ఈ నరకం తప్పేదెలా?

ఆంధ్రజ్యోతి (03-12-2019):

ప్రశ్న: నా పెళ్లయి ఇప్పటికి 11 ఏళ్లు. నాకు పదేళ్ల కూతురు ఉంది. నా సమస్య అంతా మా కుటుంబ సభ్యులతోనే. మా దాంపత్య జీవితంలో చిచ్చుపెట్టడానికి అత్తయ్య, ఆడపడుచు ఆమె భర్త చాలా కాలంగా ఏవేవో కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. నాపై లేనిపోనివన్నీ కల్పించి అదేపనిగా నా భర్తకు చెబుతూ ఉంటారు. దాంతో నా భర్త నన్ను తిట్టడం, కొట్టడం చేస్తుంటాడు. ఈ బాధలన్నీ భరించలేక నేను కొన్నాళ్లు మా పుట్టింట్లోనే ఉండిపోయాను. నా భర్త నన్ను కాపురానికి రమ్మని అడిగినప్పుడు ‘మీ కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా వేరే ఇల్లు తీసుకుంటేనే మా అమ్మాయిని పంపిస్తాం’ అంటూ షరతు విధించారు మా వాళ్లు. అందుకు ఆయన ఒప్పుకున్నారు. ఆ మేరకు నా భర్త వేరే ఇల్లు తీసుకున్నారు. కానీ, అక్కడికి వెళ్లాక కూడా ఈ ముగ్గురూ వచ్చి, నన్ను పలు రకాలుగా క్షోభకు గురిచేస్తూనే ఉన్నారు. అంతిమంగా వీరంతా కలసి నా ప్రాణాలకే ముప్పు తెస్తారనిపిస్తోంది. నాకైతే ముందే వీరిని కట్టడి చేసేలా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే మేలేమో అనిపిస్తోంది. ఈ విషయంలో సలహా ఇవ్వండి.

 - ఎల్‌, సత్యలక్ష్మి, కడప
 
లాయర్ సమాధానం: మీరు రాసిన వివరాలను బట్టి మీ అత్తయ్య, ఆడపడుచు, మీ భర్త... ఈ ముగ్గురు కలిసి మిమ్మల్ని వేధిస్తున్న తీరు అంతా గృహహింస లేదా క్రూయాలిటీ కిందికి వస్తుంది. వేరే కాపురం పెట్టడానికి చేసుకున్న ఒప్పందం మేరకు మీరు కాపురానికి వెళ్లిన తరువాత కూడా మీ భర్త, మీ ఆడపడుచు ఆమె భర్త, మీ అత్తయ్య నుంచి మీకు ప్రాణహాని ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని నివారించ డానికి ఒకసారి మధ్యవర్తుల ద్వారా అంగీకార పత్రం రాయించుకుని మీరు కాపురం చేయవచ్చు. ఆ తరువాత కూడా మీ భర్త గానీ, మీ అత్తగారి కుటుంబ సభ్యులు గానీ, మిమ్మల్ని శారీరకంగానో, మానసికంగానో హింసిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. పోలీసులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
 
అలా కాకుండా మీ భర్త లేదా వారి కుటుంబ సభ్యులు ఏదో చేస్తారని ఊహించి ముందుగానే ఫిర్యాదు చేస్తే ఆ విషయంలో ఏ చర్యలూ తీసుకోలేరు. హాని జరిగే ప్రమాదం ఉందని, ఇప్పుడే మీకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి చట్టంలో ఏ వెసులుబాటూ లేదు. ఒకవేళ మీ భర్తమీద, వారి కుటుంబ సభ్యుల మీద మీకు బొత్తిగా నమ్మకం లేకపోతే మీరు మీ తల్లిదండ్రుల వద్దే ఉంటూ భర్త నుంచి మీకూ, మీ పాపకూ మెయింటెనెన్స్‌ కోసం భరణం పొందే అవకాశం ఉంది. మీ భర్తలో ఏ మార్పూ రాదని తేలితే, దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో అతను పెడుతున్న హింసల గురించి ఫిర్యాదు చేయండి. అందుకుగానూ గృహహింస చట్టం 498 - ఎ కింద కేసులు పెట్టవచ్చు. ఈ విషయమై సంబంధిత కోర్టులో పిటిషన్‌ వేస్తే మీకు వేరే నివాసం, మెయింటెనెన్స్‌ డబ్బు ఇప్పించడానికి కోర్టు తగిన సహకారం అందిస్తుంది.
- ఒడ్నాల శ్రీహరి
న్యాయవాది, హైదరాబాద్‌