కోపాన్ని నిగ్రహించుకోవడం ఎలా?

తన కోపమే తన శత్రువు అని పెద్దలు ఏనాడో చెప్పారు. ‘నీ ముక్కు మీద కోపం, నీ ముఖానికే అందం’ అని ఓ సినీ కవి అన్నాడు. అప్పుడప్పడు కోపం రావడం కూడా ఆరోగ్యకరమైన విషయమే అని నిపుణులు చెబుతున్నారు. ఎవరెలా చెప్పినా కోపం వచ్చిన వచ్చినప్పుడు మాత్రం మంచి, చెడు విచక్షణ కోల్పోవడం మానవ సహజం. ఎదుటి వారికి కోపం వస్తే మనల్ని మనం ఎలా నిభాయించుకోవాలి? అనేది ముఖ్యం. అయితే, మనకు కోపం వచ్చినప్పుడు ఎలా నిగ్రహించుకోవాలి? అనేది అంతకన్నా ముఖ్యం.

ఎదుటి వారు మనమీద అకారణంగా కోపం తెచ్చుకుంటే సర్దిచెప్పుకోవచ్చు. కానీ ఎదుటి వారిమీద మనకు కోపం రావడానికి అనేక కారణాలు ఉంటాయి. బాసు మీద మనకు కోపం వస్తే దిగమింగుకోవాలే తప్ప అదేమిటని ప్రశ్నించినా, మాట తూలినా మొదటికే మోసం వస్తుంది. ఉద్యోగం ఊడటమో, బదిలీపై శంకరగిరిమాన్యాలు పట్టడమో ఖాయం. సాటి ఉద్యోగులపై కోపం వస్తే పనిలో సహకారం ఉండదు. ఇరుగుపొరుగు వారిపై కోపం వచ్చినా మంచిచెడుల్లో తేడాలు వస్తాయి. పిల్లలకు కోపం వచ్చినప్పుడు లాలనచేసి బుజ్జగిస్తే పరిస్థితి త్వరగా సద్దుమణుగుతుంది. ఎటువంటి సందర్భమైనా కోపాన్ని నిగ్రహించు కోవడం వల్ల ఇతరులతో సంబంధాలు సామరస్యంగా ఉండటమే కాదు, మన ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు రాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న చిట్కాలతో కోపాన్ని నిగ్రహించుకోవచ్చని వారు వివరిస్తున్నారు.

సానుకూలంగా ఎదుర్కోవాలి

పట్టరాని కోపం వస్తే అది బంధాలను చెరిపేయడమే కాదు, మానసిక–శారీరక ఆరోగ్యానికి కూడా చేటు తెస్తుంది. కోపంతో మీరు అనే మాటలు, చేసే పనుల కారణంగా ఆ తర్వాత మీరు బాధపడే పరిస్థితి వస్తుంది. ట్రాఫిక్‌లో ఎవరైనా మీ వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసినా, పిల్లలు అల్లరి చేస్తున్నా కోపం రావడం కద్దు. సానుకూలంగా ఆలోచిస్తే వచ్చిన కోపం ఇట్టే కరిగిపోతుంది. అవతలి వ్యక్తికి ఏదైనా ముఖ్యమైన పని ఉందేమో, అందుకే అలా ఓవర్‌టేక్‌ చేయాల్సి వచ్చిందేమో అని ఒక్క క్షణం పాటు అనుకుంటే అసలు కోపమే రాదు. అల్లరి పిల్లలు చేయకపోతే పెద్దలు చేస్తారా? అని సానుకూలంగా మనసుకు సమాధానం చెప్పుకుంటే చాలు కోపం కాస్తా హుష్‌ కాకి. ఒక్కోసారి మనం కూడా పిల్లలుగా మారి వారితో కలిసి అల్లరి చేస్తాం. 

 అంకెలు లెక్కపెట్టండి

కోపం వచ్చినప్పుడు తమాయించుకోండి. ఒకటి నుంచి 10 వరకూ లేదా 10 నుంచి ఒకటి వరకూ అంకెలు లెక్కపెట్టండి. ఏదైనా సందర్భంగా పిచ్చిగా కోపం వస్తే మాత్రం 100 వరకూ అంకెలు లెక్కపెట్టండం మంచిది. అయితే అంకెలు వల్లించేటప్పుడు సాధ్యమైనంత నెమ్మదిగా చేయండి. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం నెమ్మదిస్తుంది. క్రమంగా కోపం తగ్గిపోతుంది.

శ్వాసపై దృష్టిపెట్టాలి

‍కోపం వచ్చినప్పుడు శ్వాస తీసుకునే వేగం పెరిగిపోతుంది. దీంతో శ్వాస సరిగా అందదు. దానిని నివారించడానికి కోపాన్ని దిగమింగాలి. కోపాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇందుకోసం నెమ్మదిగా, దీర్ఘంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకుని నోటి ద్వారా వదలాలి. అలా కనీసం ఒక నిమిషం పాటు చేయాలి. భార్యపై కోపం వచ్చినప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలని విజ్ఞులు చెప్పిన మాట అక్షరాల ఆచరించదగినది. వ్యాయామం చేస్తే రక్తనాళాలు సాధారణ స్థితికి వచ్చి కోపం తగ్గిపోతుంది. అందువల్ల ఈసారి మీకు కోపం వచ్చినప్పుడు అక్కడ నుంచి వెలుపలకు వచ్చి కొద్దిసేపు కాళ్ళకు పనిచెప్పండి. అంటే కొద్ది దూరం నడవాలి. జిమ్‌లో చిన్నపాటి కసరత్తులు చేయాలి. వీలైతే డ్యాన్స్‌ చేయండి. ఇష్టమైన పాటను పాడండి. పాట రాకపోతే కనీసం హమ్‌ చేయండి. వీటిలో ఏ ఒక్కటి చేసినా మీ శరీరానికి, మనసుకు కూడా త్వరగా సాంత్వన చేకూరుతుంది.

శ్లోకాలు చదివినా మంచిదే

ఒక్కోసారి ఏదైనా పదం లేదా వాక్యం స్వాంతన చేకూర్చుతుంది. కోపం వచ్చినప్పుడు మీకు వచ్చిన మంత్రం, శ్లోకాలు, అష్టోత్తరాలను కొద్దిసేపు మననం చేసుకోండి. ఏదైనా పుస్తకం తీసుకుని చదవండి. మిమ్మల్ని మీరు సాంత్వన పరుచుకునే పదాలను ఉచ్చరించండి. ఉదాహరణకు ‘రిలాక్స్‌’, ‘టేక్‌ ఇట్‌ ఈజీ’, ‘నువ్వు చెయ్యగలవు’, ‘అంతా మంచే జరుగుతుంది’ వంటి పదాలను ఒక నిమిషం పాటు పదే పదే వల్లెవేయండి.

కోపంలో ఏదైనా అనే అవకాశం ఉంది. చేయడానికి ఇష్టపడని పని చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. చివరికి ఆ మాట, పని కారణంగా బాధపడాల్సి వస్తుంది. అందుకని, కోపం వచ్చినప్పుడు మౌనం పాటించడం వంటి ఉత్తమమైన మార్గం మరోటి లేదు. బాగా కోపం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండండి. ఏదీ మాట్లాడకుండా ఉండేలా మిమ్మల్ని మీరు సరిపెట్టుకోండి. అంతే. ఆ తర్వాత ఐదు లేదా 10 నిమిషాల్లో కోపం తగ్గిపోతుంది. సాధరణ స్థితికి వచ్చేస్తారు.

యోగాతో సమాధానం

భావోద్వేగాలను అదుపుచేసేందుకు యోగా మరో ఉత్తమమైన మార్గం. శ్రమలేకుండా మెడ (తల), చేతులను భుజాల వరకూ గుండ్రంగా తిప్పడం ద్వారా కోపాన్ని నియంత్రించవచ్చు. ఇలా యోగా చేయడానికి ఎలాంటి పరికరాల అవసరమూ ఉండదు. ఉన్నచోటనే నిలబడి, నేలపై కూర్చుని కూడా అటువంటి యోగా చేయవచ్చు.

పరిస్థితులు చేయిదాటిపోయి అంతా చెడుగా జరుగుతోందని భావన కలిగితే, కొద్దిసేపు ఏది సరైనది అనే అంశంపై దృష్టిని కేంద్రీకరించండి. జీవితంలో మీకు జరిగిన మంచి సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకోండి. అలా మేలు చేసే సంఘటనలు ఎన్ని జరిగాయో  లెక్కించండి. దీన వల్ల కోపం తగ్గిపోతుంది. ఆ తర్వాత పరిస్థితిని ఎలా చక్కదిద్దవచ్చు అనేదానిపై ఆలోచన చేసి దృష్టి సారించడానికి వీలు ఏర్పడుతుంది. 

ఏదైనా పనిని సరైన దిశలో దీర్ఘకాలం చేసినంత వరకూ ఫర్వాలేదు. ఎవరూ అడ్డు చెప్పరు. ఆ పని విషయంలో ఎదుటి వారు పొరపాటు చేస్తే తీవ్రంగా కోపించడం తగదు. కోపం వలన పని సానుకూల పడదు. అందువల్ల చిరుకోపం చూపినా, పెద్ద మనిషి తరహాలో స్వరంలో మార్పు కనపడనీయకుండా ఆ పని గురించి వారితో మంచిచెడులు చర్చిస్తే కోపం, ఒత్తిడి మటుమాయమవుతాయి.

పిల్లలతో జాగ్రత్త

సామాజిక విషయాల్లో ఎలా స్పందించాలనే దానిపై గతంలో మెళకువలు చెప్పేవారు లేరు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మన తీరు చూసి కోపం తెచ్చుకోవద్దు, అది మంచిది కాదు అని తల్లిదండ్రులు చెప్పేవారు. దాంతో కోపాన్ని మనసులోనే అదిమిపెట్టేసే వాళ్ళం. అయితే అలా కోపాన్ని అదిమిపెట్టడం మంచిది కాదని అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌ వారు హెచ్చరిస్తున్నారు. కోపాన్ని వ్యక్తపరచకుండా బలవంతంగా అణచుకుంటే దీర్ఘకాలంలో అది రక్తపోటుకు దారితీస్తుందని, శారీరకంగా ఎదుగుదలపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.  పర్యవసానంగా చిన్నతనంలోనే హింసాపూరిత మనస్తత్వం ఏర్పడుతుందని అంటున్నారు. దీంతో ఇప్పటి తరం తల్లిదండ్రులు ఏఏ పరిస్థితుల్లో ఎలా మెలగాలి, భావాలను ఎలా వ్యక్తపరచాలి అనే అంశాలపై  ముందుగానే పిల్లలకు బోధించాలి.

కోపం రావడం అనేది సమస్య కాదు. ఆనందం, సంతోషం, ప్రేమ వంటి ఇతర భావావేశాల కోవకు చెందినదే కోపం కూడా. కోపం వచ్చినప్పుడు ప్రతీకూలంగా మాట్లాడకూడదు. సంబంధిత అంశం గురించి నొక్కి వక్కాణించాలి గాని దూకుడు, దౌర్జన్యం చూపకుడదని పిల్లలు తెలుసుకునేలా చేయాలి. ప్రతి ఒక్కరూ విభిన్న మనస్తత్వంతో ఉంటారని పిల్లలకు చెప్పాలి. ఒకరి అంచనాలు, అనుభవాలను ప్రపంచంలోని వారంతా  పంచుకోవాల్సిన అవసరం ఉండదని నచ్చచెప్పాలి. వేర్వేరు నేపథ్యాలు, సంప్రదాయాల నుంచి వచ్చిన వ్యక్తుల తీరు మీకు భిన్నంగా కొన్నిసార్లు మూర్ఖంగా కూడా ఉంటుంది.  వేర్వేరు వయసుల పిల్లలు, వారి సామర్థ్యాల్లో తేడా ఉంటుంది. అందువల్ల మీ ఆలోచనలను వారితో పంచుకుని, వారిపై మీ అభిప్రాయాలను రుద్దకూడదని, వారు తిరస్కరిస్తే కోపం తెచ్చుకోరాదంటూ సామరస్యంగా నచ్చచెప్పాలి. 

సాంత్వన కోసం టెక్నిక్‌లు

కోపం నుంచి త్వరగా బయటపడే మార్గాలను పిల్లలకు నేర్పాలి. పిల్లల వయసునుబట్టీ వేర్వేరు పరిస్థితుల్లో వారిలో కోపాన్ని పోగొట్టేందుకు ప్రయత్నాలు చేయాలి. చిన్న పిల్లలైతే బొమ్మలు ఇచ్చి కోపాన్ని తగ్గించవచ్చు. వారు ఇష్టంగా తినే పదార్ధం ఇచ్చినా కోపం పోతుంది. కొద్దిగా పెద్దవారైతే క్యూబ్‌లు, పద బంధాలు, క్రాస్‌ వర్డ్‌ పజిల్స్‌ వంటి వాటిని పరిష్కరించేలా చూడాలి. వారు ఇష్టపడే కథలు చెప్పాలి. ఇంకొంచెం పెద్ద వయసు వారిని వారికి ఇష్టమైన పాటలు వినేలా ప్రోత్సహించాలి. టీనేజి పిల్లలకు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజు, ధ్యానం వంటివి చేసేలా శిక్షణ ఇవ్వాలి. కొద్దిసేపు కళ్ళుమూసుకుని తమకు ఇష్టమైన ప్రదేశాలను గుర్తుకు తెచ్చుకోవాలని, దీర్ఘంగా శ్వాస తీసుకోవాలని వివరించండి.

నూతన ఆలోచనలు

కోపంతో ఉన్న పిల్లలను ఏదైనా పనిని వినూత్నంగా చేపట్టేలా ఆలోచనలు చేయాలని ప్రోత్సహించడం ఇప్పుడు విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీనిని కాగ్నిటివ్‌ థెరపీ అంటున్నారు. ఇది ‘ఘోరంగా ఉంది లేదా భయంగొల్పేది’ అనే భావన నుంచి ‘ఇది ఇలా కాకుండా మరోలా ఉంటే బాగుంటుంది’ అనే ఆలోచన పిల్లల్లో రేకెత్తేలా చేయాలి. అంటే పరిస్థితిని మరో విధంగా అంచనా వేసేలా వారిలో పరిణతి పెంపొందింప చేయాలి. ఏదైనా పని విఫలమైనప్పుడు, పరీక్షలో ఉత్తీర్ణత రానప్పుడు లేదా ఆశించిన ర్యాంక్‌ పొందలేనప్పుడు పిల్లల్లో కోపం రావడం సహజం. ‘ఎంతో కష్టపడ్డా. అంతా వేస్టు’ అంటూ ఎవరిపైనో నిందవేస్తూ కోపం తెచ్చుకుంటారు. అప్పుడు ఇది నిరుత్సాహం కలిగించే పరిస్థితే తప్ప ఇదే ప్రపంచానికి అంతం కాదు అనే భావన వారిలో కలిగేలా చూడాలి. సమస్యను అధిగమించే ప్రయత్నంలో కోపానికి బదులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టేలా చూడాలి.

సంభాషణ నైపుణ్యం 

 

పిల్లలు తమకు కావలసింది విడమరచి చెప్పడంలో విఫలమవుతారు. దాంతో వారికి కావలసింది లభించకపోవచ్చు. ఒక్కోసారి ఎదుటి వారి మాటను పట్టించుకోకుండా ముగింపును నిర్ధారించేస్తారు కూడా. ఫలితంగా కోపం. అటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే వారిలో సంభాషణ నైపుణ్యం (కమ్యూనికేషన్‌ స్కిల్స్‌) పెంచేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలి. ఎదుటి వారు చెప్పేది పూర్తిగా విని ఆకళింపుచేసుకునేలా నచ్చచెప్పాలి. ఆ తర్వాత దానిపై పిల్లలు అభిప్రాయం చెప్పేలా చూడాలి. తరచూ ఇలా మంచిచెడు చర్చల్లో భాగస్వాములు కావడం వల్ల పిల్లల్లో నిరుత్సాహం ఉండదు. మానసిక ఆందోళనకు గురికారు. ఫలితంగా పిల్లలు కోపగించుకునే పరిస్థితి రాదు.
– ఎన్‌. లీలా మాధవ హరీష్‌