పత్రికల్లో వచ్చే వంటలకూ..

ఆంధ్రజ్యోతి, 25/07/2015: స్వీట్లు తింటే బరువు పెరుగుతారని, కూరగాయలు, పండ్లు తింటే బరువు తగ్గుతారనేది తెలిసిన విషయమే. అయితే పత్రికల్లో వచ్చే ఆహార సంబంధ వార్తలకూ, ఊబకాయానికీ సంబంధం ఉందని ఇటీవల అధ్యయనంలో వెల్లడైంది. పత్రికల్లో ఏ విధమైన ఆహార విషయాలను చదువుతున్నారో తెలుసుకుంటే, దానిని బట్టి మూడేళ్లలో దేశ జనాభాలో ఎంతమంది ఊబకాయంతో బాధపడతారో కనిపెట్టడం సులభమని ఇటీవల అధ్యయనంలో తేలింది. న్యూయార్క్‌ టైమ్స్‌, లండన్‌ టైమ్స్‌ వంటి పత్రికల్లో 50 ఏళ్లుగా వచ్చిన ఆహార పదార్థాల పేర్లను ఇందులో విశ్లేషించారు. ఇందులో వివిధ పత్రికల్లో ఆహార పదార్థాలపై వచ్చిన కథనాలను, దేశంలోని జనాభా సరాసరి బీఎంఐకి గల సంబంధాన్నీ అధ్యయనం చేశారు. దీని ప్రకారం తియ్యటి పదార్థాల గురించి చదివినవారు మూడేళ్లలో ఊబకాయులుగా మారారని తేలింది. కూరగాయలు, పండ్లు వాటి గురించి చదివిన వారిలో ఊబకాయ సమస్య తక్కువగా ఉందని నిర్ధారించారు. తియ్యటి పదార్థాల గురించే ప్రస్తుతం వార్తా పత్రికల్లో ఇస్తున్నారని, పండ్లు, కూరగాయల గురించి తక్కువగా ఇస్తున్నారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.