నా భార్యలో మార్పు తేవడం ఎలా?

ఆంధ్రజ్యోతి, 11-01-2012: నాకు పెళ్లయి 10 సంవత్సరాలైంది. ఇద్దరు ఆడపిల్లలు. నాకు ఇప్పుడు 34 ఏళ్లు. నేను చిన్నప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులలో పెరిగాను. బిఇడి చదివి ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. ఆర్థికంగా ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాను. అయితే ఇప్పుడు సమస్యంతా నా భార్యతోనే వచ్చింది. ఆమెది స్థితిమంతుల కుటుంబం. వెనుకాముందు ఆలోచించకుండా ఖర్చుచేస్తుంది. లోన్‌ తీసుకుని చిన్న ఇల్లు కట్టుకున్నాము. నా భార్య ఖరీదైన ఫర్నీచర్‌, వంటింటి నిండా సామాన్లు, బీరువా నిండా బట్టలు కొనేస్తుంది. ఇంత ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం ఏమిటని నేను ప్రశ్నిస్తే ఇదేమన్నా నేను ఒక్కదాన్నే అనుభవించడానికా అని బాధపడుతుంది. ఎవరైనా ఇంటికి వస్తే మనం కూడా ఉన్నవాళ్లంగా కనిపించవద్దా అంటుంది. మా ఆవిడ ఇలాగే ఖర్చు చేస్తూ పోతే నా పిల్లల భవిష్యత్తేంటి? దయచేసి నా భార్య ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి సలహా ఏదైనా ఇవ్వండి. 
-ప్రసాదరావు, పిఠాపురం
 
మనుషులందరూ ఒకేలా ఉండరు. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. డబ్బు సంపాదించడంలోను, సంపాదించిన ధనాన్ని ఖర్చుపెట్టడంలోను భిన్న మనస్తత్వాలు ఉంటాయి. కొందరు తమ గత అనుభవాలను గుర్తు పెట్టుకుని ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి కొందరేమో భవిష్యత్‌ గురించి బెంగపెట్టుకోకుండా జల్సాగా ఖర్చు చేస్తుంటారు. మరి కొందరేమో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అప్పుచేసి మరీ ఖర్చుచేస్తుంటారు. ఇంకొందరు ఇతరుల దగ్గర గొప్ప కోసమో మెప్పు కోసమో తమ తాహతుకు మించి ఖర్చు చేస్తుంటారు. మానసిక వ్యాధితో బాధపడే వారిలో కొందరు కూడా డబ్బు దుబారాగా ఖర్చు చేయడం జరుగుతుంటుంది. ఏది ఏమైనప్పటికీ కుటుంబ విషయానికి వస్తే భార్యాభర్తలిద్దరికీ వారికి వచ్చే ఆదాయం పైన, చేయాల్సిన ఖర్చుపైన పూర్తి అవగాహన ఉండాలి. తద్వారా పరస్పర నమ్మకం ఏర్పడాలి. అప్పుచేసి వస్తువులు కొని ఇల్లు నింపాల్సిన అవసరం ఉందా, దీని వల్ల ఏర్పడే ఇబ్బందులు ఏమిటి అన్న విషయాలను మీ భార్యతో చర్చించండి. డబ్బు విషయంలో మీ సిద్ధాంతాలేమిటో ఆమెకు వివరించండి. మీ పిల్లల విషయంలో మీరు వేసుకున్న ప్రణాళికను తెలియచేయండి. మొదట మన అవసరాలు, ఆ తర్వాతే విలాసాలు అన్న విషయాన్ని ఆమెకు నచ్చచెప్పండి. అప్పటికీ ఆమెలో మార్పు రాకపోతే మీ భార్యను తీసుకుని ఒక ఫ్యామిలీ కౌన్సెలర్‌ని కలవండి. మీ సమస్యకు పరిష్కారం లభించగలదు. 
 
*******************
 
నా వయసు 26 సంవత్సరాలు. మార్కెటింగ్‌లో ఉద్యోగం చేస్తున్నాను. నాకు పెళ్లయి 3 ఏళ్లయ్యింది. గత 11 సంవత్సరాలుగా తలనొప్పి, మెడనొప్పితో బాధపడుతున్నాను. సెక్స్‌కు సంబంధించి కూడా కోర్కెలు తగ్గిపోతున్నాయి. జ్ఞాపకశక్తి కూడా బాగా తగ్గిపోయింది. దీనివల్ల ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శారీరకంగా, మానసికంగా డిప్రెషన్‌కు లోనవుతున్నాను. చాలామంది డాక్టర్లను కలిశాను. ఏదో మందు బిళ్లలు రాస్తున్నారే తప్ప నా పరిస్థితిని వారు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. వాళ్లు చెప్పిన పరీక్షలన్నీ చేయించాను. ఎందులోనూ ఏమీ లేదంటారు. నా తల్లిదండ్రులు ఇక మా వల్ల కాదని చేతులెత్తేశారు. నా భార్యను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాను. నాకు ఉన్న అనారోగ్యం ఏమిటి? మళ్లీ మామూలు మనిషిగా తిరగలేనా? నాకు తగిన సలహా ఇచ్చి ఆదుకోండి. 
-రమేష్‌, కడప.
 
మిమల్ని పరీక్షించి మీకు ఎటువంటి అనారోగ్యం లేదని డాక్టర్లు తేల్చిన తర్వాత మీ శరీరంలోని అనారోగ్య సమస్యల గురించి వెతకడం వల్ల ప్రయోజనం లేదు. మీరు చెబుతున్న శారీరక బాధలు మీకు లేవని చెప్పడం నా ఉద్దేశం కాదు. కొన్ని బాధలకు కారణాలు శరీరంలోనే ఉండాల్సిన అవసరం లేదు. మానసిక సమస్యలు కూడా కొన్ని సార్లు శారీరక ఇబ్బందులను సృష్టించే అవకాశం ఉంది. కొన్ని రకాల మానసిక వ్యాధులు శారీరకంగా నొప్పులను, బాధలను కలిగిస్తాయి. కొన్ని సందర్భాలలో మనసులో అణచివేసిన ఒత్తిళ్లు, కొన్ని అనుభవాల అవశేషాలను మాటల్లో చెప్పలేనపుడు ఆ సమస్యను శరీర భాష చెప్పడం జరుగుతుంది. దీన్నే ‘సోమాటిక్‌ లాంగ్వేజ్‌’ అంటారు. బహుశా మీ విషయంలో కూడా ఇటువంటి కారణాలే ఏవైనా ఉండవచ్చు. ఎలాగు వైద్యులందరూ శారీరకంగా మీకు ఏ జబ్బు లేదని నిర్ధారించారు కాబట్టి మీరు ఒక సైక్రియాటిస్టును గాని క్లినికల్‌ సైకాలజిస్టును కాని సంప్రదించండి. మీకు మానసిక సమస్యలేవైనా ఉంటే వాటిని తొలగించడానికి వారు సహాయపడగలరు. 

డాక్టర్‌ ఎస్‌. భాస్కర్‌ నాయుడు 
ప్రొఫెసర్‌ ఆఫ్‌ క్లినికల్‌ సైకాలజీ 
రోషినీ కౌన్సిలింగ్‌ సెంటర్‌, 
326, సెకండ్‌ లేన్‌ టు గ్రాండ్‌ కాకతీయ హోటల్‌, బేగంపేట్‌, హైదరాబాద్‌.