మానసిక ఒత్తిళ్లకు మందు

20-08-2019: ‘స్ట్రెయిన్‌’ వల్ల మనిషి శారీరకంగా ఎంత అలసిపోతాదో ‘స్ట్రెస్‌’ వల్ల కూడా అంతే అలసిపోతాడు. ఏ మానసిక కారణం వల్లనైనా మనిషి ఒత్తిడికి గురైనప్పుడు మెదడులో ఉండే కార్టెక్స్‌, సబ్‌ కార్టెక్స్‌, లింబిక్‌ సిస్టమ్‌, హైపోథాలమ్‌సతో పాటు, పిట్యూటరీ- ఎడ్రినల్‌ గ్లాండ్స్‌, నాడీ మండలం అమితంగా ఉత్తేజితమవుతాయి. ఫలితంగా, శరీరంలోని కీలక భాగాలైన గుండె, జీర్ణకోశం, కండరాలు, నాడీవ్యవస్థ కల్లోలితం కావడంతో పాటు అనారోగ్యం పాలవుతాయి. మానసిక ఒత్తిళ్లు ప్రధానంగా మూడు దశల్లో ఉంటాయి.

ఒక దశలో మానసిక ఒత్తిళ్ల వల్ల హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువై, శరీరం ప్రతిఘటనా ధోరణితో ఉంటుంది.

రెండవ దశలో ఒత్తిడి మరింత ఎక్కువై శరీర అవయవాల శక్తి క్రమంగా నశిస్తూ మనిషి బలహీనుడవుతాడు.
మూడవ దశలో ఒత్తిడి భరించలేని స్థాయికి చేరడంతో, మానసిక కుంగుబాటుకు లోనవుతాడు.
ఈ స్థితిలో రిలాక్సేషన్‌ కలిగించే యోగా, ప్రాణాయామాలు, ధ్యానం వంటివి చేస్తూ, హోమియో మందులు కూడా వేసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
 
వైద్య చికిత్సగా...
ఒక చోట స్థిరంగా కూర్చోలేక, అటూ ఇటూ కదులుతూ చంచల స్థితిలో ఉన్నవారికి ఫాస్ఫరస్‌ - 200 మందు ఉపశాంతిని ఇస్తుంది..
మానసిక ఒత్తిళ్ల వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వంటి స్థితిలో ఎనకార్డియం-30 మందు బాగా ఉపయోగపడుతుంది.
ఒత్తిడి వల్ల రక్త ప్రసరణ అధికమై, మెదడు తీవ్రమైన ఉద్రిక్తతకు గురైనప్పుడు సైలీషియా - 200 మందు సత్వర శాంతిని ఇస్తుంది.
ఒత్తిళ్ల కారణంగా అమితమైన కోపం, ఆగ్రహం, చిరాకు, తీవ్రమైన అలసటగా ఉన్నప్పుడు ఫెర్రంపాస్‌-30 మందు బాగా పనిచేస్తుంది.
టెన్షన్‌ వల్ల అస్థిమితం, నిద్రలేమి, నీరసం- నిస్సత్తువగా ఉన్నప్పుడు కాలీఫాస్‌ మందు ఎంతో ఉపకరిస్తుంది.
స్ట్రెస్‌ వల్ల అలసట, ఆంధోళన, అలజడి, నీరసం కలిగితే జింకంఫాస్‌ మందు ఎంతో మేలు చేస్తుంది.
బహిష్టు సమయంలో స్త్రీలల్లో తలెత్తే స్ట్రెస్‌కు ప్లాటినా-200 మందు వేసుకోవడం ఎంతో ఉత్తమం.