నవ్వు ఒక ఇంధనం

వాదనలు, ఘర్షణకు బీజం వేస్తాయి. హాస్యం ఘర్షణను నివారిస్తుంది. శత్రువులుగా మారే పరిస్థితిని అడ్డుకుని వారిని మరింత సన్నిహిత మిత్రులుగా మారుస్తుంది. అందుకే పిల్లల్నించి పెద్దల దాకా ఆ విద్యను అభ్యసించాలి. అప్పుడే జీవితం నవ్వుల నావ అవుతుంది అంటున్నారు నిపుణులు. 


ఘర్షణకు తావిచ్చే ఏ మాటైనా ఆ వైపునుంచి చూస్తే నవ్వు తెప్పిస్తుంది. 
కూతురు పెళ్లి సంబంధం కోసం వె ళ్లిన దంపతులిద్దరూ అబ్బాయి ఇంటినుంచి బయటికొచ్చేశారు. ఎంత సేపైనా ఆ విషయమైన తన భార్య ఏమీ మాట్లాడటం లేదు. ఆ విషయాన్ని గమనించిన భర్త ‘‘ ఏమిటి? నీ మనసులోంచి ఏమాటా బయటికి రావడం లేదు?’’ అన్నాడు భర్త,. అబ్బాయి అన్ని విధాలా బాగా నచ్చాడండి. కాకపోతే నవ్వినప్పుడు దంతాలు అదోలా బయటికి వచ్చేస్తున్నాయి. అదే నాకు నచ్చలేదు’’ అంది ఎంతో బరువుగా. ఆ వెంటనే భర్త ‘‘ఓ సాధ్వీమణీ! నేను నిన్ను పెళ్లి చేసుకుని ఇంత కాలమయ్యింది. ఏ నాడైనా నేను నవ్వానా చెప్పు. నవ్వినప్పుడు కదా ఆ సమస్య. నవ్వే ఆ అవకాశమే లేకుండా పోతే ఇక సమస్యేముంది?’’ అన్నాడు. అంత అసహనం ఎటుపోయిందో గానీ, ఒక్కసారిగా పకపకా నవ్వేసింది. 

ఆమాటకు మరెవరో అయితే విసురుగా మరేదైనా అనేయవచ్చు. అది చిన్నదో పెద్దదో ఒక ఘర్షణకే దారి తీయవచ్చు. ప్రతి సంబంధానికీ ఇలా ఏదో ఒక వంక పెడుతూపోతే ఇక జీవితంలో అమ్మాయికి పెళ్లి కాదు’’ అంటూ ఏమైనా అనేయవచ్చు. అలా కాకుండా ఆవలికోణంలోంచి ఒక మాట అనేసి ఆమెను నవ్వించాడు. అప్రధాన మైన వాటి గురించి అంత పట్టించుకోవలసిన అవసరమేమీ లేదని తేల్చేశాడు.
 
వాస్తవానికి దంపతుల మధ్య తలెత్తే చాలా ఘర్షణల వెనుక అతి చిన్న కారణాలే ఉంటాయి. ఆ విషయాన్ని ఆవేశంలో ముంచితే అగ్నిగుండమవుతుంది. చాతుర్యాన్ని జోడిస్తే నవ్వుల జల్లు కురుస్తుంది. ఏమైనా కుటుంబ బంధాలైనా, ఏ ఇతర మానవ సంబంధాలైనా హాయిగా సాగిపోవడంలో హాస్యం పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. హాస్యానికి తావులేని కుటుంబాల్లోనే ఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. పలు రకాల సంక్లిష్ట పరిస్థితుల్ని సరళతరం చేయడమే కాకుండా, కొన్ని రకాల మనస్పర్థల్ని దూరం చేయడానికి కూడా హాస్యం గొప్ప ఔషధంలా పనిచేస్తుంది.
 
మలుపు తిప్పితే చాలు 
ఏ మాటకైనా కాస్తంత అతిశయోక్తిని జోడిస్తే అది నవ్వుపుట్టిస్తుంది. గుండెల మీద కుంపటిగా మారబోయే విషయాన్ని గులాబిపూవుగా మార్చేస్తుంది. అటు శారీరకంగా, ఇటు మానసికంగా నవ్వుతో కలిగే లాభాలు అనేకం. వాటిలో 
అన్నిటికన్నా ముఖ్యంగా నవ్వు జటిలమైన విషయాల్ని సరళతరం చేస్తుంది. సృజనాత్మకంగా ఆలోచించేందుకు బాగా తోడ్పడుతుంది. 
 • శారీరక, మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తుంది. 
 • గుండె వేగాన్ని, రక్తపోటును తగ్గించడం ద్వారా ఉపశమనాన్ని కలిగిస్తుంది. 
 • ఇతరులతో నీ అనుబంధాల్ని పెంచి ఒంటరితనం లేకుండా చేస్తుంది. 
 • నవ్వుతున్నప్పుడు ఎండార్షిన్‌ హార్యోన్లు విడుదల అవుతాయి. అవి పెయిన్‌ కిల్లర్లుగా పనిచేస్తాయి. 
 • హానికారకాల్ని అంతమొందించే లింఫోసైట్స్‌నీ, ఎసిటీహెచ్‌ లాంటి యాంటీబాడీలను, ఇమ్యూనోగ్లోబలిన్‌ పరిమాణాల్నీ నవ్వు పెంచుతుంది. 
 • శరీరంలో రక్తప్రసరణను, జీర్ణశక్తినీ పెంచుతుంది. 
 • వ్యాధినిరోధక శక్తిని దెబ్బతీసే కార్టిజాల్‌ హర్మోన్‌ను తగ్గిస్తుంది. 
 • కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.
హాస్య చతురత కొందరిలో సహజంగానే ఉండవచ్చు. మిగతా వాళ్లు సాధన ద్వారా ఆ నైపుణ్యాన్ని సాధించవచ్చు. 
మాట్లాడే ప్రతిమాటనూ ముందే సిద్ధం చేసుకుని పెట్టుకుంటారా ఎవరైనా? అప్పటికప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడటమే కదా పని? అందుకే వాటిలో కొన్ని వాక్యాలు సజావుగానే ఉన్నా, మరికొన్ని అపశ్రుతులు కూడా రావచ్చు. ఇలా అనే శానేమిటి? అని నాలుక కరుచుకునే సరికే నిమిషాలు గడిచిపోతాయి. ఈలోగా ఎదుటి వారు మనస్తాపానికి గురికావడమూ అయిపోతుంది. విపరీతమైన అంతర్మధనంతో దొర్లిన తప్పు మాటకు ‘సారీ’ చెప్పే స్థితిలో కూడా ఉండరు. కాకపోతే ఆ మాట ఉద్దేశపూర్వకంగా అన్నదేమీ కాదనే విషయం అక్కడున్న వారందరికీ అర్థమవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో పక్కనున్న వాళ్లు ఆ మాటకు ఆవలి వైపునుండే హాస్యాన్ని వెలికి తీయాలి.

పిల్లల్లో హాస్య చతురత 
పసితనం నుంచే హాస్యం ప్రాముఖ్యత గురించి తెలియకపోతే, ఆ తర్వాత ఆ నైపుణ్యాన్ని సాధిపంచడం కొంత కష్టమే అవుతుంది. అందుకే బాల్యంలోనే పిల్లల్లో ఆ బీజాలు నాటాలి. అందుకు అవసరమైన మెలుకువలను కూడా వారికి నేర్పాలి. పిల్లల్లో ఆ తత్వం కొరవడుతున్నప్పుడు.... 
 • హాస్య పత్రికల్ని, కార్టూన్స్‌, కామిక్స్‌, కామెడీ డివిడిలు వారికి అందుబాటులో ఉంచాలి. 
 • ప్రతి విషయానికీ ఒకవైపు సీరియస్‌ అంశాలు ఉన్నట్లే, రెండవ వైపున హాస్యకారకమైన అంశాలు కూడా ఉంటాయనే దృక్కోణం పిల్లల్లో పెంచాలి. 
 • ఈ విషయం బోధపడటానికి ఆ వివరాలు అందించే కథలు కానీ, కామిక్స్‌ కానీ వారికి చెప్పాలి. 
 • తక్షణమే స్పందించి చతురోక్తులు విసిరే నైపుణ్యాన్ని వారికి అందించాలి. జంతు ప్రదర్శనశాలకు తీసుకెళ్లి కోతుల్లాంటి జంతువుల కొంటె చేష్టల్ని చూపాలి. 
 • ప్రతి సన్నివేశంలోనూ, సంఘటనలోనూ దాగి ఉండే హాస్యాన్ని గుర్తించమని చె ప్పాలి. 
 • హాస్యరసమైన పాటల్ని పాడించాలి. పిల్లల టేబుల్స్‌ మీద కార్టూన్‌ బొమ్మలను అతికించాలి. 
 • రాత్రి భోజనం సమయంలో ప్రతి ఒక్కరూ ఒక జోక్‌ చెప్పాలనే నియయం పెట్టాలి. 
 • ఏ విషయంలోనైనా వాదన తీవ్రమవుతున్నప్పుడు అందులోని హాస్యాస్పద అంశాల్ని లేవనెత్తే వివేకం వారిలో పెంచాలి. 
 • తీవ్రమైన నిశ్శబ్దం ఆవరించినప్పుడు హాస్యంతో దాన్ని ఎలా ఛేదించాలో కథల ద్వారా వారికి నేర్పాలి. 
 • బాల్యం నుంచే వారిలో ఈ నైపుణ్యం పెరిగితే పెద్దయ్యాక ఎదురయ్యే పలు సమస్యల్ని వారు అవలీలగా పరిష్కరించుకోగలుగుతారు.