అతను మారేదెలా..?

 

ఆంధ్రజ్యోతి (14-11-2019):
 
ప్రశ్న: నాకు వివాహమై రెండేళ్లు అయ్యింది. ఇంకా పిల్లలు లేరు. పెళ్లికి ముందు నాకు కోపం చాలా తక్కువ. మావారి ప్రవర్తన వల్ల నాలో కోపం, చిరాకు పెరిగిపోయాయి. ఆయనకి కోపం ఎక్కువ. ఎలా పడితే అలా మాట్లాడేస్తాడు. జీవితంలో ఒక లక్ష్యమంటూ లేదు. టైమ్‌ సెన్స్‌ అస్సలు లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ కూడా లేదు. అతని దృష్టిలో భార్య అంటే బానిస. చెప్పినట్టు పడి ఉండాలి. నా అభిప్రాయాలతో పనిలేదు. అతను చెప్పినట్టే వినాలి... ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేనూ అతను చెప్పినట్లే విని ప్రశాంతంగా ఉండాలనుకుంటాను. కానీ అతని ప్రవర్తనతో కోపం వచ్చి గొడవవుతోంది. దాంతో నా స్వభావమే మారిపోయింది. బయటివారికి అతని గురించి తెలియక నాకే కోపం ఎక్కువంటున్నారు. నా కోపం, చిరాకు తగ్గి నా భర్త స్వభావం మారేందుకు నేను ఏం చేస్తే బాగుంటుందో సూచించగలరు.
- బిందు
 
డాక్టర్ సమాధానం: చాలా ఆశ్చర్యంగా ఉంది మీ నిందారోపణ. మీ భర్తలో ఒక్క సుగుణమూ లేదా? అయితే ఆయన్నే భరిస్తూ ఇంకా ఎందుకున్నారు? పిల్లలు కూడా లేరంటున్నారు. అంత నచ్చకపోతే విడాకులు ఇచ్చేయండి. కానీ వాస్తవంలో మీ భర్త మీరనుకున్నంత చెడ్డవారు కాదేమో! మీరు కోరుకున్నట్టు ఉండనంత మాత్రాన చెడ్డవారు అయిపోతారా? మీరు క్రమశిక్షణకు మారుపేరు అయి ఉంటారు. అతనిది తేలికగా తీసుకునే తత్వం. మీరనుకున్నట్టే అతనూ మీ గురించి అనుకోవచ్చుగా! మీ ఆరోపణలు నిజమైతే మాత్రం కూర్చుని గట్టిగా మాట్లాడాల్సిందే. దానికి ముందు కొంత స్నేహం అవసరం. ప్రయత్నించండి. తప్పక ఫలితం ఉంటుంది. మీకు మారాలని, అతనూ మారాలని ఉంది కాబట్టి అసాధ్యం కాదు. ఏవో కొన్ని లక్షణాలని బట్టి అంచనాకు వచ్చేయకండి. రేపు ఇవే లక్షణాలు మీకు నచ్చొచ్చు. మెల్లిగా అతనికి దగ్గరవుతూ అభిరుచులు తెలిసి మసులుకోండి. అన్నీ చక్కబడతాయి.
 
కె.శోభ
ఫ్యామిలీ కౌన్సెలర్‌, హార్ట్‌ టు హార్ట్‌