నెమ్మదిగా తింటే బరువు పెరగరు

ఉరుకుల పరుగుల జీవితం వల్ల హడావిడిగా తినాల్సిన పరిస్థితి దాదాపుగా అందరిదీ. అలా తినడం వెనుక వృత్తిపరమైన ఒత్తిళ్లే కారణమని ఎక్కువమంది అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు. వేగంగా తినడానికి బాల్యం నుంచీ అదో అలవాటుగా ఉండడం కూడా కారణమే అంటున్నారు వైద్యులు. ఒక్కోసారి విపరీతంగా ఆకలి వేయడం, నిర్ణీత సమయంలో భోజనం చేయాలనే నియయమేదీ పెట్టుకోకపోవడం, కొన్ని రకాల ఉద్యోగ, వ్యాపారాల్లో సమయం కుదరకపోవడం, ఇవేమీ లేకపోయినా అనాదిగా ఉన్న అలవాట్లు అంత సులువుగా వదలకపోవడం కూడా ఇందుకు కారణమే. ఎలా మొదలైనా, కాలం గడిచే కొద్దీ ఈ అలవాటు మరింతగా పెరుగుతుంది.
 
ఏమైనా చాలా వేగంగా తినే అలవాటు స్థూలకాయం రావడానికి ఒక ప్రధాన కారణమవుతోంది. ఎంత వేగంగా తింటే అన్ని ఎక్కువ కాలరీలు శరీరంలోకి వెళతాయి. ఇలా వేగంగా తింటున్నప్పుడు ఇంక చాలని చెప్పే మెదడులోని ఒక భాగం ఆ వేగం గుర్తించలేకపోతుంది. అందుకే అవసరానికి మించి కాలరీలు కడుపులోకి వెళతాయి. దానివల్లనే ఒక వ్యక్తి 400 కాలరీలు తినే కాలంలో మరో వ్యక్తి 800 కాలరీల వరకు తింటాడు. మీరు ఈ రెండో వర్గంలో ఉన్నారని గుర్తిస్తే ఆహారం తీసుకునే వేగాన్ని వెంటనే తగ్గించాలి. అందుకే ప్రతి ముద్దనూ 32 సార్లకు తగ్గకుండా నమలాలన్న ఆరోగ్య సూత్రం స్థిరపడింది. ఈ విధానంలో ఆహారం తీసుకునే వేగం బాగా తగ్గడమే కాకుండా సరిగా జీర్ణమవుతుంది. ఎక్కువ సార్లు నమిలే క్రమంలో ఆహారంలోని రసాల్ని పీలుస్తూ, అందులోని రుచిని బాగా ఆస్వాదించాలి. భోజనం సమయంలో తింటున్న ఆహారం మీదే మనసంతా లగ్నమై ఉండాలి. ఒకవేళ మీరు అన్ని ప్రయత్నాలూ చేసినా నిదానంగా తినడం మీకు సాధ్యం కాకపోతే, మామూలుగా మీరు భోజనం చేసే చేయిని మార్చాలి. అంటే కుడిచేయితో భోజనం చేసే వాళ్లు స్పూన్‌ ఉపయోగిస్తూ ఎడమ చేత్తో తినాలి. ఒకవేళ ఎడమ చేతితో తినే అలవాటు ఉంటే, కుడి చేత్తో తినాలి. ఈ కొత్త ప్రయత్నంలో అలవాటు లేని చేయి కాబట్టి సహజంగానే తినే వేగం త గ్గిపోతుంది. అది స్థూలకాయం రాకుండా కాపాడుతుంది.