నాకు పిచ్చెక్కిపోతోంది

ఆంధ్రజ్యోతి(24-10-2016): ‘‘నా మెదడులో ఏదో ఉంది. అమెరికాలోని ఫెడరల్‌ పోలీసులు నా మెదడును ట్యాప్‌ చేస్తున్నారు. వెంటనే నన్ను రక్షించండి. ప్లీజ్‌. నాకు పిచ్చెక్కిపోతోంది.’’ - బెంగళూరులో ఓ మహిళా టెకీ ఫిర్యాదు.
 
‘‘పంజాబ్‌లో ‘సూపర్‌కాప్‌’గా పేరు పొందిన కేపీఎస్‌ గిల్‌ నామెదడులో చిప్‌ పెట్టారు. ఆయన నా ఆలోచనలను నియంత్రిస్తున్నారు. ఇది దారుణం.’’ - ఓ యువకుడి ఆరోపణ
 
‘‘పోలీసులు నా ఆలోచనలను కనిపెట్టేస్తున్నారు. నా భర్త సాయంతో వారు నా మెదడును నియంత్రిస్తున్నారు’’. - తమిళనాడులో గృహిణి వేదన
 
చాలా విచిత్రంగా అనిపిస్తున్నా.. ఈ ఫిర్యాదులు..ఈ వేదనలు నిజమే.
 
దేశంలో చాలా మంది ఏదేదో ఊహించుకుంటూ.. చిత్ర విచిత్రంగా భ్రమపడుతూ.. పోలీసులు, మానవ హక్కుల సంఘాలకు రకరకాల ఫిర్యాదులు చేస్తున్నారు. ఎందుకిలా అని నిపుణులు ఆరా తీస్తే.. వీరు ‘పారనోయా’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇటీవల కొంతకాలంగా ఉద్యోగులు.. యువతలో ఈ సమస్య పెరుగుతున్నట్లు మానసిక వైద్యులు చెబుతున్నారు. ఒకే విషయాన్ని పదే పదే ఆలోంచి.. ఆందోళన పెంచుకోవడం వల్ల ఈ సమస్య వస్తుందని వారు వివరించారు. పారనోయా మాత్రమే కాదు.. కుంగుబాటు, ఒత్తిడి, ఆందోళన ఇలా రకరకాల మానసిక సమస్యలతో దేశంలో దాదాపు 20 కోట్ల మంది బాధపడుతున్నట్లు అంచనా.
 
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన బెంగళూరులోని జాతీయ మానసిక ఆరోగ్యం, నాడీ శాస్త్ర సంస్థ (నిమ్‌హాన్స్‌) కమిటీ స్పష్టం చేసింది .ఇది దేశ వ్యాప్తంగా 12 రాష్ర్టాల్లో అధ్యయనం చేసిన మరీ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయని గుర్తించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ సమస్యలపై అధ్యయనానికి 2014లో నిమ్‌హాన్స్‌ను నియమించింది. అప్పటి నుంచి ఈ సంస్థ ఏటా దేశంలో మానసిక సమస్యలపై అధ్యయనం చేస్తోంది. 
 
ఎవరికి ఏం సమస్య!! 
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో 10.1 శాతం నుంచి 14.1 శాతం మంది ప్రజలు తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నటు అంచనా.
10 శాతం మందిలో కుంగుబాటు, ఆందోళన, వ్యసనాలు అధికం.
ప్రతి 20 మందిలో ఒకరు కుంగుబాటుతో బాధపడుతున్నారు. మహిళల్లో ఇది ఇంకా ఎక్కువ.
18 ఏళ్లకుపైబడిన వారిలో 22.4 శాతం వ్యసనపరులే.
వ్యసనాల్లో మద్యపానం, పొగాకు నమలడం, ధూమపానమే అధికం
పురుషుల్లోనే అధికం!!
కుంగుబాటు, మూడ్‌ డిజార్డర్లు తప్ప మిగతా మానసిక సమస్యలు పురుషులకే ఎక్కువ. మొత్తానికి 13.9 శాతం మంది పురుషులు మానసిక రోగులు. మహిళల్లో ఈ రేటు 7.5 శాతం.
13 నుంచి 17 ఏళ్ల మధ్య వారిలో 7.3 మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నవారే.
చికిత్సకు దూరం!! 
తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో కేవలం 25 శాతం మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు.
మిగతవారు అస్సలు తమకు మానసిక సమస్య ఉన్నట్లే వైద్యులకు చెప్పడం లేదు. ఇతరులు ఏమనుకుంటారో నని వీరు చికిత్సకు వెనుకాడుతున్నారు. ఏడాది పాటు కుంగుబాటు, ఒత్తిడి, ఇతర సమస్యలతో బాధపడుతున్నా వైద్యుల ముందుకు వెళ్లడం లేదు.
వీరికి చికిత్స అందించాలంటే ఒక్కొక్కరికి నెలా రూ.1000 నుంచి 1500 వరకు ఖర్చవుతుంది.
ఇదీ కారణమే!!
మానసిక సమస్యలను తక్కువ తీవ్రంగా పరిగణించడం.. దీనికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రజలు చికిత్సకు ముందుకు రావడం లేదని నిపుణులు అంటున్నారు. చాలా మంది వైద్యులు సైతం మానసిక సమస్యలను తీవ్రంగా గుర్తించడం లేదని వారు పేర్కొంటున్నారు.
 
కారణాలు 
మారిన జీవనశైలి
అనవసరంగా ఒత్తిడికి గురికావడం
జీవన విధానంలో నాణ్యత లేమి
చిన్న కుటుంబాలు
ఆర్థిక అస్థిరత
అతిగా ఫోన్లు..నెట్‌ వినియోగం
నిద్రలేమి, వ్యసనాలు
పట్టణాలు, నగరాల్లో అధికం!
గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే.. పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువ మంది మానసిక 
సమస్యలతో బాధపడుతున్నారు. 
దేశంలో మానసిక సమస్యలున్నవారు 13.7 శాతం
వెంటనే చికిత్స అవసరమైన వారి శాతం 10.6
అతి తీవ్రమైన మానసిక రోగులు 2 శాతం
ప్రధాన సమస్యలు
సిజోఫ్రెనియా
మూడ్‌ డిజార్డర్లు
పారనోయా
ఒత్తిడి సంబంధిత
ఆందోళన, కుంగుబాటు