చేతులు పటిష్ఠంగా...

14-02-2019: చేతుల చుట్టూ కొవ్వు పెరిగిపోతే ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు కొన్ని రకాల దుస్తులు వేసుకోలేం కూడా. చేతుల్ని తీరైన ఆకృతిలో, ఫిట్‌గా ఉంచుకునేందుకు తేలికైన వ్యాయామాలు ఇంటి వద్దనే చేయొచ్చు. చేతులు దృఢంగా ఉంటే మంచి లుక్‌లో కనిపిస్తారు. అందుకు ఏం చేయాలంటే..
 
వాల్‌ పుషప్స్‌: గోడకు ఎదురుగా నిల్చోవాలి. చేతుల్ని భుజాల వరకూ పైకి ఎత్తాలి. అరచేతుల్ని గోడకు నెమ్మదిగా ఆనించాలి. మోకాళ్ల సాయంతో ఛాతి, తలను కొద్దిగా ముందుకు వంచాలి. తలను స్థిరంగా ఉంచాలి. గట్టిగా శ్వాస తీసుకొని, గోడకు వీలైనంత దగ్గరగా జరగాలి. చేతులు నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
 
ఫ్లోర్‌ డిప్స్‌: పాదాలు నేలకు ఆనించి కూర్చోవాలి. కాళ్లను ముందుకు కదిలించాలి. వెన్నెముక నిట్టనిలువుగా ఉండాలి. శరీరం వెనుక భాగానికి సపోర్టుగా పాదాలను దగ్గరకు తీసుకోవాలి. చేతుల్ని తుంటి భాగంలో ఉంచి, నేలపై సమాంతరంగా పడుకోవాలి. అరచేతులతో తొడ భాగాన్ని పైకి, కిందకు కదిలించాలి. ఛాతిని ముందుకు వంచి బలమంతా భుజం భాగంలోని కండరాల మీద ఉంచాలి.
 
ప్లాంక్స్‌: చేతుల్ని భుజాల కింద ఉంచాలి. వెన్నెముక, మెడ భాగం నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తలను వెనక్కి వంచాలి. ఇదే పొజిషన్‌లో 20 నిమిషాలు ఉండాలి. మీకు సౌకర్యంగా ఉన్న ప్లాంక్స్‌ను చేయాలి.
 
ఇంచ్‌వార్మ్‌: నిటారుగా నిలబడాలి. రెండు కాళ్లను దగ్గరగా ఉంచాలి. ముందుకు వంగి, చేతులతో పాదాలను అందుకోవాలి. ఇలా చేసేటప్పుడు మోకాళ్లను ముందుకు వంచకూడదు. చేతులతో నడవాలి. మోకాళ్లు నిటారుగా ఉండాలి. పుషప్‌ పొజిషన్‌లోకి వచ్చాక ఆపేయాలి. పాదాలు, చేతులు దగ్గరికి వచ్చేంత వరకూ ఈ వ్యాయామం చేస్తే ఫలితాలు ఉంటాయి.