కట్నం ఇచ్చినా ఎందుకిలా..?

 

ఆంధ్రజ్యోతి (07-11-2019): నా వివాహమై మూడేళ్లయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా అమ్మావాళ్లు నేను సుఖంగా ఉండాలని కట్నకానుకలు ఘనంగా ఇచ్చి పెళ్లి చేశారు. కారు కూడా ఇచ్చారు. కాకపోతే కొంత లోన్‌ మా ఆయన కట్టారు. ఇప్పుడు కారు మా అత్తవాళ్లు తమదే అంటున్నారు. నా భర్త చాలా మంచివారు. కానీ వాళ్ల అమ్మ మాటే వింటారు. అదే నా బాధ. నేనేం చెప్పినా వినిపించుకోరు. మా అత్తగారు కట్నం తెచ్చిన నా కన్నా ఏమీ తీసుకురాని మా మరిది భార్యను బాగా చూసుకుంటుంది. ఇవన్నీ నేను చెప్పినా మా వారు పట్టించుకోరు. వాళ్లమ్మ చెప్పినట్లే వినమంటారు. మాకు పిల్లలు లేరు. అంత కట్నం ఇచ్చినా నాకీ బాధలేంటో తెలియడం లేదు. ఎలా మా ఆయన్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలో చెప్పండి.
*****రజని
 
డాక్టర్ సమాధానం: టీవీ సీరియల్స్‌ బాగా చూస్తారేమో మీరు. మీ ఉత్తరంలో ఎక్కడా మీ అత్తగారి తరపు వాళ్లు కట్నకానుకలు కావాలని అడిగినట్లు లేదు. అలాగే మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా బాధించినట్టు కూడా లేదు. మీవాళ్లే కావాలని మీకు కట్నకానుకలు ఇస్తే అది మీ అత్తగారి తప్పు ఎలా అవుతుంది? పైగా మీరే తెలిసీ తెలియనితనంతో చక్కటి సంసారంలో సమస్యలు సృష్టించుకుంటున్నారని అనిపిస్తోంది. కట్నం తెచ్చిన మిమ్మల్ని మాత్రమే బాగా చూడాలనుకోవడం అవివేకం. కోడళ్లను తారతమ్యాలు లేకుండా చూడటం మీ అత్తగారి మంచితనం. లేనిపోని అపోహలకు గురి కాకండి. పిల్లలు లేరనే బాధతో ఆత్మన్యూనతకు గురై ఇలా ఆలోచిస్తున్నారేమో. డాక్టర్‌ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోండి. ఖాళీగా ఉండకుండా పని కల్పించుకోండి. అన్నీ చక్కబడతాయి.
****
కె.శోభ, 
ఫ్యామిలీ కౌన్సెలర్‌,
హార్ట్‌ టు హార్ట్‌,