నాకు నిర్ణయాల స్వేచ్ఛ లేదా!

14-08-2018: నేను బీఎస్సీ ఫైనలియర్‌. అయినా నా జీవితానికి సంబంధించిన ఏ ఒక్క నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను నా తల్లితండ్రులు నాకు ఇవ్వడం లేదు. నాకు పెయింటింగ్‌ అంటే ప్రాణం. ఇంటర్‌ తర్వాత ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సులో చేరదామనకుంటే అది ఎందుకూ పనికిరాని కోర్సని, బతుకునిచ్చేది కాదని అడ్డుకున్నారు. ఎన్‌జీవో స్టార్ట్‌ చేద్దామనుకుంటే వద్దన్నారు. మా నాన్న లెక్చరర్‌ కాబట్టి నన్నూ లెక్చరర్‌ కావాలని బీఎస్సీలో చేర్చారు. ఇక చెప్పకుండా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. జన్మనిచ్చారని పిల్లల జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలూ తల్లితండ్రులే తీసుకుంటారా? ఏది కావాలో ఎంచుకొనే స్వతంత్రం నాకు లేదా?
- పి.మాధురి, కాకినాడ
 
 
మీ ఆవేదన ఎవరైనా అర్థం చేసుకోవలసిందే. అయితే కన్నబిడ్డల విషయంలో తలిదండ్రులకూ ఇదే ఆవేదన ఉంటుంది. మన దేశంలో పిల్లలు దాదాపు 20 ఏళ్లు వచ్చేదాకా తలిదండ్రుల మీదే ఆధారపడి ఉంటారు. అందువల్ల వాళ్లకు సంబంధించిన ప్రతి విషయంలో తామే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వారికి అలవాటైంది. మీ నాన్నగారు లెక్చరర్‌ కాబట్టి దాని ద్వారా జీవితానికి ఉండే భద్రత గురించి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన మీరు కూడా లెక్చరర్‌ కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఆధునిక కాలంలోని ఉద్యోగ అవకాశాలు, వాటి పురోగతి గురించి కొంత మంది తలిదండ్రులకు అంతగా తెలియకపోవచ్చు.
 
ఆ సమాచారాన్ని పిల్లలు... తలిదండ్రులకు వివరంగా చెప్పాలి. వాస్తవానికి మీకే ఒక దృఢాభిప్రాయం లేదనిపిస్తోంది. లేదంటే ఫైన్‌ఆర్ట్స్‌ ఆలోచన నుంచి హఠాత్తుగా ఎన్‌జీవోకు ఎందుకు మారతారు? ఏమైనా తలిదండ్రులను శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. మీరు లెక్చరర్‌ అయినంత మాత్రాన మిగతావన్నీ వదిలేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగంలో ఉంటూనే మీ అభిరుచికి తగ్గట్టు పెయింటింగ్‌ చేసుకోవచ్చు. ఎన్‌జీవో కాకపోయినా వీకెండ్‌లో సేవా చేయవచ్చు. అయితే పెళ్లి విషయంలో తలిదండ్రులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. ఆ విషయం మీరు ఓపెన్‌గా చెప్పండి. మీ అభిప్రాయాలకు భిన్నంగా ఏదైనా చెబితే అది మీ భావాలను గౌరవించనట్టు కాదు. కూర్చొని మాట్లాడుకొంటే ఏకాభిప్రాయానికి రావడం కష్టమేమీ కాదు.
 
- డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చింతపంటి, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌, ట్రాంక్విల్‌ మైండ్స్‌ క్లినిక్‌, మాదాపూర్‌, హైదరాబాద్‌