స్ట్రె..స్‌...స్‌...స్‌..స్‌ అవకండి!

ఒత్తిడి... ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగం!
లక్ష్యాలను చేరుకోవాలన్నా,
విజయం వరించాలన్నా....
ఎంతోకొంత ఒత్తిడి అవసరమే!
అయితే, అదే ఒత్తిడి జీవన నాణ్యతను దెబ్బతీసేంత తీవ్రంగా ఉండకూడదు!
మరి... ఒత్తిడిని అదుపు చేసేదెలా?
ఒత్తిడిని జయించి, ఆరోగ్యాన్ని కాపాడుకునేదెలా?

15-04-2019: ఎవరమైనా సరే... రోజు మొత్తంలో ఏదో ఒక సందర్భంలో ఒత్తిడి ఎదుర్కొంటాం. కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితుల వల్ల, ఊహించని సందర్భాల కారణంగా తట్టుకోలేనంత ఒత్తిడికి లోనవుతాం. అయితే ఇవన్నీ శరీరం, మనసు తట్టుకోగలిగినంత మేరకే ఉంటే ఫరవాలేదు. వీటి పరిధి మించితే మాత్రం ఆ ప్రభావం కచ్చితంగా శరీరం మీద పడుతుంది. ఫలితంగా మైగ్రెయిన్‌ (పార్శ్వపు నొప్పి) మొదలు రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వరకూ రకరకాల సమస్యలు బాధించడం మొదలు పెడతాయి. ఒత్తిడి ప్రభావం గుండె మీద కూడా ఎక్కువే!

 
ఒత్తిడి ప్రభావాలు ఇవే!
మానసిక ఒత్తిడి మనసు, శరీరం మీద సమప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కొన్ని శారీరక రుగ్మతలు, మానసిక కుంగుబాట్లు తప్పవు. ఈ రెండు రకాల ఇబ్బందులను గమనించుకుంటూ, వాటికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ ఉండాలి.
 
శారీరక రుగ్మతలు: ఒత్తిడి వల్ల రుగ్మతలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మరీ ముఖ్యంగా వంశపారంపర్యంగా సంక్రమించే మధుమేహం, హృద్రోగాలు లాంటి రుగ్మతలు మరికొంత ముందుగానే మొదలవుతాయని శాస్త్రీయంగా రుజువైంది. ఒత్తిడి తాలూకు రుగ్మతలన్నీ ఒక చైన్‌ రియాక్షన్‌లా కొనసాగుతాయి. ఒత్తిడి మూలంగా రక్తపోటు, రక్తపోటు మూలంగా గుండె పోటు, హార్ట్‌ ఫెయిల్యూర్‌, గుండె కండరాలు దెబ్బ తినడం, స్ట్రెస్‌ కార్డియోమయోపతీ...ఇలా ఒత్తిడి ప్రభావం పరోక్షంగా గుండె మీద పడుతుంది. రక్తపోటు మూలంగా మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి.
 
లక్షణాలు కనిపెట్టాలి!: ఒత్తిడి వల్ల తలెత్తే రుగ్మతలను ముందుగానే గుర్తించడం కష్టం. లక్షణాలు బయల్పడే స్థితి వచ్చిందంటే అప్పటికే శరీరం ఒత్తిడి తాలూకు ప్రభావం బారిన పడిపోయిందని అర్థం. అయితే కనిపించే లక్షణాలను కూడా కొందరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించగలిగితే సత్వర చికిత్సతో ఆరోగ్యం మరింత పాడవకుండా నియంత్రించుకోవచ్చు.
 
లక్షణాలు ఇవే....
ఛాతిలో నొప్పి
ఆయాసం
నిద్ర పట్టకపోవడం
మూత్రం ఎక్కువ లేదా తక్కువ ఉత్పత్తి కావడం
సుఖ విరేచనం అవకపోవడం
తరచూ తలనొప్పి

రక్తపోటు ఉంటే: రక్తపోటుకు కారణమయ్యే ఒత్తిడికి మూలాన్ని గమనించి ముందు దాన్ని తొలగించుకోవాలి. అదే సమయంలో రక్తపోటును నియంత్రించే మందుల వాడకాన్ని వెంటనే మొదలు పెట్టాలి. అలాగే మానసికంగా, భావోద్వేగపరంగా ఒత్తిడిని తగ్గించే మెలకువల కోసం వైద్యపరమైన కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. అలాగే నిద్రలేమి కారణమైతే, ఆందోళన తగ్గించి నిద్ర వచ్చేలా చేసే మందులు కొంతకాలం వాడాల్సి ఉంటుంది.

గుండెపోటు: స్ర్టెస్‌ హార్మోన్లు విడుదలవడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది, ఫలితంగా రక్తపోటు ఎక్కువవుతుంది. తద్వారా తిరిగి గుండె మీద ఒత్తిడీ పెరుగుతుంది. ఇలా గుండె ఒడుదొడుకులకు లోనవడం వల్ల కొలెస్టరాల్‌ ప్లేక్స్‌ హఠాత్తుగా రక్తనాళాల్లో అడ్డుపడి గుండె పోటు రావచ్చు. హఠాత్తుగా తీవ్రమైన భావోద్వేగానికి గురైనప్పుడు
గుండె నొప్పి రావడానికి కారణం ఇదే!
 
బ్రెయిన్‌ స్ర్టోక్‌: రక్తపోటు మూలంగా మెదడులో రక్తస్రావం జరిగి బ్రెయిన్‌ స్ర్టోక్‌ రావచ్చు. రక్తస్రావం వల్ల మెదడు మీద ఒత్తిడి పెరిగి, స్ట్రోక్‌ వచ్చినప్పుడు శరీరంలో కొంత భాగం చచ్చుబడిపోవచ్చు.
 
ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి!
ఒత్తిడితో కూడిన వృత్తుల్లో ఉండేవారు అన్నిటికంటే ముందు ఒత్తిడిని తగ్గించే విధానాలు అనుసరించాలి. వాటితోపాటు 35 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తీ ప్రతి ఏడాదీ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకోసం సాధారణ వైద్యులను సంప్రతించినా సరిపోతుంది. రక్తపోటు, మధుమేహం, గుండె పనితీరు తెలిపే పరీక్షలతో ముందుగానే రాబోయే రుగ్మతలను కనిపెట్టవచ్చు. మరీ ముఖ్యంగా వంశపారంపర్యంగా మధుమేహం, రక్తపోటు, హృద్రోగాలు సంక్రమించే వీలున్న వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
 
మహిళల్లో ఒత్తిడి ప్రభావం
మెనోపాజ్‌లో ఉన్న 55 ఏళ్ల మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనైతే వారికి ‘స్ట్రెస్‌ కార్డియో మయోపతి’ అనే హృద్రోగం బాధిస్తుంది. కుటుంబసభ్యులు చనిపోయిన సందర్భంలో, వృత్తిపరమైన మానసిక ఒత్తిడికి లోనైన సందర్భంలో హఠాత్తుగా గుండె బలహీనపడిపోతుంది. ఆ సమయంలో గుండె రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యం కోల్పోతుంది. ఇలాంటప్పుడు హార్ట్‌ ఫెయిల్‌ అయ్యే అవకాశాలుంటాయి.
 
 
డాక్టర్‌ ప్రణీత్‌,
కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌,
కేర్‌ హాస్పిటల్స్‌,
బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.