిక బరువు కింద లెక్క. 30 నుంచి 34.9 వరకు ఉంటే స్థూలకాయం మొదటి దశ, 35 నుంచి 39.9 వరకు ఉంటే రెండో దశ, 40 కంటే ఎక్కువ ఉంటే మార్బిడ్‌ ఒబెసిటీగా భావిస్తామని వైద్యులు చెప్పారు.
 
కొన్ని సూచనలు 
ఆహారపు అలవాట్లు, జీవన శైలిని మార్చుకోవాలి.
ఒకే సారి ఎక్కువ మొత్తంలో భోజనం తినొద్దు.
కడుపు నిండా కాకుండా కొంత ఖాళీగా ఉండే విధంగా చూసుకోవాలి.
భోజనానికి, భోజనానికి నడుమ వ్యవధి ఎక్కువ ఉండకూడదు
మూడు గంటలు తరువాత లంచ్‌, రాత్రి పది గంటల తరువాత డిన్నర్‌ తీసుకోవడం మానివేయాలి.
ఓ రెండు ఇడ్లీలతో పాటు మొలకెత్తిన గింజలు తీసుకోవడం మంచిది.
ఇంట్లో పనులన్నీ ఎవరికి వారే చేసుకోడం మంచిది. నిత్యం వ్యాయమం చేయాలి.
కొద్దిపాటి బరువున్న వారికి కొన్ని రకాల మందులతో తగ్గించుకోవచ్చు.
ఆహారంలోని కొవ్వు శరీరంలోకి ఇంకిపోకుండా చేసే మందులు వాడాలి.
 
అధిక బరువు యువతులకు పెద్ద ఇబ్బందిగా మారింది. దీంతో పెళ్లీడు వచ్చిన వారు బరువును తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది అందంగా ఉండడానికి లైపోసెక్షన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇలా నెలకు 70 నుంచి 80 వరకు లైపోసెక్షన్‌ను చేయించుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా 20 నుంచి 25 ఏళ్ల లోపే ఉంటున్నారు. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న కొంత మంది మహిళలు కూడా లైపోసెక్షన్‌ చేయించుకుంటున్నారు. ఎక్కువగా 35 నుంచి 40 లోపు వారు ఉంటున్నారు. దాదాపు 30 నుంచి 40 శాతం మంది పెళ్లై, పిల్లలు పుట్టిన తరువాత అధిక బరువును తగ్గించుకుంటున్నారు. అధిక బరువును తగ్గించుకోవడానికి సొంత ప్రయత్నాలు కూడా చేయాలి. ప్రతి రోజు నడిచే వారిలో బరువు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు, జీవన శైలిని మార్చుకోవాలి. 
-డాక్టర్‌ భవానీ ప్రసాద్‌,
ప్లాస్టిక్‌, కాస్మెటిక్‌ సర్జన్‌,
సన్‌షైన్‌ ఆస్పత్రి
 
పిల్లల్లో అధిక బరువు వల్ల మధుమేహనికి దారి తీస్తోంది. అధిక బరువు ఉన్న వారి మెటబాలిక్‌ రేట్‌ను పెంచడానికి ఇన్సులిన్‌ అవసరమవుతుంది. జంక్‌ ఫుడ్స్‌ దూరంగా ఉంచాలి. ఫ్రై, బర్గర్స్‌, షేక్స్‌ వంటి ఫాస్ట్‌ ఫుడ్‌ జోలికి వెళ్లవద్దు. బాగా రిఫైన్‌ చేసిన ఆహారపదార్థాలు పూర్తిగా మానివేయడం చాలా మంచిది. అలాగే తియ్యగా ఉడే సాఫ్ట్‌డ్రింక్స్‌, సోడా, ఫ్రూట్‌ జ్యూసులతో రిఫైన్‌ చేసిన ఆహార పదార్థాలు పూర్తిగా మానివేయాలి. చిన్న వయసులో చురుకుగా ఉండడం, వ్యాయమం చేయడం వల్ల పెద్ద వయసులో కూడా అదే పద్దతి అలవడుతుంది. అలాగే పాఠశాలల్లో విధిగా ఆటలు ఉండాలి. సాయంత్రం సమయాల్లో పిల్లలు ఇంటి వద్ద ఆడుకునే విధంగా ఏర్పాటు చేయాలి. ఒబెసిటీ ఉన్న వారు లైపోసెక్షన్‌,అబడామిన్‌ ప్లాస్టీ, బేరియాట్రిక్‌ సర్జరీలను కూడా చేయించుకునే వారి సంఖ్య పెరిగింది. నెలకు 100 నుంచి 150 బేరియాట్రిక్‌ సర్జరీలు నగరంలో జరుగుతున్నాయి.
-డాక్టర్‌ లక్ష్మీకాంత్, బేరియాట్రిక్‌ సర్జన్‌, కిమ్స్‌ ఆస్పత్రి