ఇవి పాటిస్తే అనారోగ్యం ఆమడదూరం

ఆంధ్రజ్యోతి, 06-08-2013: నగర జీవనం, పెరిగిన పని ఒత్తిడి, మారిన ఆహార అలవాట్లు అనేక వ్యాధులను తెచ్చిపెడుతున్నాయి. ఆరోగ్య సూత్రాలపై ఎంత అవగాహన ఉన్నా పాటించడంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. నిజానికి ఆరోగ్యంగా ఉండాలంటే పెద్ద పెద్ద నియమాలేమీ పెట్టుకోనవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనారోగ్యాన్ని ఆమడ దూరంలో పెట్టవచ్చు. ఈ విషయంలో ఆరోగ్య నిపుణులు చెబుతున్న సూచనలు తెలుసుకుందాం రండి. 

బరువు పెరిగితే ముప్పు 
అధిక బరువు వెన్నంటే వ్యాధులుంటాయి. కాబట్టి బరువు విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. మంచి ఆహారపు అలవాట్లను అనుసరించండి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి. క్రమబద్ధంగా బరువును పరీక్షించుకుంటూ బరువును నియంత్రణలో పెట్టుకోండి.
 
డైట్‌ ప్లాన్‌ 
రోజూ చేయాల్సిన పనులు, కార్యక్రమాలకు సంబంధించి ఎలా ప్రణాళిక వేసుకుంటారో మీ ఆహార నియమాల్ని కూడా ముందుగానే తయారు చేసి పెట్టుకోండి. ఓట్స్‌, బార్లీ, గోధుమ, పళ్లు, కూరగాయలు, చేపలు, నట్స్‌, సీడ్స్‌,...ఇలా పోషకాలు సమృద్ధిగా లభించే డైట్‌ను ఎంచుకోండి.

పోషకాహారం 

పోషక విలువలు ఎక్కువగా లభించే ఫంక్షనల్‌ ఫుడ్‌ తీసుకోండి. విటమిన్స్‌, మినరల్స్‌ ఎక్కువగా లభించే ఆహారాన్ని ఫంక్షనల్‌ ఫుడ్‌ అంటారు. వెల్లుల్లి, ఉల్లి, సోయా, బ్రొకోలి, గ్రేప్స్‌, నట్స్‌, అవిసెలు, పప్పు దినుసులు... ఇందుకు మంచి ఉదాహరణ. ఈ ఆహారానికి వ్యాధులను ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఇవి మీ ఆహారంలో ఉంటే అనారోగ్యం మీకు ఆమడ దూరంలో ఉంటుంది.
 
నోట్‌ చేసుకోండి 
ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో డైరీలో రాసుకోండి. దీనివల్ల ఏ ఆహారం తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారనే విషయం తెలుస్తుంది. దానికనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. డైరీ రాయడం అలవాటు లేకపోతే మీ స్మార్ట్‌ ఫోన్‌లో లేదా పర్సనల్‌ కంప్యూటర్‌లో ఎంటర్‌ చేయండి.
 
ఆర్గానిక్‌ ఫుడ్‌ 
అనేక వ్యాధులకు మూలం పురుగుల మందులు ఉపయోగించని కూరగాయలు తీసుకోవడం. ఈ విషయం పరిశోధనల్లో రుజువయింది. కాబట్టి క్రిమి సంహారక మందులు ఉపయోగించిన ఆహారానికి దూరంగా ఉండండి. ఎరువులు, పురుగుల మందులు వాడిన ఆహార పదార్థాలను తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలు, మెదడులోని కణాలు దెబ్బతింటాయి. కేన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే పురుగు మందులు వాడని ఆహారం తీసుకోవాలి.
 
కొనుగోలు చేస్తుంటే... 
ఫ్యాట్‌ ఫ్రీ, షుగర్‌ ఫ్రీ, కొలెస్ర్టాల్‌ ఫ్రీ...ఇలాంటి లేబుళ్ల ఆధారంగా కొనుగోలు చేయకండి. నడ్స్‌, సీడ్స్‌, ఫ్రూట్స్‌, వెజిటబుల్స్‌ను కొనండి. నిల్వ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. తాజా ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి.
 
సరికొత్త వంటలు 
ఆరోగ్యకరమైన వంటలు ఎలా తయారు చేయాలో తెలిపే పుస్తకాలు కొనండి. కొత్త వంటకాలు తయారుచేయండి. ఆహార పదార్థాల జాబితాను తయారు చేయడంలో పిల్లలు పాలుపంచుకునేలా చూడండి.
 
వ్యాయామం మరవొద్దు 
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. గుండె కండరాలు బలపడటానికి, కొలెస్ర్టాల్‌ లెవెల్స్‌ తగ్గడానికి, రక్తపోటు నియంత్రణకు, ఒబెసిటీ, డయాబెటిస్‌ వంటి వ్యాధులకు వ్యాయామం బాగా ఉపకరిస్తుంది. వ్యాయామం వల్ల మెదడులో ఎండార్ఫిన్‌ అనే కెమికల్స్‌ విడుదలవుతాయి. ఇవి మీరు రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి దోహదపడతాయి.
 
ఒత్తిడికి చెక్‌ పెట్టండి 
ప్రతిరోజు ఐదు నుంచి పదినిమిషాల పాటు మెడిటేషన్‌ చేయండి. డీప్‌ బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు, ఆసనాలు, ప్రాణాయామం చేయండి. కుటుంబ సభ్యులతో ప్రతిరోజు ఒక గంటపాటు గడపటానికి ప్రయత్నించండి. సంగీతాన్ని ఆస్వాదించండి.

హెల్త్‌ చెకప్‌ 
నలభై ఏళ్లు పైబడిన వారు ఏడాదికొకసారి, యాభైఏళ్లు పైబడిన వారు ఆరునెలలకొకసారి హెల్త్‌ చెకప్‌ చేయించుకోండి.