తేలికగా.. తగ్గేదెలా?

 

ఆంధ్రజ్యోతి, 22-01-2019: గాలి... నీరు... ఆహారం! ఈ మూడే సమస్త జీవరాశికీ ప్రాణాధారం! అయితే శరీరానికి అవసరమయ్యే పరిమాణం విషయంలో ఈ మూడింటి మధ్య వ్యత్యాసం ఉంది! అన్నిటికంటే ఎక్కువ అవసరం గాలి. గాలి కంటే తక్కువ పరిమాణంలో శరీరానికి కావలసిన రెండవ అవసరం నీరు! గాలీ, నీరు కన్నా తక్కువ పరిమాణంలో శరీరానికి కావలసిన మూడవ అవసరం ఆహారం! ప్రకృతిలో కూడా ఈ మూడింటి నిష్పత్తి ఇలానే ఉంటుంది. అందుకే ఈ నిష్పత్తిని కాపాడుకోవడం ఆరోగ్యదాయకం!
 
బరువు పెరగడానికి జన్యుపరమైన వారసత్వ మూలాలు, థైరాయిడ్‌ హార్మోన్‌ లోపాలు, అవసరానికి మించి తినడం, వ్యాయామ లోపాలు ఇవే ప్రధాన కారణంగా ఉంటాయి. అయితే అత్యధికుల్లో చివరి రెండు కారణాలే ప్రధానంగా కనిపిస్తాయి. అవసరానికి మించి తినేవాళ్లు, సరిపడా శారీరక శ్రమ చేయని వారు సహజంగానే బరువు పెరుగుతారు. శ్రమ లోపం వల్ల శరీరంలోంచి ఉప్పు సరిగా విసర్జించబడదు. ఆ విసర్జించబడని ఉప్పు శరీరంలో నిల్వ ఉంటుంది, ఉప్పు ఎక్కడ నిల్వ ఉండాలన్నా దానికి నీరు తోడు కావాలి. ఇది ఉప్పు ఽసహజధర్మం. ఫలితంగా శరీరం ఎక్కవనీటిని నిల్వ చేస్తుంది. ఊబకాయుల్లో నీరు, కొవ్వు ఈ రెండే పెరుగుతుంటాయి. వీటివల్ల మొత్తం శరీర నిష్పత్తులే తారుమారు అవుతాయి. నీరు, ఆహారం పరిమాణాలు పెరిగే సరికి గాలి తగ్గిపోతుంది. జీవకణాలు జీవక్రియల్ని సవ్యంగా చేయాలంటే, అవసరమైన వాటిని అవసరమైన నిష్పత్తిలో ఇవ్వాలి. ఈ నిష్పత్తిలో తేడా వస్తే, బరువు పెరగడంతో పాటు, శరీరం రోగగ్రస్థమవుతుంది. ఈ స్థితిలో వాటి నిష్పత్తులను నిర్ణీత స్థాయికి అంటే 3:2:1 నిష్పత్తికి తీసుకురావాలి.
 
తిండి తగ్గిస్తే...
నిజానికి తిండి తగ్గించడం వల్ల కలిగే నష్టమే ఎక్కువ. ఉండవలసిన బరువు కంటే 20 కేజీలు అదనంగా పెరిగితే, శరీరంలో వేల కోట్ల కణాలు అదనంగా పెరుగుతాయి. పెరిగిన ఆ వేల కోట్ల కణాలను పోషించడానికి సహజంగానే గాలి, నీరు, ఆహారం అవసరం పెరుగుతుంది. ఆ అవసరం మేరకు ఆహారాన్ని అందించాలి. తిండి తగ్గించి తింటే మంచిదని కొందరు తినే అన్ని పదార్థాలను సగానికి పైగా తగ్గించేస్తారు. దీనివల్ల కొవ్వు కరగడానికి బదులుగా నీరసం వ చ్చేస్తుంది. హార్మోన్‌ వ్యవస్థలో కూడా లోపాలు తలెత్తుతాయి. ఆరోగ్యకరంగా బరువు తగ్గడం అంటే, మొత్తం 80 కేజీల శరీరానికి సరిపడా పోషకాహారం తప్పనిసరిగా తింటూ, పెరిగిన ఆ 20 కేజీల కొవ్వును కరిగించే తిండి తినాలి. అందుకు క్షేమంగా బరువు తగ్గడానికి అవసరమైన పోషక పదార్థాలేమిటో తెలుసుకోవాలి.
 
బరువు తగ్గించే పోషకాలు...
పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, లవణాలు, న్యాచురల్‌ ఎంజైములు, పీచుపదార్థాలు. ఈ ఏడు రకాల ముడి సరుకులు శరీరపోషణకు కనీస అవసరాలు. ఆకలి అవసరాన్ని తీర్చడం అంటే, ఈ ఏడు పోషక విలువలను అందించడమే! సన్నటి వారితో పోలిస్తే, లావు ఉన్న వారిలో ఎక్కువ పోషకాలు ఖర్చు అవుతాయి. ఆ మేరకు మళ్లీ ఆ పోషకాలను అందించాల్సిందే. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఏ పోషకాలను ఎక్కువగా తినాలి? ఏ పోషకాలను తగ్గించాలి అనే విషయంలో ఒక స్పష్టమైన అవగాహన ఉండడం అవసరం.
 
ఇవి ప్రధానం!
విటమిన్లు, లవణాలు, న్యాచురల్‌ ఎంజైములు మిగతా వాటికన్నా ముఖ్యమైనవి. ఎంత ఎక్కువ బరువు ఉన్నా, ఆహారంలో వీటిలోపం ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి. నిజానికి, ఇవేవీ శరీరం బరువును పెంచేవి కావు. . కానీ, శరీరాన్ని పోషించడంలో మాత్రం కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. శరీర కణాలు రోగాల బారిన పడకుండా కాపాడుతుంటాయి. రోగనిరోధకశక్తిని కలిగించడంతో పాటు, రోగగ్ర స్థమైనప్పుడు త్వరగా కోలుకునేలా చేస్తాయి.
 
మాంస కృత్తులు: శరీర నిర్మాణంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించేవి మాంసకృత్తులు. రోజుకు ఒక కేజీ శరీర బరువుకు ఒక గ్రాము ప్రొటీన్లు అవసరం. అంటే 60 కేజీలున్న మనిషికి రోజుకు 60 గ్రాములు కావాలి. అదే ఎదిగే వయసు పిల్లలకైతే రెట్టింపు అవసరం. మన శరీరంలో ప్రతి రోజూ కోటానుకోట్ల కణాలు ఆయువు తీరి చనిపోతుంటాయి. చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలను నిర్మించుకునేందుకు శరీరానికి మాంసకృత్తులు కావాలి. కొన్ని కణాలు జబ్బున పడుతుంటాయి. వాటిని రిపేరు చేయడానికి కూడా మాంసకృత్తులు అవసరం. హానికారకమైన బ్యాక్టీరియా, వైర్‌సలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటినుంచి మనల్ని కాపాడే యాంటీబాడీస్‌ తయారీకి కూడా మాంసకృత్తులే ఆధారం. అందువల్ల బరువు తగ్గాలనుకునేవాళ్లు మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలనే ఎక్కువగా తీసుకోవాలి. అయితే జంతు సంబంధమైన మాంసకృత్తులకు వెళ్లకుండా, వృక్ష సంబంధమైన మాంసకృత్తులు తీసుకోవడం శ్రేయస్కరం.
 
కొవ్వు పదార్థాలు: బరువు తగ్గించుకోవాలని తిండిని తగ్గించేవారు కొవ్వు పదార్థాలను పూర్తిగా తగ్గించివేస్తారు. ఇది ఆరోగ్యానికి నష్టదాయకమే. వాస్తవానికి కణాల పొరల నిర్మాణానికీ, కణాల పనితీరుకూ, విటమిన్లలా శరీరాన్ని నడిపించానికి, కావలసిన శక్తినివ్వడానికి రోజుకు 20 నుంచి 25 గ్రాముల కొవ్వు పదార్థాలు అవసరం. కాకపోతే అంతకు మించి కొవ్వు పదార్థాలు తింటే నష్టదాయకమే! ఏమైనా, బరువు తగ్గాల్సిన వారు తీసుకునే ఆహారం తక్కువ శక్తిని , ఎక్కువ పోషకాలను అందించేదిగా ఉండాలి. అంతేతప్ప బరువు తగ్గాలని పొట్టను మాడ్చవలసిన అవసరం లేదు.
వారు సంతృప్తిగా తింటూనే బరువు తగ్గవచ్చు.
 
ఏ వ్యాయామం శ్రేష్ఠం?
బరువు తగ్గడానికి యోగాను ఎంచుకోవచ్చు. బరువు పెరగడం అనేది అందరిలోనూ ఒకేలా ఉండదు. ఒక్కొకరిలో ఒక్కో చోట పెరుగుదల కనిపిస్తుంది. కొందరిలో పొట్ట మాత్రమే పెరిగితే, మరికొందరికి తొడ వెనుక భాగం, నడుము భాగంలో బరువు పెరుగుతుంది. అందువల్ల ఆయా అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ఆసనాలను ఎంచుకోవాలి. కొవ్వు పెరిగిన ప్రదేశాలనుబట్టి సాధన చేయవలసని
ఆసనాలు ఇవే!
 • పొత్తి కడుపు తగ్గాలంటే - ఉత్థానపాదాసనం
 •  పై పొట్ట తగ్గాలంటే - నౌకాసనం
 • పక్క భాగం తగ్గాలంటే - వక్రాసనం
 • వీపు తగ్గాలంటే - భుజంగాసనం
 • పిరుదులు తగ్గాలంటే - శలభాసనం
 • తొడలు తగ్గాలంటే - సుప్త వజ్రాసనం
 • జబ్బలు తగ్గాలంటే - గోముఖాసనం
 • పిక్క భాగం వెనుక భాగం తగ్గాలంటే - ధనురాసనం
 • నడుము భాగం తగ్గాలంటే - సర్పాసనం
ఇలా అవసరానికి తగిన ఆసనాలు ఎంచుకోవాలి. ఇలా ఆహార నియమాలు, వ్యాయామాల విషయాల్లో శ్రద్ద వహిస్తే, శరీరాన్ని పెద్దగా కష్టపెట్టకుండానే బరువు తగ్గిపోవచ్చు.
 
నివేదికలు ఏమంటున్నాయి?
భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, దేశంలో ఊబకాయులైన పిల్లలే కోటి, 40 లక్షల మంది ఉన్నారు. అయితే, కేవలం 1980-2015 మధ్యలోనే అంతకుముందున్న ఊబకాయ పిల్లల సంఖ్య రె ట్టింపయ్యిందని కూడా ఆ నివేదిక పేర్కొంది. పెద్ద వారి సంఖ్య అయితే ఈ వ్యవధిలో మూడు రెట్లు పెరిగినట్లు అందులో పేర్కొన్నారు. పైగా, 2025 నాటికి ఊబకాయులైన పిల్లల సంఖ్య మరో 26 లక్షలు పెరిగే అవకాశం ఉందని కూడా ఆ నివేదిక పేర్కొంది.
 
పిల్లల్లో స్థూలకాయం
పిల్లల్లో స్థూలకాయం క్రమక్రమంగా ఒక మహమ్మారిలా వ్యాప్తి చెందుతోంది.. రోజువారీ ఆహార పానీయాలతో పాటు పాల ఉత్పత్తులు, ఐస్‌క్రీములు, కార్బోనేటెఢ్‌ డ్రింక్స్‌, జంక్‌ఫుడ్స్‌ వంటివి అతిగా తినడం వల్ల కూడా పిల్లల్లో అధిక బరువు, స్థూలకాయం ఏర్పడతాయి. దీనివల్ల పిల్లల్లోనూ, అధికరక్తపోటు,, టైప్‌-2 మధుమేహం, ఫ్యాటీ లివర్‌ వ్యాదులు వస్తున్నాయి.
 
పిల్లలు ఇలా ఉండడం మామూలేనని వదిలేస్తే, పెద్దవాళ్లయ్యాక కూడా ఆ స్థూలకాయం అలాగే కొనసాగే అవకాశం ఉంది.
 
నిర్లక్ష్యం చేస్తే...
దానికదే త గ్గిపోతుందిలే అనుకుని స్థూలకాయాన్ని నిర్లక్ష్యం చేస్తే, ట్రైగ్లిజరైడ్లు, రక్తంలో ఎల్‌.డి.ఎల్‌ నిల్వలు పెరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతంతో పాటు మెటబాలిక్‌ి సిండ్రోమ్‌, స్లీప్‌ అప్నియా, ఆస్ట్రియో ఆర్థరైటిస్‌ వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. స్థూలకాయం ఎక్కువ కాలం కొనసాగితే, లైంగిక సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది,. స్థూలకాయం ఒక దశ దాటితే బేరియాట్రిక్‌, ల్యాప్రోస్కోపిక్‌ వంటి సర్జరీలే తప్ప మరో మార్గం ఉండదు. ఆ స్థితి రాకుండా ఉండాలంటే స్థూలకాయం రాకుండా నివారణ చర్యలను చేపట్టడమే ఉత్తమం
అందులో భాగంగా...
 
 • పోషకాలు ఎక్కువగా ఉండి, కేలరీలు తక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి.
 • కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి.
 • నిద్ర విషయంలో నిర్దిష్టమైన వేళలు పాటించాలి.
 • అన్నింటినీ మించి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
 • ఎక్కడా రాజీ పడకుండా, ఈ నియమాలు పాటిస్తే అతి తక్కువ కాలంలోనే అధిక బరువు, స్థూలకాయం సమస్యలను అధిగమించడం సుసాధ్యమే!
గర్భధారణలోనూ...
కదలికలు బాగా తగ్గిపోవడం వల్ల గర్భధారణ సమయంలో జీవక్రియల రేటు తగ్గిపోతుంది. ఇది కూడా శరీరం బరువు పెరిగే కారణమవుతుంది. ప్రసవం త ర్వాత కూడా కొందరిలో ఆ బరువు అలాగే కొనసాగుతూ ఉంటుంది. అంతిమంగా ఇది స్థూలకాయానికి దారి తీయవచ్చు.
ఒక వ్యక్తి ఎత్తుకు, అతని శరీర బరువుకూ మధ్య నిష్పత్తిని బాడీ మాస్‌ ఇండెక్స్‌ ( బి.ఎమ్‌.ఐ-/ శరీర ద్రవ్య సూచి) స్థూలకాయాన్ని కొలిచే ఒక విధానం. అలాగని ఇదొక్కటే ప్రామాణికం కాదు.. నడుము చుట్టుకొలత, పిరుదుల పరిమాణం కూడా పరిగణనలోకి వస్తుంది. మన దేశంలో బి.ఎమ్‌.ఐ 25 ఉంటే అధిక బరువుగానూ, అంతకన్నా ఎక్కువ ఉంటే స్థూలకాయంగానూ పరిగణిస్తారు. అదే పాశ్చాత్యుల్లో అయితే, బి.ఎమ్‌.ఐ 30 కన్నా ఎక్కువగా ఉంటేనే స్థూలకాయంగా గుర్తిస్తారు. స్థూలకాయం కారణంగా అధిక రక్తపోటు, టైప్‌- 2 మధుమేహంతో పాటు, గుండె జబ్బులు సంక్రమిస్తాయి. బరువు తగ్గితే ఆ కారణంగా వచ్చిన వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.
 
ఏమిటా కారణాలు?
 •  కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం, శరీరశ్రమ లోపం, కొన్ని ఆరోగ్య సమస్యలు, వయస్సు పైబడటం, గర్భధారణ, నిద్రలేమి వంటివి ఇందుకు గల ప్రధాన కారణాలు.
 • కొన్ని కుటుంబాల్లో స్థూలకాయం, వారసత్వంగా కూడా వస్తూ ఉంటుంది. దీనికి కారణం జన్యువులే కాదు, కుటుంబ సభ్యులంతా తీసుకునే ఒకే తరహా ఆహారం కూడా అందుకు కారణమే!
 • కీళ్ల నొప్పులు ఉన్న వాళ్లు సహజంగానే శరీర శ్రమకు దూరమవుతారు. ఇది కూడా అధిక బరువుకూ, స్థూలకాయానికీ కారణమవుతూ ఉంటుంది.
 • హైపోథైరాయిడిజం, ప్రీడర్‌, విల్లో సిండ్రోమ్‌, కుషింగ్స్‌ సిండ్రోమ్స్‌ లాంటివి కూడా శరీర బరువు పెరిగేలా చేస్తాయి.
 • మానసిక కుంగుబాటు, ఫిట్స్‌, మధుమేహం, మానసిక రుగ్మతలకు వాడే మందులు, ఇంకొందరిలో బీటాబ్లాకర్లు, స్టిరాయిడ్‌ ఔషధాలు కూడా స్థూలకాయానికి కారణమవుతూ ఉంటాయి.
 • కొంత మంది చిన్న పిల్లల్లో కూడా స్థూలకాయం కనిపిస్తుంది. కాకపోతే వయసు పెరిగే కొద్దీ వాళ్ల బరువు క్రమంగా తగ్గిపోతుంది.
 • హార్మోన్లలో వచ్చే మార్పు కూడా కొందరిని స్థూలకాయులుగా మార్చేస్తుంది.
 • సరిపడా నిద్రలేకపోవడం వల్ల కూడా కొందరిలో హార్మోన్‌ సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల ఆకలి అఽధికమై, అతిగా తినేయడం వల్ల కూడా శరీరం బరువు పెరుగుతుంది.