బరువు తగ్గాలంటే రాత్రి పడుకునే ముందు...

13-06-2019:రాత్రి పడుకునేముందు టీవీని ఆన్‌లో‌ ఉంచి, లేదా లైట్లు ఆర్పకుండా వదిలివేసి అలానే పడుకునే అలవాటు ఉంటే అది ఆరోగ్యాన్ని హరించివేస్తుంది. ఒక అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం రాత్రివేళ కృత్రిమ వెలుగులో నిద్రించే మహిళల్లో బరువు పెరుగుదల ముప్పు పొంచివుంటుందని వెల్లడైంది. ఈ పరిశోధనను జేఏఏఎం ఇంటర్నేషనల్ మెడిసిన్ వెలువరించింది. దీనిలో రాత్రవేళ పడుకునే ముందు కృత్రిమ వెలుతురు, మహిళలు బరువు పెరుగుదల మధ్యనున్న సంబంధం గురించిన వివరాలు వెల్లడించారు. ఈ పరిశోధనను 44 వేల మంది మహిళలపై నిర్వహించారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం రాత్రివేళ కృత్రిమ వెలుతురులో అంటే టీవీ, మొబైల్ ఫోన్, స్ట్రీట్ లైట్, ఇంటి సమీపంలోని రోడ్డుపై తిరిగే కార్ల వెలుతురు మొదలైనవి శరీర బరువు పెరుగుదలకు కారణంగా నిలుస్తాయి. కాగా నిద్రపోయే ముందు లైట్లను ఆపివేయడం ద్వారా శరీర బరువు తగ్గేందుకు అవకాశాలున్నాయి. అమెరికాలోని జాతీయ ఆరోగ్య సంస్థ మొత్తం 44 వేల మంది మహిళలపై ఈ అధ్యయనం నిర్వహించింది. కృత్రిమ వెలుతురులో పడుకునే మహిళల్లో బరువు పెరిగేందుకు 17 శాతం అవకాశాలు అధికంగా ఉన్నాయని వెల్లడైంది. ఈ సందర్భంగా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇన్ నార్త్ కరోలినాకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ డేల్ శాండ్లర్ మాట్లాడుతూ గడచిన కొన్న దశాబ్ధాల్లో స్థూలకాయమనేది పెద్ద సమస్యగా పరిణమించింది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా మహిళల్లో బరువు పెరుగుదల కనిపిస్తోంది. అలాగే రాత్రివేళ కృత్రిమ వెలుతురులో నిద్రిస్తున్న కారణంగానూ బరువు పెరుగుదల సమస్య తలెత్తుతోంది. ఇలా కృతిమ లైటింగ్‌లో పడుకున్న కారణంగా మెటాటోనిన్ సిగ్నలింగ్ సమస్య తలెత్తుతుంది. దీంతో నిద్ర తగ్గి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు.