నా భర్తలో మార్పు తెచ్చేదెలా?

ఆంధ్రజ్యోతి, 04-01-2012: నాకు 45 సంవత్సరాలు. మావారు బిజినెస్‌ చేస్తారు. రాజకీయాలతో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయి. అమ్మాయి సిఎ చేస్తుంది. అబ్బాయి బిటెక్‌. మా వారు గత ఐదారు సంవత్సరాలుగా ఇంటి విషయాలు పట్టించుకోవడం మానేశారు. అన్నీ నాపైన వదిలేసి ఆయన బిజీగా తిరుగుతుంటారు. ఇంటి పట్టున వుండరు. ఇంట్లో ఉన్నా ఎప్పుడూ ఫోనులో మాట్లాడుతూనే ఉంటారు. నాకేమో ఆయన ఇంట్లో వుండి మా బాగోగులు చూస్తే బాగుండునని ఆశ. ఏ ఫంక్షనుకు వెళ్లాలన్నా నేను ఒక్కదాన్నే వెళ్లాల్సి వస్తున్నది. ఆయన లేకుండా పుట్టింటికి వెళ్లడం ఇష్టంలేక అక్కడకూ వెళ్లడం మానుకున్నాను. పిల్లల బర్త్‌డేలు కూడా జరపడం మానేశాను. పిల్లల పట్ల కూడా అంత శ్రద్ధ తీసుకోరు. రానురాను ఆయనంటే విసుగు వస్తోంది. బతకాలన్న కోరిక కూడా చచ్చిపోతోంది. ఆయనను మార్చడం ఎలాగో సలహా ఇవ్వండి. 

- సౌజన్య, కరీంనగర్‌. 

ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులకు ఎవరి బాధ్యతలు వారికుంటాయి. ముఖ్యంగా కుటుంబ యజమానికి ఆ బాధ్యతలు మరింత ఎక్కువ ఉంటాయి. మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీవారు ఇంటి బాధ్యతలను పూర్తిగా మీపై వదిలివేసి డబ్బు సంపాదనపైనే దృష్టి కేంద్రీకరించినట్లు అర్థమవుతోంది. మీమీద ఆయనకు అంత నమ్మకం ఉండడం ఆనందించాల్సిన విషయమే. అయితే కుటుంబ బాధ్యతలను భర్త కూడా మోయవలసిన అవసరం ఉంటుంది. దీని వల్ల మీకు, మీ పిల్లలకు మనోబలం ఏర్పడుతుంది. తండ్రి అండదండలు పిల్లలకు చాలా అవసరం. తల్లిదండ్రులు సఖ్యతగా, కలసిమెలసి ఉంటేనే పిల్లలలో మానసిక వికాసం కూడా పరిపుష్టిగా ఉంటుంది. చాలామంది వ్యాపారాన్ని, రాజకీయ కార్యకలాపాలను సాగుగా చూపించి ఇంటి విషయాలపై శ్రద్ధ చూపించరు. మనసుండాలే కాని కుటుంబానికి కూడా న్యాయం చేయవచ్చు. సమయం చూసుకుని మీ ఆయనతో మనసు విప్పి మాట్లాడండి. మీరు, మీ పిల్లలు ఆయననుంచి ఏమి ఆశిస్తున్నారో స్పష్టంగా చెప్పండి. మీ పిల్లల చేత కూడా ఈ విషయం చెప్పించండి. ఆయనలో మార్పు రావచ్చు. అలా రాలేదంటే ఒక ఫ్యామిలీ కౌన్సెలర్‌ వద్దకు ఆయనను తీసుకెళ్లండి. మీకు తగిన సలహాలు ఇస్తారు. మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. 

**************
 
నా వయసు 30 సంవత్సరాలు. నాకు పెళ్లయి మూడేళ్లయింది. నేను, మా ఆవిడ ఇద్దరం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నాము. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. మా ఆవిడ స్వతహాగా మంచిదే. అయితే ఆమెలో ఇప్పటికీ పసితనం పోలేదు. ప్రతి చిన్న విషయానికి వాళ్ల అమ్మానాన్నల సలహా తీసుకుంటుంది. మాకు పిల్లలు కావాలా వద్దా, కొత్త బట్టలు కొనాలా వద్దా వంటి విషయాలు కూడా వాళ్ల అమ్మతో చెప్పంది నిర్ణయం తీసుకోదు. నేను గట్టిగా మాట్లాడితే చిన్న పిల్లలాగా ఏడుస్తుంది. రాత్రి అని కూడా చూడకుండా వాళ్ల అమ్మకు ఫోను చేసి జరిగింది చెప్పేస్తుంది. వాళ్లేమో మా అమ్మాయికి ఇంకా చిన్నతనం పోలేదు, నువ్వే సర్దుకోవాలి అంటూ సలహా ఇస్తారు. ఇప్పటికి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. ఆమె ఇలాగే ఉంటే రేపు పిల్లలు పుట్టాక ఎలా పెంచుతుంది? ఆమెలో మార్పును ఎలా తీసుకురావాలో సలహా ఇవ్వండి. 
-రోహిత్‌, విశాఖపట్నం.
 
మీ ఆవిడలో ఇంకా పసితనపు లక్షణాలు పోలేదని మీరు రాసిన వివరాలను బట్టి తెలుస్తోంది. ఆమె ఇంకా తల్లిచాటు బిడ్డగానే వ్యవహరిస్తోంది. చాలామంది తల్లిచాటున గారాబంగా పెరుగుతారు. సొంత నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం వారికి రాదు. తల్లిదండ్రులు కూడా పిల్లల బాగోగులు తమకే ఎక్కువ తెలుసు అనుకుంటారు. దీంతో ఆ పిల్లలు తమకంటూ సొంత అభిప్రాయాలను ఏర్పర్చుకోలేరు. అన్నిటికి తల్లిదండ్రుల మీదే ఆధారపడతారు. మీ ఆవిడ కూడా అటువంటి పెంపకంలోనే పెరగడం వల్ల ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది కూడా ఒకరకంగా మానసిక బలహీనతే. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి భయపడో లేక తాము తీసుకునే నిర్ణయాలు సరైనవి కావేమో అన్న అనుమానంతో వీరు తమకు తాముగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు.ఒకవేళ తీసుకున్నా అవి పొరపాటు నిర్ణయాలైతే నింద ఎక్కడ పడాల్సి వస్తుందోనని వీరు భయపడతారు. ఈ విషయంలో మీ భార్య ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మీ అత్తగారి సహకారం కూడా ఎంతో అవసరం. ప్రతి దానికి సలహాలు ఇవ్వకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని మీ భార్యకు కల్పించాల్సిన బాధ్యత ఆమెదే. ఆమెకు మీ సమస్యను పూర్తిగా వివరించండి. కుమార్తె విషయంలో ఆమె జోక్యం వల్ల ఏర్పడుతున్న సమస్యలు చెప్పండి. అప్పటికీ మీ భార్య ప్రవర్తనలో మార్పు రాకపోతే ఒక ఫ్యామిలీ కౌన్సెలర్‌ని సంప్రదించండి. వారి గైడెన్స్‌లో మీ సమస్య చక్కబడుతుంది. 

డాక్టర్‌ ఎస్‌. భాస్కర్‌ నాయుడు 
ప్రొఫెసర్‌ ఆఫ్‌ క్లినికల్‌ సైకాలజీ 
రోషినీ కౌన్సిలింగ్‌ సెంటర్‌, 
326, సెకండ్‌ లేన్‌ టు గ్రాండ్‌ కాకతీయ హోటల్‌, బేగంపేట్‌, హైదరాబాద్‌.