ఏది నిజం?

13-08-2018:డాక్టర్‌! నా స్నేహితుడికి సంవత్సరం క్రితం పెళ్లయింది. అయితే లైంగికపరమైన అంశాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల, ఇద్దరి మధ్యా దూరం పెరిగి ఇప్పుడు విడాకులకు సిద్ధమయ్యారు. కొద్ది రోజుల్లో నాకూ పెళ్లవబోతోంది. నా స్నేహితుడికి జరిగినట్టుగా నాకూ జరగకుండా ఉండడం కోసం ఇంటర్నెట్‌లో సమాచారం కోసం వెతికితే, ఒక్కో వెబ్‌సైట్‌లో ఒక్కో రకమైన సమాచారం దొరుకుతోంది. వాటితో నాలో కొత్త అనుమానాలు, భయాలు మొదలయ్యాయి. నా సమస్యకు తగిన సలహా ఇవ్వగలరు!
- ఓ సోదరుడు, హైదరాబాద్‌.
 
మీలాంటి పరిస్థితిని ఈ తరం యువత ఎక్కువగా ఎదుర్కొంటోంది. సంసార జీవితం, పునరుత్పత్తికి సంబంధించిన విషయాల పట్ల అవగాహన లేకుండా పెళ్లికి సిద్ధపడడం కంటే వాటి గురించి పూర్తిగా తెలుసుకుని ముందడుగు వేయడం ఎంతో అవసరం. ఇందుకోసం ఇంటర్నెట్‌ని కాకుండా వైద్యుల్ని ఆశ్రయించాలి. కొందరు స్నేహితుల ద్వారా విన్నది, ఇంటర్నెట్‌లో చూసింది, ఇంకెవరో చెప్పినవి విని ఎన్నో అపోహలు ఏర్పరుచుకుంటూ ఉంటారు. నిజానికి ఏ ఇద్దరి వేలి ముద్రలు ఒకేలా ఉండనట్టే లైంగికపరమైన అంశాల పట్ల ఇష్టాయిష్టాలు, అభిరుచులు ఒకేలా ఉండవు. కాబట్టి ఒకరికి వర్తించింది, మరొకరికి వర్తించదు. ఇలాంటప్పుడు తగిన, సరైన అవగాహన కోసం ‘ప్రీ మారిటల్‌ కౌన్సిలింగ్‌’ తీసుకోవాలి. దీని ద్వారా అనుమాన నివృత్తీ చేసుకోవచ్చు. లేనిపోని భయాలు, అపోహలు కూడా పోతాయి.
 
- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి,
ఆండ్రాలజిస్ట్‌, ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీ హిల్స్‌, హైదరాబాద్‌.