పొట్ట దగ్గర కొవ్వు తగ్గేదెలా..

మా అమ్మాయికి ఇరవై నాలుగేళ్లు. వివాహం కాలేదు. తక్కువే తింటుంది. కానీ ఈ మధ్య పొట్ట దగ్గర కొవ్వు పెరుగుతోంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలి?

- మహబూబ్‌, తెనాలి 
సాధారణంగా ఆడవాళ్ళలో పాతికేళ్లు దాటిన తరువాత జీవక్రియ వేగం క్రమంగా తగ్గుతుంది. అయితే ఇది అందరిలోనూ ఒకేలా ఉండదు.  వ్యాయామం చేసేవాళ్ళలో జీవక్రియ వేగం ఎక్కువ. మీ అమ్మాయి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడానికి ఆ వేగం తగ్గడం కూడా ఓ కారణం కావొచ్చు. రోజూ కనీసం గంట పాటు వ్యాయామం చేయడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. అధికంగా కొవ్వులు ఉండే పదార్థాలు తీసుకోకూడదు. వేపుళ్ళు, బేకరీ ఫుడ్స్‌ మానెయ్యాలి. తక్కువ నూనెలో వండిన మాంసాహారం మాత్రమే తీసుకోవాలి. కాయగూరలు, ఆకుకూరలు రోజూ తినాలి. వెన్న తీసిన పాలు, మీగడ తీసిన పెరుగు ప్రతి పూటా తీసుకోవాలి. రోజుకు రెండుసార్లు తాజా పండ్లు తినాలి, పండ్ల రసాలు కాదు. చక్కెర, బెల్లం వంటి తీపి పదార్థాలకు దూరం ఉండాలి. సమయానికి భోజనం, తగినంత నిద్ర చాలా అవసరం. కాఫీ, టీలకు నో చెప్పడం మేలు. రాత్రి నిద్రకు కనీసం మూడు గంటల ముందే భోజనాన్ని ముగించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు నెమ్మదిగా తగ్గుతుంది.