కన్నీళ్లను దిగమింగేస్తారా?

ఆంధ్రజ్యోతి, 21/01/2014: దుఃఖమే రాని స్థితిలో జీవితం సాగిపోతే అంతకన్నా ఏం కావాలి? అలా కాకుండా, ఒక పక్కన దుఃఖం తన్నుకు వస్తూంటే దాన్ని బలవంతంగా అణ చుకోవాలిన చూస్తే అందులో ఏ సుఖమూ ఉండదు. పైగా అది దుఃఖాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఏడవడం బాధాకరనమైన స్థితే కానీ, జరిగిన నష్టాన్ని మన శరీరమూ, మనసూ ఆమోదించే మార్గమే అది. ఆ దుఃఖాంశాన్ని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే, అదొక దిక్కుతోచని పరిస్థితిలోకి తీసుకువెళుతుంది. అంతిమంగా అది మద్యం, మాదక ద్రవ్యాల వంటి వ్యసనాల వంటివి అంటుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే దుఃఖాన్ని, వాటి తాలూకు క న్నీళ్లను బయటికి రానీయడమే క్షేమకరం అంటున్నారు మానసిక నిపుణులు. 

జీవితం ఏడవడానికేమీ కాదు. కానీ, ఆ ఏడ్పు ఎదలో మకాం వేశాక, కన్నీళ్ల రూపంలో దాన్ని బహిర్గతం చేయడం తప్పనిసరి. జరిగిన విషాదం తాలూకు న ష్టాన్ని గురించి ఆలోచించకకుండా వాటిని మరిచిపోయే ప్రయ త్నాలు చేస్తే అవి మరింత తీవ్రంగా గుర్తుకు రావడమే కాకుండా, వాటిని ఎలా తట్టుకో వాలో బోధపడక చాలా మంది మద్యానికి మాదక ద్రవ్యాల పాలబడే ప్రమాదమూ ఉంది. అందుకే ఏడుపొస్తే, ఏడ్చేయడమే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. నిజానికి శోకం నాడీ వ్యవస్థ, మానసిక వ్యవస్థల్లోని భారాన్ని తొలగించే గొప్ప ఔషధంగా పనిచే స్తుంది.
 
ఆత్మీయుల మధ్యన... 
బాధల్లో ఉన్నప్పుడు కొందరు తన స్థితి ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం, ఎక్కడో ఒంటరిగా ఉండిపోవాలని చూస్తారు. అలా కాకుండా మన హృదయానికి మద్ధతుగా నిలిచే వారి చెంతన చేరడం ఎంతో అవసరం. వాళ్లు రక్తసంబంధీకులే కావచ్చు లేదా స్నేహితులే కావచ్చు. ఏకాకితనానికి దూరంగా ఆత్మీయులను కలవడం ఆ స్థితిలో ఎవరికైనా అవసరమే. ఎవరో ఒకరితో భావోద్వేగాలను పంచుకోవడం అప్పుడొక అనివార్యమైన విధానం. అవసరమనిసిస్తే వారినుంచి ఏదైనా సహ కారం అడగడానికీ సంకోచించకూడదు. అందరికీ తమదైన ఒక జీవితం ఉంటుంది. ఏదో ఒక సమస్యతో అందరూ ఎప్పుడో ఒకప్పుడు సతమతమైన వారే. వారంతా ఈ రోజు మళ్లీ ఒక సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నారూ అంటే ఆ సమస్యను వారు అధిగమించినట్లే కదా! వాళ్ల జీవితంలోని కష్టాలు, మన జీవితపు కష్టాలు ఒకటి కాకపోవచ్చు. కానీ ఆ మూలాంశంలో ఎంతో కొంత ఏకత్వం, ఏదో ఒక సారూప్యత ఉంటాయి. అందుకే యథాతథంగా కాకపోయినా, కొన్ని మార్పుచేర్పులతో వారి విధానాన్ని ఏదో ఒక మేరకు ఉపయోగించుకోవచ్చు.
 
మూలాలు ఏవైనా... 
మనకు జరిగిన నష్టాలకు మూలం, బాహ్య కారణాలూ కావచ్చు. లేదా స్వయంగా చేసిన పొరపాట్లూ కావచ్చు. నిజంగానే మన వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే, ఆ నిజాన్ని మనస్పూర్తిగా ఒప్పుకోవడమే సరియైన విధానం. ఎందువల్ల అంటే ఒప్పుకుంటే గానీ, దాన్ని అధిగమించడం ఎలాగో స్పష్టంగా బోధపడదు. ఆ తప్పు మరెవరి మీదికో తోసివేసే ప్రయత్నాల్లో ఉండిపోతే, ఆ స్థితిని అధిగమించే శక్తి ఎప్పటికీ నీకు రాదు.
 
తీవ్రమైన మనోవ్యధతో ఉన్న సమయాల్లో కీలక నిర్ణయాలేవీ తీసుకోకూడదు. ఎందుకంటే నిరంతరమైన ఆత్మక్షోభ నిర్ణయాత్మక శక్తిని బాగా తగ్గించివేస్తుంది. అందుకే అప్పుడు తీసుకోవలసిన నిర్ణయాల్ని కొంతకాలం పాటు వాయిదా వేయాలి. తొందరపడి అప్పుడే ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే వాటి వల్ల భారీ నష్టమే జరిగే ప్రమాదం ఉంది. 
విషాదకర విషయాలను ఏ రోజుకాజు ఒక మినీ నోట్‌బుక్‌లో రాసిపెడితే మేలు. అలా రాసే ప్రతి వాక్యం ఒకరకంగా కన్నీళ్లు రాల్చడంతో సమానం. కన్నీళ్లు రాలడంతో గుండె బరువు దిగినట్లే, విషాదాల్ని రాయడం ద్వారా కూడా గుండె బరువు తగ్గుతుంది. అదే సమయంలో దుఃఖాన్ని అధిగమించడం ఎలాగో తెలిపే సాహిత్యం కూడా చదవాలి. దానికి తోడు సృజనాత్మక, క ళాత్మక విషయాల్ని కూడా దర్శించే ప్రయత్నాలు చేయాలి. ఇవి నీలో నువ్వే కూరుకుపోకుండా చేస్తాయి. అలా జరిగిన విషాదాన్నించి అఽధిగమించడానికి పరోక్షంగా తోడ్పడతాయి.
 
ఉత్సవాలతో ఉత్సాహం 
మనం ఎంత విషాదంలో ఉన్నా, జన్మదినోత్సవాలకు, వార్షికోత్సవాలకు విధిగా హాజరవుతూ ఉండాలి. అవి మన విషాదాలకు అతీతంగా మనల్ని నడిపిస్తాయి. ఏమైనా భ్రమల్లోకి వెళ్లకుండా వాస్తవికంగా జీవించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. కాకపోతే, ఎంత తీవ్రమైన దుఃఖమైనా సహజంగానే కొన్ని నెలల పాటు ఉండి ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. అలా కాకుండా ఎవరైనా ఆరుమాసాలు, ఏడాది దాకా అదే దుఃఖంలో ఉంటున్నారూ అంటే అదేమైనా మానసిక వ్యాధి కావచ్చేమోనని అనుమానించాలి. అదే నిజమనిపిస్తే, మానసిక నిపుణులను సంప్రదించడానికి ఏమాత్రం సంకోచించకూడదు. ఒకవేళ సమస్య సామాన్యమే అయితే, ఆలోచనా విధానాన్ని మరింత విశాలం చేసుకోవడం ద్వారా గాయాలనుంచి, విషాదాలనుంచి బయటపడవచ్చు. బాగా విషాదంలో ఉన్నప్పుడు విశాల భావాలు నీలో అంకురించే అవకాశాలు తక్కువగానే ఉండవచ్చు. అందుకే ఆ స్థితిలో పుస్తకాల్ని, అనుభవ జ్ఞులైన వ్యక్తుల్ని కలవాలి. అందుకు అవసరమైన అన్ని మార్గాల్నీ అనుసరించాలి. ఏమైనా కన్నీళ్లను దిగమింగడం కాదు, వాటిని బయటికి వదిలేయడంలోనే గుండె బరువు దిగుతుందని, తిరిగి సామాన్య స్థితికి రావడానికి అదో గొప్ప సాయంగా నిలబడుతుంది అంటున్నారు నిపుణులు.