ఆ రోగం తనకూ వస్తుందా?

ఆంధ్రజ్యోతి, 12-09-2018: రెండేళ్ల క్రితం, రైలు ప్రయాణంలో ఓ అమ్మాయి నాకు పరిచయమయింది. అనుకోకుండా తన కాలేజ్‌కి దగ్గరలోనే మా కాలేజీ. దీంతో మా మధ్య స్నేహం బలపడింది. ఆమెలోని సంస్కారం, ధైర్యం, బోల్డ్‌నెస్‌ నన్ను ఆకట్టుకున్నాయి. కొంత కాలానికి అది ప్రేమగా మారింది. ఒకానొక సమయాన తనతో పెళ్లి గురించి ప్రస్తావించాను. కొంత టైం తీసుకున్నా... వాళ్ల అమ్మానాన్నలను ఒప్పించి, ఆ తర్వాత ఓకే అంది. వెంటనే పెద్దవాళ్లతో వాళ్ల ఇంటికి వెళ్లా. తీరా అక్కడికి వెళ్లాక, ఆమె తల్లి స్కిజోఫ్రెనియా పేషంట్‌ అని తెలిసింది. కొద్ది రోజుల పాటు బాగానే ఉన్నా... ఆరేడు నెలలకోసారి ఆ వ్యాధి తిరగబెడుతుంది. వైద్యం చేయిస్తున్నా ఇదే పరిస్థితి. ఈ వ్యాధి పూర్తిగా తగ్గదని, వాళ్ల సంతానానికి కూడా వచ్చే అవకాశం ఉందని ఎవరో చెప్పారు. నిజంగా ఈ వ్యాధి జీవితమంతా ఉంటుందా? నా ప్రియురాలికి కూడా వచ్చే అవకాశం ఉందా? ఎంతగానో ప్రేమించిన తనను అలా ఊహించుకోలేకపోతున్నా. ఈ కారణంగా ఆమెను వదులుకోవాలా?

- పి.వాసు, విశాఖపట్నం
 
సాధారణంగా జనాభాలో నూటికి ఒకరికి స్ర్కిజోఫ్రెనియా వచ్చే అవకాశం ఉంది. అయితే, అది ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? అనేది స్పష్టంగా చెప్పడం కష్టం. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి ఈ జబ్బు ఉంటే వాళ్ల పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగని, కచ్చితంగా వస్తుందనే రూలేమీ లేదు. తలిదండ్రులకు లేనంత మాత్రాన వాళ్ల పిల్లలకు రాకూడదనీ లేదు. అయితే ఈ మానసిక వ్యాధి చికిత్సలో పెద్దగా అభివృద్ది చెందని పాతరోజులు వేరు. ఇప్పుడు ఈ రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఆధునిక మానసిక వైద్యుల దృష్టిలో స్ర్కిజోఫ్రేనియా... అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధుల కన్నా ఎక్కువేమీ కాదు. వాటికి ఉన్నట్లే దీనికి కూడా సమర్థమైన వైద్య చికిత్సలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ వ్యాధికి గురైన వాళ్లు జీవితమంతా ఏ పనీ చేయకుండా ఉండిపోయేవాళ్లు. ఇప్పుడు అలా కాదు... అన్ని వృత్తుల్లోనూ తమ విధుల్ని నిర్వహించగలుగుతున్నారు.
 
అయినా, పెళ్లికి ముందు, అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్‌ వటి సమస్యలు ఉన్నాయన్న కారణంగా వాళ్లను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదా? ఇదీ అంతే. పైగా సైకియాట్రీ వైద్య చికిత్సలు రోజురోజుకూ ఎంతో వేగంగా పురోగతి సాధిస్తున్నాయి. ఇప్పటికే బాగా మెరుగుపడిన ఈ చికిత్సలు మునుముందు ఇంకా ఎంతో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల స్ర్కిజోఫ్రెనియాను కూడా మిగతా సాధారణ జబ్బుల్లాగే చూడాలి. ఇది జీవితాంతం కొనసాగడం అనేది 5 శాతం మందికి మించి ఉండదు. ఆ కొద్ది మందిలో అలా కొనసాగినా అదేమీ రోజువారీ విధి నిర్వహణలో అంతరాయంగా మారదు. అందువల్ల మీరు ఆమెను ప్రేమించిందే నిజమైతే, పెళ్లి చేసుకోవడానికి అది అడ్డంకి కాకూడదు. ఆమె ద్వారా కలిగే సంతానానికి ఆ జబ్బు వస్తుందేమోనన్న భయంతో దూరం కావాలనుకోవడం అర్థంలేనితనం. అంతే కాదు... అమానుషం కూడా! ఆ అమ్మాయిని మీరు నిశ్చింతగా పెళ్లి చేసుకోవచ్చు.
- డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చింతపంటి
కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌, ట్రాంక్విల్‌ మైండ్స్‌ క్లినిక్‌, మాదాపూర్‌, హైదరాబాద్‌