ప్రేమ ఒకరితో...! పెళ్లి మరొకరితోనా?

(ఆంధ్రజ్యోతి, 11-12-2019):


ప్రశ్న:ఒక సంపన్న కుటుంబం వాళ్లు, పెళ్లి సంబంధం కోసం మా పేదింటి గడప తొక్కారు. అలా వారు రావడానికి ఒక బలమైన కారణం ఉన్నట్లు మాకు ముందే తెలిసింది. విషయం ఏమిటంటే, ఆ అబ్బాయికి రెండేళ్ల క్రితం, అంతే సంపన్న కుటుంబానికి చెందిన ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ఆరు నెలల వ్యవధి ఉండటంతో వాళ్లిద్దరూ చాలా అన్యోన్యంగా మెలిగారు. అయితే పెళ్లి ఇంకా నెల రోజులు ఉందనగా, ఆ అబ్బాయికి అంతకు ముందే వేరే అమ్మాయితో ఎఫైర్‌ ఉందన్న అనుమానం వాళ్లకు కలిగింది. దాంతో, అమ్మాయి వాళ్లు ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఆ షాక్‌తో అబ్బాయి తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. ఆ తర్వాత మరో పెళ్లి ప్రయత్నం చేయడాన్ని తిరస్కరిస్తూ వచ్చాడు. చివరికి పెద్దవాళ్ల మాట కాదనలేక ఇటీవలే పెళ్లికి ఓకే చెప్పాడు. అయితే వేరే అమ్మాయితో సంబంధం ఉందన్న విషయం గుప్పుమనడంతో పెళ్లి సంబంధాలేవీ రాలేదు. అందుకే వాళ్లు మా ఇంటికి వచ్చారు. ఈ సంబంధం మా ఇంటిల్లిపాదికీ బాగా నచ్చిందనేది వాస్తవం. కానీ, నాకైతే ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే, ఒకరితో ఎఫైర్‌ పెట్టుకొని మరొకరితో పెళ్లికి సిద్ధపడ్డ అతడు... రేపు మరొకరితో ప్రేమాయణం సాగించడని గ్యారెంటీ ఏముంది? నేను ఈ మాట అంటే, మా వాళ్లంతా ఆ అమ్మాయికే వేరే అబ్బాయితో ఎఫైర్‌ ఉందేమో! ముందు ఆ విషయాన్ని తల్లితండ్రులకు చెప్పే ధైర్యం లేక ఆ తర్వాత బయటపెట్టిందేమో! తల్లితండ్రులు అనివార్యంగా ఆ ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్‌ చేసుకుని ఉండవచ్చు కదా’ అంటూ రివర్స్‌లో మాట్లాడుతున్నారు. వాళ్ల వాదనలోనూ కొంత నిజం ఉందనిపించినా, ఈ విషయంలో నేనొక నిర్ణయానికి రాలేకపోతున్నాను. అందుకే మీ సలహా కోరుతున్నాను.
- డి. రాగిణి, పశ్చిమ గోదావరి జిల్లా
 
 
డాక్టర్ సమాధానం: అంగీకరించడానికైనా, తిరస్కరించడానికైనా ప్రతి వ్యక్తికీ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కాకపోతే వాటి వెనక ఉన్న తర్కం అర్థవంతమైనదా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. ముఖ్యంగా, ఆ సంబంధాన్ని కాదనుకోవడానికి మీ తర్కం హేతుబద్ధమైనదేనా అన్నది విషయం. నిజానికి, మీ వాదన ఎంతమాత్రం అర్థవంతమైనది కాదు. ఎందుకంటే, కొన్ని నిశ్చితార్థాలు పెళ్లి దాకా వెళ్లకుండానే ఆగిపోతాయి. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలనుకునే వారు ఎదుటి వారి పైన ఏదో ఒక అభియోగం మోపడం కూడా సహజమే! కానీ, రుజువయ్యేదాకా అభియోగం అభియోగమే గానీ, అది నిజం కాదు కదా! సాక్ష్యాధారాలేవీ చూపకుండా ఏదైనా మాట్లాడవచ్చు. కానీ, ఎవరైనా జీవితంలో వాస్తవాల ఆధారంగా అడుగులు వేస్తేనే నిలబడతారు. ఎంగేజ్‌మెంట్‌కూ, మ్యారేజ్‌కీ మధ్య కాస్త ఎక్కువ వ్యవధి ఉన్నప్పుడు ఆ ఇరువురి మధ్య సాన్నిహిత్యం పెరగడం సహజమే! అయితే పెళ్లి ‘జరగదు’ అని తెలిసిన తర్వాత ఆ సాన్నిహిత్యం సన్నగిల్లడం కూడా సహజమే! ‘అంతకు ముందు ఒక ఎఫైర్‌ నడిపాడు కాబట్టి, ఆ తర్వాత నడపడన్న గ్యారెంటీ ఏమిటి’ అంటూ అన్నీ మీరే మాట్లాడితే ఎలా? అభియోగాలన్నీ వాస్తవాలే అనుకోవడం మొదలెడితే, ప్రతి ఒక్కరి పేరూ నేరస్థుల జాబితాలో చేరిపోతుంది. అయినా, అబ్బాయికి ఎఫైర్‌ ఉన్నట్లు స్పష్టంగా తెలియడం వల్లే క్యాన్సిల్‌ చేసుకున్నారని ఎలా అనుకుంటారు? అలా రద్దు చేసుకోవడానికి చాలా రకాల కారణాలు.. ఉద్దేశాలు ఉంటాయి. ఇదంతా కాదుగానీ, ఎవరో చెప్పిన మాటల ఆధారంగా కాకుండా, మీకు మీరుగా అతని నేపథ్యం గురించి వాకబు చేయండి. ఒకవేళ అబ్బాయిలో ఏదైనా తేడా ఉన్నట్లు తేలితే, వెనక్కి తగ్గవచ్చు. లేదంటే ఆ సంబంధాన్ని హృదయపూర్వకంగా స్వీకరించండి.
-డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చింతపంటి,
కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌, హైదరాబాద్‌