ఒత్తిడిని జయిద్దాం

ఆంధ్రజ్యోతి, 13-10-2015: ఉదయం లేవడం.. గడియారాన్ని చూస్తూ తయారైపోవడం.. ట్రాఫికర్‌ను ఈదుకుంటూ ఆఫీ్‌సకు వెళ్లి పోవడం.. వర్క్‌ ప్రెషర్‌.. ఇంటికి రావడం.. ఇలా ఒత్తిడిలోనే జీవితం సాగిపోతుంటుంది. గజి‘బిజీ లైఫ్‌’లో ఒత్తిడితోనే సావాసం చేస్తూ చిత్తవుతుంటారు. దైనందిన జీవితంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఒత్తిడి అనారోగ్యానికి కారణం అవుతోంది. ఈ ఒత్తిడిని అధిగమించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులను స్వాగతిస్తే చాలు ఈ ఒత్తిడికి చెక్‌ పెట్టేయొచ్చు. 

  • పొద్దెక్కే వరకు పడుకోకుండా ఉదయాన్నే నిద్రలేచి వాకింగ్‌ చేయండి. ప్రతి రోజూ ఓ ఇరవై నిమిషాలు నడక సాగించండి. అది ఒంట్లో కెలోరీలు తగ్గించడమే కాదు.. మనసుపై కూడా సానుకూలమైన ప్రభావం చూపుతుంది. 
  • మంచి సంగీతం చెవులనే కాదు.. మనసునూ ఆహ్లాదపరుస్తుంది. మెదడు నుంచి పాజిటివ్‌ సంకేతాలు విడుదలయ్యేలా చేస్తుంది. ఇలా రోజూ సంగీతం వినడం వల్ల మీకు తెలియకుండానే ఒత్తిడిని జయించగలుగుతారు. 
  • ఇంటిలో పోరు.. ఆఫీసులో పని హోరు.. ఈ రెండూ ఒత్తిడికి ప్రధాన కారణాలు. ఇంటి టెన్షన్స్‌ ఆఫీసుకు మోసుకెళ్లామా.. పనితనంలో తేడా వచ్చి బాస్‌తో చివాట్లు తప్పవు. ఆఫీ్‌సలోని ఇబ్బందులు ఇంటికి తీసుకొస్తే అంతే సంగతులు. సో.. ఎక్కడి టెన్షన్స్‌ అక్కడే వదిలేయండి. ఇలా కొన్ని రోజులు ఫాలో అయితే మీ పర్సనల్‌ లైఫ్‌ హాయిగా సాగిపోతుంది. 
  • ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడిని అమాంతం పెంచేస్తాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్న సూత్రాన్ని పాటిస్తే మనీ మేనేజ్‌మెంట్‌ సరిగ్గా చేయగలుగుతారు. కొన్నాళ్లకు ఆర్థిక ఇబ్బందులను అధిగమించగలుగుతారు. దీంతో మనీ టెన్షన్స్‌ కూడా దూరమైపోతాయి. 
  • ఆవేశంలో, నిరుత్సాహంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇవ్వవు. పైగా మీ మనసుపై ఒత్తిడిని పెంచేస్తాయి. ఇలాంటి సందర్భాలు ఎదురైనపుడు మనసుకు సర్ది చెప్పుకోండి. ఓ ఇరవై నిమిషాలు ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకోండి. మీరు స్థిమితపడ్డారు అని అనుకున్నాక నిర్ణయాలు తీసుకోండి. 
  • ధ్యానం ఒత్తిడిని అధిగమించడానికి దివ్యఔషధంగా పని చేస్తుంది. అలాగని గంటల కొద్ది ముక్కుమూసుకుని కూర్చోవాల్సిన పనిలేదు. రోజూ ఉదయం ఓ పదిహేనునిమిషాలు ధ్యానం చేయండి.