కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌

ఆంధ్రజ్యోతి, 08-10-2013: మహిళలు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? పురుషులు సుఖ సంతోషాలతో కాలం గడపాలంటే ఏం చేయాలి? కొందరు నిపుణులు ఇవే ప్రశ్నలపై ఓ పదిహేను ఏళ్ల పాటు పరిశోధనలు చేసి చివరికి ఓ మహత్తర సత్యం కనుగొన్నారు. భర్త భార్యలా ఉండాలి, భార్య భర్తలా ఉంటే జీవితంలో ఆనందమే ఆనందం అని ఒక్క ముక్కలో తేల్చి పారేశారు కొందరు ఢిల్లీ సైకాలజిస్టులు. అదెట్లా సాధ్యం? సాధ్యమేనంటున్నారు ఈ మానసిక వైద్య నిపుణులు. ‘మేం వేలాది మంది జీవితాల్ని నిశితంగా పరిశీలించి చెబుతున్నాం. ప్రయత్నం చేసి చూడండి. మీకే అనుభవమవుతుంది’ అని కూడా సవాలు విసురుతున్నారు. మగవాడిలా బతకడం ప్రారంభిస్తే మహిళలు సంతోషంగా, ఆరోగ్యంగానే కాక, నాజూకుగా కూడా ఉండొచ్చంటున్నారు ఈ నిపుణులు. 

భార్యపై ఆధిపత్యం కోసం భర్త, భర్తను తన మాట వినేలా చేసుకోవాలని భార్య ప్రయత్నిస్తున్నంత కాలం ఆ ఇల్లు లేదా కుటుంబం ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండదని ఈ సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఒకరి కోసం ఒకరన్నట్టుగా, ఒకరికి ఒకరు అన్నట్టుగా బతికినంత కాలం ఆ కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందని, పిల్లలు కూడా తెలివితేటలతో, ఆరోగ్యంగా ఉంటారని సైకాలజిస్టులు వివరించారు. ఇళ్లలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం, అన్నిటికీ అండగా ఉండడం అనేది ఆనందానికే కాదు, ఆరోగ్యానికి కూడా అవసరమని వారు చె ప్పారు.
 
మగవాళ్లు లేదా భర్తలు దేన్నీ పట్టించుకోరు. తిన్నామా, పడుకున్నామా అన్నట్టు ఉంటారు. వాళ్లేమీ ఇంటి పనుల్లో కల్పించుకోరు. ఆడవాళ్లలాగా బట్టలు ఉతకరు. అంట్లు తోమరు. తోచినప్పుడల్లా సినిమాలకు వెళ్లిపోతారు. స్నేహితులతో కాలక్షేపం చేస్తుంటారు. వారాంతపు రోజుల్లో భార్యాపిల్లలను విదిలేసి తాము చక్కగా ఎంజాయ్‌ చేస్తారు. పురుషుల తీరుతెన్నుల్ని చూసి మండిపడే బదులు ఆ అలవాట్లను మహిళలు తాము కూడా ఒంటబట్టించుకుంటే మంచిదని వారు సలహా ఇస్తున్నారు. నలుగురితోనూ కలిసి ఆటలు ఆడినా, పాటలు పాడినా, పిక్నిక్‌కు వెళ్లినా, సినిమాలకు వెళ్లినా మహిళల్లో ‘ఎనర్జీ లెవెల్స్‌’ పెరుగుతాయని అంజూ మజుందార్‌ అనే మానసిక ఆరోగ్య నిపుణురాలు చెప్పారు. ఇక తమ జీవితాల్ని కేవలం ఇరుగు పొరుగువారితో మాట్లాడడానికి మాత్రమే పరిమితం చేయకుండా, బంధువులు, స్నేహితుల పరిధిని పెంచుకోవడం వల్ల మహిళల్లో పాజిటివ్‌ ధోరణి పెరుగుతుందని, అది జీవితంలో అనేక సానుకూల మార్పులకు కారణమవుతుందని మరో సైకాలజిస్ట్‌ డాక్టర్‌ అల్కా దుబే చెప్పారు.
 
ప్రతి దానికీ ఊరికే హైరాన పడిపోయే లక్షణం చాలామంది మహిళల్లో కనిపిస్తుంటుంది. అనేక పనుల్ని ఒకేసారి ఆలోచించడం వల్ల, వాటినన్నిటినీ ఒకేసారి పూర్తి చేయాలన్న ఆలోచన వల్ల మహిళలు తొందరగా అలసిపోతారని దుబే అన్నారు. బట్టలు ఉతుకుతున్నప్పుడో, అంట్లు తోముతున్నప్పుడో, ఇల్లు తుడుస్తున్నప్పుడో మహిళల్లో విసుగు వ్యక్తమవుతుంటుంది. భర్త మీద, పిల్లల మీద కేకలు వేయడం లేదా కసురుకోవడం జరుగుతుంటుంది. ఇది వారిలోని మానసిక ఒత్తిడికి అద్దం పడుతుంది.
 
ఇది ఆరోగ్యానికి, సుఖ సంతోషాలకు మంచిది కాదు. ఇటువంటి సమయంలో భర్తలు లేక ఇంట్లోని మగవాళ్లు మహిళలకు సహాయ పడడం వల్ల మహిళలు కాస్తంత ఊరట చెందుతారు. మహిళలు ఒక పని చేస్తున్నప్పుడు, మరో పనిని పురుషుడు అందుకోవడం మహిళలకు ఎంతో ఊరటను ఇస్తుందని, మానసిక ఒత్తిడిని బాగా తగ్గిస్తుందని అల్కా దుబే వివరించారు. మహిళలు కూడా ఇంటి పనులన్నిటినీ నెత్తిన వేసుకోవడం శారీరక ఆరోగ్యానికే కాక, మానసిక ఆరోగ్యానికీ మంచిది కాదని మరో సైకాలజిస్ట్‌ డాక్టర్‌ ఎలిజబెత్‌ సేలీ హెచ్చరిస్తున్నారు. ఒకేసారి చాలా పనులు భుజాలకెత్తుకోవడానికి మహిళలేమీ ‘సూపర్‌ ఉమెన్‌’లు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఇరుగు పొరుగువారితో కబుర్లు చెప్పడం కన్నా బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌, రింగ్‌ వంటి ఆటలు ఆడడం మంచిదని ముంబైకి చెందిన సైకియాట్రిస్ట్‌ దీపికా సక్సేనా సలహా ఇచ్చారు. భర్త క్లబ్బులకు వెళ్లి ఆడే ఆటల్ని భార్య ఇంటి ఆవరణలోనే ఆడవచ్చని, పొరుగువారితో సమస్యల్ని చర్చించే కంటే, ఆటలు, షాపింగ్‌, వాకింగ్‌, వ్యాయామం, ఆసనాలు వంటి వాటిని వారికి కూడా అలవాటు చేయడం మంచిదని ఆమె సూచించారు. ‘‘ఒకవేళ గుడికి వెళ్లినా మూడు ప్రదక్షిణల కంటే 11 ప్రదక్షిణలు చేయడం అటు ఆరోగ్యానికి, ఇటు ఆధ్యాత్మికతకూ మంచిది’’ అని కూడా ఆమె సలహా ఇచ్చారు.