తల్లులు ఊబకాయులైతే..

ఊబకాయంతో ఉండే తల్లులకు పుట్టే పిల్లల్లో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుందని ఇటీవల చేసిన ఒక స్టడీలో వెల్లడైంది. అదే సమయంలో లావుగా లేని అమ్మలకు పుట్టిన బిడ్డల్లో మాత్రం ఈ లోపం కనిపించడంలేదని అధ్యయనకారులు పేర్కొన్నారు. తల్లి కావడానికి ముందర ఆడవాళ్లు భారీకాయంతో ఉంటే దాని ప్రభావం వాళ్లకి పుట్టే బిడ్డల్లో కనిపిస్తుందట. గుండెజబ్బులు, ఆస్తమా వంటి జబ్బుల బారిన పడే అవకాశం ఉందని ఈ స్టడీని నిర్వహించిన కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఇహెమ్‌ మెసాద్‌ తెలిపారు. ఈ స్టడీలో ప్రధానంగా ఊబకాయులైన తల్లులకు పుట్టిన పిల్లల్లో రోగనిరోధకశక్తిపై, వారికి వచ్చే జబ్బులపై రీసెర్చ్‌ చేశారు. ఈ స్టడీ అమెరికాలోని 39 మంది తల్లులపై చేశారు. లావుగా ఉన్న తల్లులకు, సన్నగా ఉన్న తల్లులకు పుట్టిన పిల్లల బొడ్డుతాడు నుంచి కణాలు తీసి పరీక్షించారు. అందులో ఊబకాయులైన తల్లులకు పుట్టిన బిడ్డలు బాక్టీరియల్‌ యాంటిజన్స్‌కు సరిగా స్పందించడం లేదు. కానీ సన్నగా ఉన్న తల్లులకు పుట్టిన బిడ్డల్లో బాక్టీరియల్‌ యాంటిజెన్స్‌కు స్పందన బాగా ఉండడాన్ని గుర్తించారు. ఊబకాయంతో ఉన్న తల్లులకు పుట్టిన పిల్లల్లో మనిషి రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యమైన సిడి4టి కౌంట్‌ తగ్గడం గమనించారు. ఆస్తమా, ఇతర రకాల ఎలర్జీల నివారణలో ముఖ్యపాత్ర వహించే రోగనిరోధక కణాల సంఖ్య ఊబకాయమున్న తల్లులకు పుట్టిన పిల్లల బొడ్డుతాడులో తక్కువగా ఉండడాన్ని కూడా ఈ అధ్యయనంలో గుర్తించారు.