శక్తి తెలిస్తే ఒత్తిళ్లు మాయం

ఆంధ్రజ్యోతి, 19/06/2014: అవరోధాలు ఎదురవ్వగానే కొందరు అంతులేని మానసిక ఒత్తిడికి గురవుతారు. దానికి కారణం ఆ అవరోధాల్ని అధిగమించడం తమ వల్ల కాదనుకోవడమే. అధిగమించడం అనేది చాలా కష్టమైనదిగా, ఒక్కోసారి అసాధ్యమైనదిగా అనుకోవడం మరో కారణం. అలా కాకుండా ఎంతటి అవరోధాన్నయినా అధిగమించే శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందని, అప్పటిదాకా నిక్షిప్తంగానే ఉన్నా అవసరం ఏర్పడినప్పుడు అది ప్రత్యక్షమవుతుందని తెలిసినప్పుడు ఒత్తిళ్లన్నీ మాయమై అన్నింటి కీ అతీతంగా విజయపథంలో సాగిపోతారంటున్నారు నిపుణులు. 

‘మానసిక ఒత్తిడి’ ఇది ఎవరూ వినని కొత్త మాటేమీ కాదు. ఈ మాట ప్రతి రోజూ చెవ్వుల్లోనో, మనసులోనో ప్రతిధ్వనించేదే. అత్యధికుల్ని వేధిస్తున్న ఈ మానసిక ఒత్తిడి అసలు మూలాలేమిటి అంటే, ప్రశ్నంత సులువు కాదు సమాధానం చెప్పడం. నిజానికి సమాజానికి ఎన్ని కోణాలు ఉన్నాయో మానసిక ఒత్తిడికి కూదా అన్ని కోణాలున్నాయి. ఒకవేళ స్థూలంగా కాకుండా, సూక్ష్మంగా చెప్పుకోవాల్సి వస్తే మానసిక ఒత్తిళ్లకు రెండు ప్రధాన కారణాలు ఉంటాయి. ఎదురైన సవాలును ఎదుర్కొనే శక్తి లేకపోవడం ఒక కారణమైతే, ఆ శక్తి తనలో ఉండి కూడా లేదనుకోవడం మరో కారణం. ఆ శక్తి నిజంగానే లేకపోతే లేదనుకోవడం మామూలు విషయమే కావచ్చు. కానీ, శక్తి ఉండి కూడా కొందరు లేదని ఎందుకనుకుంటారు? ఎందుకంటే చాలాసార్లు ఆ శక్తిని వినియోగించే సందర్భం వచ్చే దాకా ఆ శక్తి తనలో ఉన్నట్లు తెలిసే అవకాశం ఉండదు కాబట్టి. అందుకే అంత శక్తి నాలో లేదులే అనుకుని, ఆ సవాలును ఎదుర్కోవడానికి గానీ, ఆ సంక్షోభాన్ని చేదించే ప్రయత్నం గానీ చేయరు. అందుకే ఒక అద్భుతమైన విజయాన్ని సొధించిన వారు ‘‘అంత శక్తి నాలో ఉందన్న విషయం ఆ విజయం నన్ను వరించేదాకా నాకే తెలియదు’’ అంటూ ఉంటారు. ఒకవేళ నిజంగానే అంతటి శక్తి లేకపోతే ఆ తర్వాతైనా ఆ శక్తిని సమకూర్చుకునే ప్రయత్నాలు చేయాలి.
 
అఖండతలో అయోమయం 
శక్తి అనేది ఎప్పుడూ ఒక ప్రవాహంలా ఉండదు. పిల్ల కాలువల్నీ, చెరువుల్నీ, నదుల్నీ, సముద్రాల్ని సైతం జలమయం చేసే మహా ప్రక్రియ కూడా ఒక్కొక్క వాన చుక్కతోనే కదా మొదలవుతుంది. ఎంతో పెద్ద నదిని దాటే నావే అయినా ఒక్కొక్క అడుగే కదా ముందుకు సాగుతుంది. ఏ నావికుడైనా ఇంత చిన్న నౌకతో ఇంతటి సముద్రాన్ని ఎలా దాటేస్తాననుకుంటే కొంత దూరం వెళ్లి కూడా వెనక్కి తిరిగి వచ్చేస్తారు. దాటేది ఒక మహా సముద్రాన్ని సుమా అనుకున్న మరుక్షణమే ఎవరికైనా దడ పుట్టడం ఖాయం. ఆ వెంటనే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి కావడం ఖాయం. మనం వెళ్లే రహదారిని మైళ్ల కింద, కిలో మీటర్ల కింద, ఫర్లాంగుల కింద విడగొట్టుకున్నట్లే నదిని కొన్ని పాయలు పాయలుగా చూడాలి.అలా కాకుండా అఖండంగా చూస్తే ఏదైనా భయపెడుతుంది. భరించలేని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. ఏ రాతి గుట్టనైనా ఎవరూ ఏకభిగిన అనుకున్న చోటికి తరళించలేరు. దాన్ని ముక్కలు ముక్కలుగా పగుల గొట్టి ఆ తర్వాత కట్టుడు రాయిగానో, కంకర గానో ఇసుక గానో మార్చి తీసుకు వెళతారు. గుట్టను నేల మట్టం చేయడం అన్నది దాన్ని ముక్కలుగా విడగొట్టడం ద్వారా సాధ్యం అవుతుందని గ్రహించినప్పుడు ధైర్యం వస్తుంది.

పరిధి పెరగకపోతే...! 
ఇరుక్కుపోయిన భావన కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. పది పుస్తకాలు పట్టే సంచిలో 20 పుస్తకాలు పెట్టాలని వాటన్నిటినీ అందులోకి కుక్కాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? ఆ సంచి పిగిలిపోతుంది. దానికి లోలోపల గొణుక్కూ ఉండిపోవడం కాదు ఆ పుస్తకాలు అవలీలగా పెట్టే పెద్ద సంచీ ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడింక సంచీ పిగిలిపోయే అవకాశమే ఉండదు. ఒక సమస్యను ఎదుర్కోవడానికి మన వద్దనున్న వ్యూహాలు, ప్రణాళికలు సరిపోవని అనిపించినప్పుడే మనసు ఒత్తిడికి గురవుతుంది. దిగులు, ఆందోళనా మొదలవుతాయి. నిజానికి ఆ స్థితిలో మరిన్ని వ్యూహాలు పన్నడంలో నిమగ్నమవ్వాలి. మరిన్ని పగడ్బందీ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. దాంతో అప్పటిదాకా ఎంతో భారమనిపించినవి అత్యంత తేలిక గా అనిపిస్తాయి. మహా సంక్లిష్టమనిపించినవి ఎంతో సరళంగా అనిపిస్తాయి.
 
కష్టాల భయంతోనే.... 
అవరోధాలన్నా, కష్టాలన్నా చాలా మందికి ఎక్కడలేని భయం. ఈ భయమే చాలా మందిని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. అయినా ఏ అవరోధాలూ లేని మార్గమేదైనా ఉంటుందా? ఒకవేళ ఏ ఒక్క అవరోధమూ లేని మార్గమేదైనా మీ ముందు ఉంటే అది మిమ్మల్ని ఏ తీరమూ చేర్చదనేది వాస్తవం. ఆ మార్గంలో నడిస్తే అంతిమంగా ఏం మిగులుతుంది? ఎన్ని వేల మైళ్లో నడిచి ఎడారిని చేరుకున్నట్లుగా ఉంటుంది. అవరోధాలు కొందరిని రెండు ముక్కలుగా నరికేస్తాయి. మరికొందరిని అవి జీవితపు శిఖరాగ్రాలుగా చేరుస్తాయి. ముక్కలైపోయిన వాళ్లంతా అవరోధాల్ని విధ్వంసకాలుగా భావించిన వారే. శిఖరాలకు చేరిన వారంతా అవరోధాల్ని గొప్ప అవకాశాలుగా భావించిన వారే. పర్వతారోహణ అనేది పర్వతం చెరికలుగా, పొరలు పొరలుగా ఉంటే సాధ్యమవుతుంది కానీ, పర్వతమంతా నునుపెక్కి ఉంటే జారిపడిపోవడమే కదా మిగిలేది? అవరోఽధం మనల్ని కూలదోస్తుందనుకుంటే ఎవరినైనా అది మనసు విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తుంది. అలా కాకుండా అవరోధాలు విజయసోపానాలనుకుంటే, అవరోధాలు అద్భుతమైన స్పూర్తిని నింపుతాయి. అనంతమైన శక్తికి ఆలవాలం చేస్తాయి.