సంతోషమే... సగం బలం!

 

ఆంధ్రజ్యోతి(14-01-2020) 

పలకరిస్తే   సంతోషం... పరామర్శిస్తే సంతోషం...

 

ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడితే సంతోషం!

సమస్యతో సతమతం అవుతున్నప్పుడు

చిన్న పరిష్కారం చూపితే సంతోషం,

 

దిక్కుతోచని స్థితిలో ఒక ధీమా ఇస్తే సంతోషం!
అనుబంధాల్లో లోగిలిలో విరాజిల్లే గుబాళింపులివి!
కాకపోతే వాటిని పదిలపరుచుకోవడానికి,
కొంత శ్రద్ధ, కొంత ప్రయత్నం తప్పనిసరి!
 
అందరూ కోరుకునేది సంతోషమే! కానీ, ఎవరి మనసు దేనికి సంతోషిస్తుంది? అనేది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది. కొంత మందికి కుటుంబ సభ్యులతో గడపడం సంతోషం, కొందరికి స్నేహితులతో కలవడం సంతోషం. మరికొందరికి ఉద్యోగ, వ్యాపార బాఽధ్యతల్లో మునిగితేలడం సంతోషం. చాలామందికి సమూహంలో, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం సంతోషం.
 
అయితే అతి కొద్దిమందికి మాత్రం మరో వ్యక్తితో సంబంధమే లేకుండా సంగీత ఝరుల్లో, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక భావజాలాల్లో ఏకాంతంగా ఓలలాడడం సంతోషం! వాళ్ల వాళ్ల అభిరుచిని బట్టి, ఆకాంక్షలను బట్టి, ఆయా దిశగా వెళుతుంటారు. మొత్తంగా చూస్తే, అన్ని సంతోషాలకూ కేంద్రంగా ఉండేవీ, వాటిని ప్రభావితం చేసేవీ మానవ సంబంధాలే! ఈ ప్రయాణంలో కుటుంబ బంధాలు, స్నేహ బంధాలు, ఉద్యోగ, వ్యాపార బంఽధాల పాత్ర ఎంతో కీలకం, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేసే సామాజిక బంధాలు కూడా అంతే కీలకం! అయితే, ఈ ప్రభావాలు ప్రతికూలంగా కాకుండా, సానుకూలంగా ఉండేందుకు ఆయా బంధాల విషయాల్లో ఆయా రీతిలో
వ్యవహరించాల్సి ఉంటుంది!
 
అర్థవంతమైనదే...

మొత్తంగా చూస్తే ఒంటరిగా ఉన్నామా? సమూహంలో ఉన్నామా? అన్నది కాదు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహోద్యోగులతో, సామాజిక భాగస్వాములతో కలిసి వెళుతున్నామా లేదా అన్నది కూడా కాదు. సంతోషాల్ని ఎంతగా పొందగలిగినా, దీపస్థంభం వెనుకే దాని నీడ ఉన్నట్లు, సంతోషాల వెనుక ఏవో కొన్ని బాధలూ ఉంటాయి.

 
అసలే బాధలు లేకుండా సంపూర్ణంగా సంతోషాలే నిండిన జీవితం అంటూ ఏదీ ఉండదు. అయితే, బాధలు కూడా పరోక్షంగా సంతోషాన్నే ఇస్తాయి. ఎందుకంటే బాధలు కొత్త కోణాలు చూపుతాయి. కొత్త సత్యాలు చెబుతాయి. వాటితో వ్యక్తిత్వానికి ఒక నిండుదనం వస్తుంది. అదీ సంతోషమే. నిజానికి, బంధాల్లో ఉన్నారా? ఒంటరిగా ఉన్నారా? నిశ్చలంగా ఉన్నారా? ఘర్షణలో ఉన్నారా అన్నది కూడా కాదు. జీవితం అర్థవంతంగా సాగుతోందా లేదా అన్నదొకటే ముఖ్యం. అర్థవంతమైన జీవితమే అసలుసిసలైన సంతోషాన్ని ఇస్తుందనేది వాస్తవం.

కుటుంబ సభ్యులతో...

పెద్ద వాళ్ల నుంచి చనువు తీసుకోవడం, చిన్న వాళ్లకు చనువు ఇవ్వడం చాలా ముఖ్యం!
ఇతర పనులకు టైం తగ్గించుకుని అయినా సరే కుటుంబ సభ్యులకు టైం ఇవ్వాలి!
దాపరికం లేకుండా అన్నీ మాట్లాడటం, ఎన్నో సమస్యలకు పరిష్కారం అవుతుందన్నది మనసులో ఉంచాలి!
సానుభూతి, క్షమ కుటుంబాల్ని నిలబెట్టే ప్రధాన మూల స్తంభాలు అన్న గ్రహింపు ఇంటిల్లిపాదికీ కలిగేలా చేయాలి!
నెగెటివ్‌ అంశాలను తక్కువగా, పాజిటివ్‌ అంశాలను ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉండాలి!
ఎవరైనా తప్పు చేస్తే, సున్నితంగా మందలించాలి. ఏ చిన్న మంచి పనిచేసినా వెంటనే అభినందించాలి!ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ‘‘నేనున్నా దిగులుపడకు’’ అంటూ ధీమా ఇవ్వాలి. ఆ మాట మీద నిలబడాలి.

స్నేహితులతో...

స్నేహితుల నుంచి తీసుకోవడం కాకుండా, ఇవ్వడమే మనసులో ఉండాలి.
గాయపరిచేవి కాకుండా, మనసును ఆహ్లాద పరిచే విషయాలనే ప్రస్తావిస్తూ ఉండాలి.
స్థాయీ భేదభావాలతో, ఆధిపత్య ధోరణితో కాకుండా, మనమంతా ఒకటేనన్న భావన కలిగేలా వ్యవహరించాలి.
తమతో లేని వ్యక్తుల గురించిన నెగెటివ్‌ వ్యాఖ్యల జోలికే వెళ్లకూడదు. ఎదుటి వాళ్లు అందుకు సిద్ధపడితే సున్నితంగా వారించాలి.
స్నేహితుల్లో ఏ ఇద్దరి మధ్య స్పర్థలు ఉన్నా. మూడవ వ్యక్తిగా వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి!
స్నేహితులతో చర్చించాలే తప్ప, ఏ విషయంపైనా వాదించకూడదు.శుభ సమయాల్లో అభినందించడమే కాకుండా, ఆపత్కాలంలో అండగా నిలబడాలి.

సహోద్యోగులతో...

సీనియర్ల పట్ల ప్రత్యేకమైన గౌరవభావంతో వ్యవహరించాలి. కష్టతరమైన పనులను సులువుగా చేసే మెలుకువల్ని వారి నుంచి తెలుసుకోవాలి!
కొత్తగా చేరిన వారికి చనువు ఇచ్చి, వాళ్లకు అవసరమైన సహకారం అందించాలి.
పని చేస్తున్న సంస్థను టీమ్‌ వర్క్‌ సెంటర్‌గా భావిస్తే, జరిగే ఘర్షణలు వ్యక్తిగత విద్వేషాలకు దారి తీయవు.
సహోద్యోగుల ద్వారా ఏదైనా తప్పు దొర్లబోతోందని తెలిసినప్పుడు, ముందే వాటిని గుర్తు చేయాలి.
ప్రతి రోజులా కాకుండా, ఏదో ఆందోళనతో ఉన్నట్లు సహోద్యోగి కనిపిస్తే, విషయం తెలుసుకుని, సాంత్వననిచ్చే ప్రయత్నం చేయాలి.మిత్రుల కుటుంబ సభ్యులు, మరీ ముఖ్యంగా తలితండ్రులు అనారోగ్యంతో ఉన్నప్పుడు విధిగా వెళ్లాలి. వీలైన సహకారం అందించాలి.

సమాజంతో...

వ్యక్తుల జీనన మూలాలు సమాజంతో ముడివడి ఉంటాయి. కాబట్టి సామాజిక అవగాహనా విషయంలో నిర్లిప్తంగా ఉండిపోకూడదు.
సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం అంటే పరోక్షంగా మనకు మనమే సాయం చేసుకోవడమేననే భావనను మనసులో పదిలపరుచుకోవాలి.
ఒక్కొక్కరే అద్భుతాలు చేసే అంశాలేవీ సమాజంలో ఉండవు కాబట్టి, మొత్తంగా జరగబోయే ఒక అద్భుతంలో మనం భాగమైతే చాలనుకోవాలి.
వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేసి కాదు, దాన్ని అధిగమించి సామాజిక విషయాల్లో పాలుపంచుకోవాలి.
సామాజికం అంటే రాజకీయమనే కాదు. సంస్కృతీ పరమైన కార్యక్రమాల భాధ్యతల్లో పాలు పంచుకోవడం కూడా సామాజిక కార్యమే!సామాజిక హితంగా ఏ చిన్న పనిచేసినా అది వ్యక్తిగత జీవితం కోసం చేసే వెయ్యి పనులకన్నా అధికమైన ఆనందాన్నిస్తుందని గ్రహించాలి.

ఏకాంతవేళ...

దాదాపు అందరి సంతోషాలు మానవ సంబంధాలతోనే ముడిపడి ఉంటాయి. అయితే ఈ బంధాలేవీ లేకుండా ఉండాలనుకుంటే, లేదా ఉండాల్సి వస్తే, వారి జీవితాల్లో సంతోషం ఉండదా? అంటే... కచ్చితంగా ఉండవచ్చు. పుస్తకాల ద్వారా, మ్యూజిక్‌ వినడం ద్వారా కొన్ని సృజనాత్మక కార్యకలాపాల ద్వారా కూడా సంతోషంగా ఉండవచ్చు. కొంత మంది ఒంటరిగా వెళ్లి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. మరికొంత మంది మరో మనిషే లేకుండా తాత్విక, ఆధ్యాత్మిక జీవనం సాగిస్తూ ఉంటారు.
ఒంటరితనం నెగిటివ్‌ ప్రభావాలు మాత్రమే చూపుతుందనేమీ లేదు. అది పాజిటివ్‌ ప్రభావాలు కూడా చూపుతుంది. నిజానికి ఒంటరితనం అన్నది ఏకాకితనం కాదు. అదొక గొప్ప ఏకాంతం. సంతోషాల్లో కొన్ని స్వల్పకాలమే ఉండే అదృశ్యమైపోతాయి, కొన్ని సంతోషాలు దీర్ఘకాలంగా జీవితకాలమంతా ఉండిపోతాయి. దీర్ఘకాలికంగా నిలిచేవే అసలు సిసలైన సంతోషాలుగా పరిగణించబడతాయి.
మంచి భోజనం పెడితే ఆ పూటే సంతోషం. మంచి పుస్తకం కానుకగా ఇస్తే, జీవితకాలమంతా సంతోషం. మరీ ముఖ్యంగా మనసుకు తగిలిన గాయాన్ని మాన్పే ప్రయత్నం చేయడం మరీ మరీ సంతోషాన్ని కలిగిస్తుంది. ఒక స్నేహం తె గిపోయిు, ఒక బంధం ముగిసిపోయి అవి బాధిస్తున్నప్పుడు, అందుకు కారణమైన అనుమానాలనూ, అపార్థాలనూ తొలగించడం ద్వారా ఆ బంధాలు మళ్లీ పునరుజ్జీవం పొందేలా చేయగలిగితే, అది మరీ మరీ సంతోషం.
- డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి
కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌, హైదరాబాద్‌