ఇలా చేస్తే... బరువు పెరగరు!

12-04-2019: మేడమ్‌! మీరు చెప్పిన ‘సెవన్‌ డే డైట్‌’ నెలకు ఒకసారి ఫాలో అయ్యాను. బరువు బాగానే తగ్గాను. కానీ, ఒక్కోసారి ఒకటి రెండు కిలోలు పెరుగుతున్నాను. ఒకసారి తగ్గిన బరువు మళ్ళీ ఇలా పెరగకుండా ఉండాలంటే మిగిలిన రోజుల్లో ఎలాంటి ఆహరం తీసుకోవాలో చెప్పండి!

- రాజ్యలక్ష్మి, అమలాపురం
 
నెలకు ఒక్కసారి ‘సెవన్‌ డే డైట్‌’ విధానాన్ని అనుసరిస్తూ, మిగిలిన రోజుల్లో వేరే ఆహారం తీసుకోవడం ఉత్తమం. అలా చేస్తే, బరువు పెరగకుండా ఉంటారు. దీన్నే ‘మెయిన్‌టెనెన్స్‌ డైట్‌’ అంటారు. మీ శరీరానికి తగ్గట్టు ఐడియల్‌ బాడీ వెయిట్‌ వచ్చేస్తే, అప్పుడు ఈ ‘సెవన్‌ డే డైట్‌’ కూడా మానేయవచ్చు. కేవలం ‘మెయిన్‌టెనెన్స్‌ డైట్‌’ అనుసరిస్తే సరిపోతుంది. అవసరమనుకున్నప్పుడు తిరిగి ‘సెవన్‌ డే డైట్‌’ చేయవచ్చు.
మీ శరీరానికి తగ్గ ఐడియల్‌ బాడీ వెయిట్‌ ఎంత అనేది ఈ విధంగా తెలుసుకోండి: మీ పొడవును సెంటీమీటర్లలో కొలవండి. అందులోంచి వంద మైనస్‌ చేయండి. అప్పుడు మీరు ఉండవలసిన బరువు, అంటే ఐడియల్‌ బాడీ వెయిట్‌ వస్తుంది.
 
ఇదీ... మెయిన్‌టెనెన్స్‌ డైట్‌!
ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. అది ఏమిటంటే... ‘సెవన్‌ డే డైట్‌’ కేవలం నార్మల్‌ హెల్త్‌ ఉన్నవారు మాత్రమే చెయ్యాలి. కానీ, మెయిన్‌టెనెన్స్‌ డైట్‌ మాత్రం ఎవరైనా ఫాలో కావచ్చు.
 
ఉదయం ఏడు గంటలకు: ఒక పండు + గ్రీన్‌ టీ
ఎనిమిది గంటలకు: ఒక పెసరట్టు + చట్నీ + మజ్జిగ, లేదంటే ఆరంజ్‌ జ్యూస్‌
పదకొండు గంటలకు: పది బాదం పప్పులు + మజ్జిగ
మధ్యాహ్నం ఒంటి గంటకు: వెజిటబుల్‌ సలాడ్‌ + బ్రౌన్‌ రైస్‌ ఒక కప్పు + పప్పు + ఆకుకూర + మజ్జిగ
సాయంత్రం నాలుగు గంటలకు: ఏదైనా పండు + గుప్పెడు గుమ్మడి గింజలు
సాయంత్రం ఆరు గంటలకు: సూప్‌
రాత్రి ఎనిమిది గంటలకు: వెజిటబుల్‌ సలాడ్‌ + రెండు పుల్కాలు + అలసందలు, వెజిటబుల్‌ కర్రీ + మజ్జిగ.
 
  
- డాక్టర్ బి. జానకి, న్యూట్రిషనిస్ట్.