ఒక్క ఫోన్‌ కాల్‌... నా జీవితాన్నే మార్చేసింది..

ప్రశ్న: నా పెళ్లయ్యి పదమూడేళ్లు. ముగ్గురు పిల్లలున్నారు. నా భర్త పెద్దగా పట్టించుకోడు. నేను ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. మూడేళ్ల క్రితం వచ్చిన ఒక ఫోన్‌ కాల్‌ నా జీవితాన్ని మార్చేసింది. మొదట్లో బ్లాంక్‌ కాల్స్‌ వచ్చేవి. అతనెవరో, ఎక్కడుంటాడో తెలియదు. ఫోన్‌ చేసి ప్రేమిస్తున్నా అంటాడు. మాట్లడకపోతే నన్ను, నా కుటుంబసభ్యులను చంపేస్తానంటాడు. ఫోన్‌ తీయకపోతే నా భర్త ఫోన్‌కి చేసి ఆఫీస్‌ నుంచి అంటాడు. ఎవరికి చెప్తే ఎలా స్పందిస్తారో అనే భయంతో మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్నా. పోలీసులకు చెబితే ఇంట్లో తెలిసి అల్లరి అవుతుంది. అందరినీ వదిలేసి అతనితో రమ్మంటాడు. ఎలా ఈ టార్చర్‌ నుంచి తప్పించుకోవాలి?

ప్రణవి
 
సమాధానం: చదువుకుని ఉద్యోగం చేస్తూ కూడా మహిళలు కొన్ని భయాలు, చట్రాల నుంచి బయటకు రాలేరు అనడానికి మీరే ఉదాహరణ. లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ వాళ్లను ఏమైనా చేస్తాడని భయమా? నిజంగా అతను అటువంటివాడు అనుకుంటే ఇన్నాళ్లు ఫోన్‌లో కబుర్లు చెబుతూ కూర్చుంటాడా? పైగా మూడేళ్లుగా మీరు కూడా అతనితో మాట్లాడుతున్నారు. అంటే మీరూ సహకరించినట్టేగా! మీ భర్తతో కాకపోయినా చెప్పుకోవడానికి మీకంటూ స్నేహితులు, బంధువులు ఉంటారుగా! ఒక్కరూ నమ్మదగినవారు లేరా? నిజానికి మంచో చెడో మొదటే మీ భర్తతో చెప్పాల్సింది. లేదా పోలీసుల దగ్గరికెళ్లి వివరంగా చెప్తే వాళ్లు తప్పక సాయం చేస్తారు. ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్స్‌, షీ బృందాలున్నాయి. తెలుసుకుని వారిని సంప్రదించినా చాలు. ఇప్పటికైనా ధైర్యంగా పోలీసులను సంప్రదించండి. భయపడకండి. భర్త అండ అంతగా లేకున్నా ముగ్గురు పిల్లలను పెంచుతున్న మీకిది పెద్ద సమస్య కాదు. మీ పిల్లలకే ఇటువంటి సమస్య వస్తే వదిలేస్తారా? మీరు వేసే అడుగు మరెందరికో స్ఫూర్తి కలిగిస్తుంది. అవసరమైతే మహిళలు ఆదిశక్తిగా మారగలరని నిరూపించండి.
కె.శోభ
ఫ్యామిలీ కౌన్సెలర్‌, హార్ట్‌ టు హార్ట్‌