తక్కువ కాలంలోనే పొట్ట దగ్గరి కొవ్వు కరిగించాలంటే..

12-08-2019: పొట్ట, నడుము చుట్టూ పేరుకునే కొవ్వును కరిగించే వ్యాయామాలు ఉన్నాయి. ప్రారంభంలో కష్టంగా అనిపించినా క్రమం తప్పకుండా ప్రతి రోజూ చేస్తూ ఉంటే, యాబ్‌ వర్కవుట్స్‌తో తక్కువ కాలంలోనే పొట్ట దగ్గరి కొవ్వు కరిగించవచ్చు! ఆ వ్యాయామాలు ఏవంటే....
 
క్రంచెస్‌: వెల్లకిలా పడుకుని, నడుము పైభాగం లేదా కాళ్లు పైకి లేపడం ద్వారా పొట్ట మీద ఒత్తిడి పడేలా చేసి ఆ ప్రదేశంలోని కొవ్వు కరిగించే వ్యాయామాలివి. దీన్లో ‘బైసైకిల్‌’, ‘ఎల్బో టు నీ’ అనే రెండు రకాలు ఉంటాయి. వెల్లకిలా పడుకుని, రెండు చేతులతో తలకు ఆసరా ఇస్తూ, కాళ్లు రెండు ఒకదాని తర్వాత ఒకటి సైకిల్‌ తొక్కుతున్నట్టు గాల్లో కదిలించడమే ‘బైసైకిల్‌ క్రంచెస్‌’. కాళ్లు మోకాళ్ల దగ్గరకు మడిచి, వెల్లకిలా పడుకుని, తలకు రెండు చేతులతో ఆసరా ఇస్తూ, పైకి లేచి, కుడి మోకాలికి ఎడమ మోచేతిని తాకించాలి. అలాగే ఎడమ మోకాలికి కుడి మోచేతిని తాకించాలి. ఈ వ్యాయామంతో పొట్ట మీద ఒత్తిడి పడి ఆ ప్రదేశంలోని కొవ్వు కరుగుతుంది.
 
ఫ్లట్టర్‌ కిక్స్‌: వెల్లకిలా పడుకుని, రెండు అరచేతులు పిరుదుల అడుగున పెట్టుకుని కాళ్లు రెండూ సమాంతరంగా పైకి లేపాలి. తర్వాత కత్తెర ఆడించిన విధంగా కాళ్లూ రెండూ పైకి, కిందకూ కదిలించాలి.
 
టో టచెస్‌: వెల్లకిలా పడుకుని రెండు చేతులు తల వెనక చాచి ఉంచాలి. ఈ భంగిమ నుంచి కాళ్లూ, చేతులూ ఒకేసారి పైకి లేపాలి. ఇలా చేస్తున్నప్పుడు నడుము కదల్చకుండా నడుము అడుగున ఉండే కాళ్లు, నడుము పైన ఉండే ఛాతీ, చేతులు మాత్రమే గాల్లోకి లేపాలి.
ఈ వ్యాయామాలన్నీ 15 చొప్పున, 3 సెట్లు చేయాలి.

ఆదిత్య, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌,

పిఆర్స్‌ క్లాసిక్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌, హైదరాబాద్‌