ఉద్యోగినులకూ ఉందో డైట్‌ ప్లాన్‌!

08-08-2019: ఉద్యోగం చేసే మహిళలకు ఫిట్‌నెస్‌ మెయింటేన్‌ చేసేందుకు దొరికే సమయం చాలా తక్కువ. ఎక్కడ బరువు పెరిగిపోతామనే ఆందోళన పడుతుంటారు చాలామంది. కొందరైతే కొంచెం బరువు పెరగ్గానే ఎక్సర్‌సైజ్‌లు చేసేస్తుంటారు. అయితే వరవుట్స్‌ చేయాల్సిన అవసరం లేకుండానే సరైన ఆహారప్రణాళికతో తొందరగా బరువు తగ్గవచ్చు అంటున్నారు డైటీషియన్‌ సుమన్‌ పహుజా. ఆరోగ్యంతో పాటు బరువు నియంత్రణలో ఉండేందుకు ఆమె చెబుతున్న డైట్‌ ప్లాన్‌ ఇది.
 
బ్రేక్‌ఫాస్ట్‌ తప్పనిసరి: ఆఫీసుకు ఆలస్యం అవుతుందనే కంగారులో బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుండానే పరుగుతీస్తారు చాలామంది. దాంతో లంచ్‌ సమయానికి బాగా ఆకలివేస్తుంది. ఫ్యాట్స్‌, చక్కెరలు అధికంగా ఉన్న ఫుడ్‌ ఎక్కువ మొత్తంలో లాగించేస్తారు. ఫలితంగా బరువు పెరుగుతారు. అలాకాకుండా ఉదయం అల్పాహారం తీసుకోవడం ద్వారా జీవక్రియలు ఉత్తేజితమవుతాయి.
 
నో టు కాఫీ, టీ: ఆరోగ్యం కోసం హెల్తీఫుడ్‌ ఎంత ముఖ్యమో హెల్తీ డ్రింక్స్‌ తీసుకోవడం అంతే ముఖ్యం. పనిచేసే చోట కప్పుల కొద్దీ కాఫీ తాగే అలవాటు కొందరికి ఉంటుంది. అయితే చాలా కాఫీ షాప్స్‌ ఎక్కువ షుగర్‌ ఉన్న కాఫీ సర్వ్‌ చేస్తాయి. దాంతో ఎక్కువ మొత్తంలో షుగర్‌ ఒంట్లోకి చేరుతుంది. కాబట్టి రోజుకు కప్పు కాఫీ లేదా టీతో సరిపెట్టుకోవాలి.
 
హోమ్‌ మేడ్‌ ఫుడ్‌: ఆఫీసు క్యాంటీన్‌లో లేదా ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసి లంచ్‌ ముగిస్తారు కొందరు. లంచ్‌ చేయకుండా క్యాలరీలు ఎక్కువగా ఉన్న స్నాక్స్‌ తీసుకోవడం కూడా ఆరోగ్యాన్నీ, ఫిట్‌నె్‌సను దెబ్బతీస్తుంది. అందుకే ఇంటి భోజనానికే ప్రాధాన్యమివ్వాలి. లంచ్‌బాక్స్‌లో కూరగాయలు, చపాతీలు, అన్నం, పప్పు, ఏదైనా సలాడ్‌ ఉండేలా
చూసుకోవాలి.
 
డిన్నర్‌: రాత్రిపూట తేలికైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఉన్న ఫుడ్‌ తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఆహారంలో కొవ్వు తక్కువగా, ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. సులభంగా జీర్ణం అవుతుంది. రోజంతా అలసిపోయిన శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.