ప్రేమ వివాహం... అయినా ఎందుకిలా?

ఆంధ్రజ్యోతి (10-01-2019): 

నా వివాహమై నాలుగు నెలలయ్యింది. ప్రేమపెళ్లి. అయినా నాకు, నా భార్యకు ఏదో ఒక గొడవ. తనే నాకు ప్రపోజ్‌ చేసి పెళ్లి చేసుకుంది. అయినా ప్రతి విషయం సమస్యగా మారుస్తుంది. ఎందుకిలా? ఏం చేయాలి?
-జగదీశ్‌
 
చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే చాలనుకుంటారు. నిజానికి ప్రేమకు అసలైన పరీక్ష మొదలయ్యేది పెళ్లయ్యాకే. ప్రేమించేప్పుడు లోకమంతా పచ్చగానే ఉంటుంది. ప్రేమికుడు ఎంతో మంచివాడుగా, అర్థం చేసుకునేవాడిగా అనిపిస్తాడు. అలాగే అమ్మాయి కూడా సుగుణాలరాశిలా కనిపిస్తుంది. ఎందుకంటే వివాహానికి ముందు వారిద్దరూ కొంచెం సేపు మాత్రమే కలుస్తారు. ఆ కాసేపూ ఒకరినొకరు చూసుకుంటూ అర్థం చేసుకున్నామని అనుకుంటారు. పెళ్లి అనేది బాధ్యత అని, దాన్ని ఇద్దరూ సమంగా పంచుకోవాలని ఆలోచించరు. పెళ్లి వరకూ ఎంతో ఉన్నతంగా ఉండే ఆలోచనలు పెళ్లవగానే వారి తల్లితండ్రుల్లా మారిపోతాయి.
 
తమ భాగస్వామి అలా ఉండటం లేదా అని ఆలోచనలో పడతారు. అక్కడ నుంచి అలకలు, అపార్థాలు మొదలవుతాయి. విచిత్రమేమిటంటే... పెళ్లికి ముందు అంతకన్నా పెద్ద గొడవలైనా బతిమాలుకుని, సర్దుబాటు చేసుకున్న సంగతి మర్చిపోతారు. ఎంతసేపూ ఒకర్నొకరు తప్పు పడుతూ, గొడవపడుతూ ఉంటారు. అందరూ ఇలాగే ఉంటారని కాదు. ప్రేమ ఒకటే ముఖ్యం, పెళ్లి సాధారణం అనుకుంటూ భవిష్యత్తు సమస్యలు ఊహించకపోతే ఇలాగే అవుతుంది. మరి మీ ప్రేమ ఏ తరహానో ఆలోచించుకుంటే పరిష్కారం మీ చేతుల్లోనే ఉంటుంది.
-కె.శోభ
ఫ్యామిలీ కౌన్సెలర్‌, హార్ట్‌ టు హార్ట్‌, [email protected]