దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ సూచనలు తప్పనిసరట!

ఆంధ్రజ్యోతి(23-10-2016): ఓ పురుషుడు మాట్లాడుతుంటే అతనిలో తనకు రక్షణగా నిలిచే తండ్రి కనిపించవచ్చు, లక్ష్యం దిశగా నడిపించే స్నేహితుడు కనిపించవచ్చు లేదా జీవితాంతం వెన్నంటి నిలచి తోడుండే భర్తలా కనిపించవచ్చు. ఒకే వ్యక్తిలో ఎన్నో వ్యక్తిత్వాలు ఉంటాయి. భర్తల వ్యక్తిత్వాల గురించిన చర్చ వచ్చినప్పుడు మాత్రమే చాలామంది మగువలు తమ భర్త ఎలాంటి వాడన్నది బేరీజు వేసుకోవడం మొదలుపెడతారు. 
 
అమ్మాయిల మనస్తత్వం గురించి అనేకమంది వర్ణించి చెప్పారు, అయితే మగవాళ్ల మనస్తత్వాల గురించి తెలుసుకునే అవకాశాలు మాత్రం అమ్మాయిలకు తక్కువనే చెప్పాలి. ఓ మగవాడిలో స్నేహితుడు కనిపిస్తాడు, భర్త కనపడతాడు, తండ్రి కనపడతాడు. ప్రతి మగువ తనకు కాబోయే భర్త రూపవంతుడూ, గుణవంతుడూ కావాలని కోరుకుంటుంది. అయితే తనకు కావాల్సిన పురుషుడిలోని గుణగుణాల్ని ఎంచుకునే సమయంలో అతను ఏరకం వ్యక్తి అన్నది విశ్లేషించుకోవాలి.
 
 
ఎన్నో రకాల సందర్భాలు పురుషుణ్ణి మంచి భర్తగా నిర్వచించడానికి ఉపయోగపడతాయి. ఇది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకంగా ఉంటుంది. అతను ఎలాంటి వాడన్నది పక్కనబెడితే మహిళలు ఎక్కువగా వారి స్వభావంకన్నా తమతో చురుగ్గా ఉంటూ, తమ మాటలు వినాలని కోరుకుంటారని మానసిక తత్వవేత్తలు చెప్తున్నారు. మంచి భర్త మాత్రమే మంచి తండ్రి కాగలడని వారు చెప్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించిన కొన్ని సర్వేలు కూడా తేల్చిచెప్పాయి. అందుకే జీవితంలో అమ్మాయిలు తమ ప్రాధాన్యాలను అనుసరించి అబ్బాయిని ఎంచుకోమని నిపుణులు సలహాలిస్తున్నారు.
 
 
కలుపుగోలుతనం 
చాలామంది మగవారు దృఢంగా, గంభీరంగా ఉంటే తమ భావోద్రేకాల్ని అంత సులువుగా వ్యక్తం చేయరు. అయితే తమ భావోద్రేకాల గురించి అస్సలు చెప్పరు. మరికొందరేమో అన్ని విషయాల్లో ఓపెనగా ఉంటారు. నేటితరం అమ్మాయిలు తాము మెచ్చేమగవాడు సకల విషయాలను చివరకి పాత రిలేషనషి్‌పలు ఏమైనా ఉన్నా సరే, వాటి గురించి కూడా చెప్పాలని కోరుకుంటారు. ఇలా ఉండడంవల్ల తమ మధ్య విశ్వసనీయత పెరుగుతుందని వారు భావిస్తున్నారు. ఫలితంగా వారిబంధం మరింత దృఢంగా మారుతుందన్న ఉద్దేశం. పక్కన లేకున్నాసరే ప్రతివిషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పే హజ్బెండ్‌ ఉంటే మీరు లక్కీనే!
 
 
అన్ని విషయాల్లో సహకారం 
ఈకాలం మగువలు చాలామంది స్వతంత్ర ధోరణిలో ఉన్నాసరే కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా భర్త అండగా ఉండాలని కోరుకుంటున్నారు. దీనివల్ల జీవితం సజావుగా ఉంటుందని వారి నమ్మకం. ఇబ్బందికర పరిస్థితుల్లో ఆదరించి పరిష్కారంచూపే దిశగా గైడ్‌చేసి ఒత్తిడిని తగ్గిస్తాడు. ఉద్యోగం నుంచి రాత్రిళ్ళు ఇంటికి చేరినా సరే తనకోసం చూడకుండా ఆహారం సిద్ధం చేసే వ్యక్తినీ, ఆర్థిక అంశాల్లో సమతుల్యం పాటించగలమన్న భరోసా ఇచ్చే వ్యక్తినీ కోరుకుంటున్నారు. ఇలా అన్నింటిలోనూ సహకారం అందించే వ్యక్తి దొరికితే జీవితంలో హాయి ఉంటుందని వారి అభిప్రాయం.
 
 
చెప్పేది వింటున్నాడా? 
చాలామంది అబ్బాయిలు అమ్మాయి ఏం చెబుతున్నా వింటున్నట్టు నటిస్తారేతప్ప నిజంగా మనసు పెట్టి వినేవారు చాలా తక్కువ మంది. ఎదుటివారు చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించకపోవడం చాలామంది చేసేదే. అయితే అప్పుడప్పుడు ధ్యాస పెట్టకపోవటం అభ్యంతరకరంకాదు. కానీ ఎప్పుడూ చెప్పేది వినకపోవడం, ఇరువురి చర్చల్లో నాకెందుకులే అని ఉదాసీనంగా ఉంటూ పాలుపంచుకోకపోవడం మాత్రం నొచ్చుకునే విషయాలే. కాబోయే కలల పురుషుడు మంచి శ్రోతై ఉండాలని ఈకాలం అమ్మాయిలు కోరుకుంటున్నారు. తన కుటుంబానికి, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలు వినడంలో నిరాసక్తత చూపిస్తే అలాంటి వ్యక్తిని వదులుకోవడానికి సైతం సిద్ధంగా ఉంటున్నారట.
 
 
ప్రభావితంగా ఉంటున్నారా? 
బాంధవ్యం కలకాలం నిలిచి ఉండాలంటే ఇద్దరూ ఒకరినొకరు ప్రభావితం చేసుకోగలగాలి. నిరంతరం కేరింగ్‌ చూపుతూ బాధ్యతలు పంచుకోవడానికి, మీరు చేసుకునే అబ్బాయి సదా సన్నద్ధంగా ఉండే వ్యక్తి అయితే అదృష్టవంతుడే. ఆ చేతిని విడవనేకూడదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సహాయపడుతూ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో తోడుగా నిలిచే వ్యక్తి దొరికితే పూర్తి అనుకూలత కలిగిన భర్తగా అతన్ని చెప్పవచ్చు. అలా ప్రభావితంగా ఉండే అబ్బాయి కోసం అమ్మాయిలు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారట.
 
 
సమసిపోయే పోట్లాటలు
దాంపత్య జీవనంలో చిన్న చిన్న తగాదాలు, గొడవలు ఎప్పటికప్పుడు సమసిపోయే విధంగా ఉండాలి. అసలు వాగ్వాదాలు లేవు అని ఏ దంపతులైనా చెబితే అది నమ్మశక్యం కాని విషయమే. ఎవరికి వారు తామే కరెక్ట్‌ అంటూ హోరాహోరి వాదనలోకి దిగినప్పుడు పరిస్థితిని అంచనా వేసుకోవాలి. ఆరోగ్యపూరిత చర్చతో ఆ ఆర్గ్యుమెంట్‌ ముగియాలి. దానివల్ల తదుపరి ఏ ఇబ్బందీ రాదు. అంటే వచ్చే గొడవలన్నీ ఫెయిర్‌గా ఉండి, వ్యక్తిగత కోపతాపాలతో కాకుండా ముగించాలన్నమాట.
 
భర్తపాత్రని సక్రమంగా నిర్వర్తించగలిగే వ్యక్తి తప్పకుండా తండ్రి పాత్రని కూడా సక్రమంగా పోషించగలుగుతాడు. పిల్లలు పుట్టినతర్వాత తల్లిదండ్రులు ఎంత సంతోషంతో ఉంటారో వారు పెరుగుతున్నకొద్దీ ఆ సంతోషంతో పాటు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. పిల్లలు విసిగిస్తారు, చికాకు తెప్పిస్తారు. వీటి వల్ల దంపతులు ముందే అనుకున్న కొన్ని ప్లాన్లు అంటే, డిన్నర్లు, బిజినెస్‌ పార్టీలు, లాంటివి మిస్‌ అవ్వాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో, కాబోయే భర్త పట్టువిడుపులుగల వ్యక్తిత్వం ఉన్నవాడైతే పిల్లల వ్యవహారాలను సమర్థవంతంగా స్వీకరించగలడు. అతనికి సహనం, ఓర్పు కీలకం. పిల్లలు చికాకు పెట్టినా సరే తిట్టకుండా, శాంతంగా, వారిని హ్యాండిల్‌ చేయగలుగుతుంటే అతని భార్య గొప్ప అదృష్టవంతురాలని చెప్పొచ్చు. అమ్మాయిలు చేసినట్లు అబ్బాయిలు ప్రేమ వ్యక్తం చేయలేరు. వారు ఈ విషయంలో అమ్మాయిలకంటే తక్కువే అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే అలా కాకుండా పిల్లల్ని దగ్గరకు తీసుకుని ముద్దు చేయడం, కౌగిలించుకోవడం, పిల్లల్ని దగ్గరకి తీసుకునే తత్వం అతనికి ఉంటే అతను మంచి నాన్న కిందే లెక్క.
 
 
వృత్తి, లైఫ్‌ బ్యాలెన్స్ చెయ్యాలి 
చాలామంది ఉద్యోగ జీవితాన్ని, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స చేసుకోలేక తలమునకలు అవుతుంటారు. లక్ష్యాలు, ఒక దృక్పథం ఉండడం మంచిదే కానీ వాటిలో పడి కుటుంబ జీవితం వదులుకుంటే అవి వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపిస్తాయి.. వృత్తి ఏదైనా సరే భర్త తన వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగాన్ని సునాయాసంగా నిర్వర్తించగలుగుతున్నాడో లేదో చూడాలి. అతను కనుక అలా చేయగలిగితే కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలవాడని చెప్పవచ్చు. అతనికి ఆ గుణం ఉందో లేదో విశ్లేషించాలి.
 
మగవాడిలో తండ్రి, భర్త ఈ రెండు ధోరణులూ ఉన్నప్పుడు అతని సాంగత్యం సహచరికి ఓ వరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రెండు గుణాలు పుష్కలంగాఉన్న భర్త దొరికితే వారి దాంపత్య జీవితం పదికాలాలు సంతోషంతో ఉంటుంది