ఒంటరి పిల్లల్లోనే ఊబకాయం అధికం

ఆంధ్రజ్యోతి, 31/01/2014:బరువు పెరగడంలో తోబుట్టువులు ఉన్న పిల్లలకూ, తోబుట్టువులు లేని పిల్లలకూ తేడా ఉందని ఒక కొత్త అధ్యయనంలో వెల్లడైంది. స్వీడెన్‌తో సహా ఎనిమిది యూరోపియన్‌ దేశాల్లో సుమారు పదమూడు వేల మంది పిల్లలను పరీక్షించిన తరువాత నిపుణులు ఈ నిర్ణయానికి వచ్చారు. తోబుట్టువులు అంటే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు లేని పిల్లలు త్వరగా లావవడానికి అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. ఈ అధ్యయనంలో స్వీడెన్‌కు చెందిన గోటెన్‌బర్గ్‌ యూనివర్సిటీ కూడా పాల్గొంది.
 
పిల్లల్లో స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలకు కారణాలను కనుక్కోవడానికి ఈ అధ్యయనం జరిగింది. రెండు నుంచి 9 ఏళ్ల లోపు పిల్లల్ని నిపుణులు ఈ అధ్యయనంలో భాగంగా పరీక్షించారు. ఆహారం, జీవనశైలి, వారసత్వం, ఆరోగ్యం వంటి కారణాలను ఇక్కడ నిపుణులు పరిశీలించారు. తోబుట్టువులున్న పిల్లల కంటే తోబుట్టువులు లేని పిల్లల్లో ఊబకాయం రావడానికి 50 శాతానికి పైగా అవకాశాలు ఎక్కువని నిర్ధారణ అయింది. వీటికి ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వారసత్వం కూడా తోడైతే ఊబకాయం ఇక పెరగడమే తప్ప తగ్గడం జరిగే పని కాదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లితండ్రులు ఊబకాయాలతో ఉన్నప్పుడు పిల్లలను మరింత జాగ్రత్తతతో పెంచాల్సి ఉంటుందని, ముఖ్యంగా ఆహారం, జీవనశైలి వంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని కూడా నిపుణులు చెబుతున్నారు.
 
ఇక పిల్లల్లో ఊబకాయం రావడానికి ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వారసత్వాలతో పాటు టీవీ, కంప్యూటర్‌, సెల్‌ ఫోన్‌ల వాడకానికి సంబంధించిన అలవాటు కూడా అత్యధికంగా దోహదం చేస్తోందని నిపుణులు వెల్లడించారు. వారసత్వం కారణంగా ఊబకాయం సంక్రమించినా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకుని కొంత వరకూ ప్రయోజనం పొందవచ్చని, అయితే, ఇందుకు తప్పనిసరిగా ఆటలు, వ్యాయామాలను అలవరచుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచించారు. ‘‘పిల్లలు బయటికి వెళ్లి ఆడుకోవడం కంటే ఇంట్లో కూర్చుని టీవీ, కంప్యూటర్లు చూడడానికే ప్రాధాన్యమిస్తున్నారు. పిల్లలకు విడిగా వారి బెడ్‌ రూమ్‌లలో టీవీలను ఏర్పాటు చేయడం వారి ఆరోగ్యాలకు తీరని సమస్యగా మారిపోయింది’’ అని గోటెన్‌బర్గ్‌లోని సాహల్‌గ్రెన్‌స్కా అకాడమీ అనే యూనివర్సిటీకి చెందిన మోనీకా హన్స్‌బెర్జర్‌ వివరించారు.
 
లక్షణాల పట్ల అప్రమత్తం 
ఇతర కారణాలన్నిటికన్నా పిల్లలు ఒంటరిగా ఉండడం, లావు పెరగడం అనే రెండంశాలకు అవినాభావ సంబంధం ఉందని ఆయన తెలిపారు. ‘‘ఒకే సంతానంగా ఉన్న పిల్లవాడు తప్పకుండా బరువు పెరుగుతాడు. అన్నదమ్ములున్నవారు బరువు పెరగడం చాలా తక్కువ. ఇందులో సందేహమేమీ లేదు’’ అని ఆయన చెప్పారు. ఇంట్లో ఒకే పిల్లాడుగానో, అమ్మాయిగానో ఉండడం అనేది శారీరకంగా, మానసికంగా ఓ పెద్ద సమస్యే. ఒంటరి సంతానం అనారోగ్యాలకు ఎక్కువగా గురవుతున్నారని ఆయన తెలిపారు. ఇతర కారణాలేవీ లేకపోయినా, ఒంటరి సంతానం అయ్యే సరికి తప్పకుండా ఊబకాయం వచ్చిపడుతోందని కూడా ఆయన తెలిపారు. ఏకైక సంతానం ఇంటి పట్టునే ఉండడానికి ఇష్టపడతారని ఆయన చెప్పారు.
 
ఐరోపా దేశాలలో పిల్లల్లో ఊబకాయం అనే సమస్య నానాటికీ పెరిగి పెద్దదవుతోంది. ఈ దేశాల్లో రెండున్నర కోట్ల మంది పిల్లలు స్థూల కాయంతో నానా అవస్థలూ పడుతున్నట్టు వెల్లడైంది. ఇటలీ, స్పెయిన్‌, సైప్రస్‌ వంటి దేశాలలో ఈ సమస్య మరీ ముదిరిపోయి ఉందని, స్వీడన్‌లో ఇది కాస్తంత తక్కువ స్థాయిలో ఉందని తెలిసింది. పైగా పిల్లల్లో స్థూలకాయాన్ని అధ్యయనం చేస్తున్న నిపుణులకు మధుమేహం అనేది వయసు పైబడినవారికి మాత్రమే పరిమితం కాలేదన్న వాస్తవం కళ ్లకు కట్టింది. ఊబకాయానికి దారితీస్తున్న కారణాలే కొందరు పిల్లల్లో మధుమేహానికి కూడా కారణమవుతున్నాయని వారి అధ్యయనంలో బయటపడింది.
 
‘‘గత దశాబ్ద కాలంలో మధుమేహం లేదా షుగర్‌ ఉందా లేదా అని పరీక్షించుకోవడానికి వచ్చే వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. దాన్ని బట్టి తేలిందేమిటంటే, పిల్లల్లో మధుమేహం క్రమంగా పెరుగుతోంది. ఇది నిజంగా ఆందోళన కలిగించే పరిణామం’’ అని స్వీడన్‌లోని ఫోర్టిస్‌ హాస్పిటల్‌లో శిశు వైద్య విభాగానికి అధిపతిగా ఉన్న ఐ.పి.ఎస్‌. కొచార్‌ చెప్పారు. ఆయన కూడా ఈ అధ్యయనంలో కీలకపాత్ర పోషించారు. ‘‘టైప్‌-1 డయాబెటిస్‌ జీవనశైలితో ముడిపడిన సమస్య కాదు. ఇది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, జీవనశైలితో ముడిపడిన టైప్‌-2 డయాబెటిస్‌ కూడా పిల్లల్లో కనిపిస్తోంది. ఇది నిజంగా ఆందోళన కలిగిస్తోంది’’ అని ఆయన తెలిపారు. భారతదేశంలో దాదాపు పది లక్షల మంది పిల్లల్లో డయాబెటిస్‌ లక్షణాలున్నట్టు ఆయన తెలిపారు. ‘‘దేశంలో పిల్లల్లో ఊబకాయం పెరిగిపోతోంది. డయాబెటిస్‌ కూడా పెరిగిపోతోంది. శరీరానికి పని తక్కువవుతోంది. దేశంలో ఆట మైదానాలు మాయమైపోతున్నాయి. ఇక పిల్లల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎలా ఆశించగలం?’’ అని కొచార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
 
‘‘పిల్లలు ఎక్కువగా నీళ్లు తాగుతున్నా, ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తున్నా, బరువు పెరుగుతున్నా, వారిలో ఆకలి పెరుగుతున్నా వెంటనే జాగ్రత్త పడడం మంచిది’’ అని ఆయన సూచించారు. పిల్లలకు పదేళ్లు దాటినప్పటి నుంచీ తరచూ పరీక్షలు చేయించడం మంచిదని సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌లో ఎండాక్ర్టినాలజిస్ట్‌, డయాబెటాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ అర్చనా దయాల్‌ ఆర్య సలహా ఇచ్చారు. గ్రామాల్లో కంటే నగరాలు, పట్టణాల్లోనే పిల్లలు ఎక్కువగా ఊబకాయానికి, డయాబెటిస్‌కు గురవుతున్నారని ఢిల్లీ డయాబెటిస్‌ రిసెర్చ్‌ సెంటర్‌ అధిపతి డాక్టర్‌ ఎ.కె. జింగన్‌ తెలిపారు. నగరాల్లో పిల్లలకు శారీరకమైన కార్య కలాపాలు తక్కువ.