ఒత్తిడిని చిత్తు చేయండిలా!

ఒత్తిడితో  ఊబకాయం!

ప్ర‌స్తుతం చాలామంది పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద జీతాలు తీసుకుంటున్నారు. కానీ వ్య‌క్తిగ‌త ఆరోగ్యంపై ఎవ‌రికీ స‌రైన అవ‌గాహ‌న లేదు. ముఖ్యంగా ఆహారం, వ్యాయామంపై మ‌న దేశంలోని యువ‌తకు క‌నీస అవగాహన ఉండటం లేదు. శారీరక శ్రమ యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించడంలో ప్రతీ ఒక్కరు విఫలమవుతున్నారు. ఫలితమే తీవ్రమైన మానసిక ఒత్తిడి! తద్వారా పెరిగిపోయే బరువు! ప్రపంచవ్యాప్తంగా అధికబరువుతో బాధపడుతున్నవారిలో అధికశాతం ఒత్తిడిని ఎదుర్కొంటున్నవారేనని ఎన్నో అధ్యయనాల సారాంశం. మనుషులను మనసులను దూరం చేస్తూ, బంధాలను, అనుబంధాలను ప్రశ్నార్థకం చేస్తూ చాపకింద నీరులా వ్యా్పిస్తున్న ఒత్తిడిని చిత్తుచేసేదెలా? 

 
ఇదివరకు ప్రతిఒక్కరు తమ తమ అవసరాలకు సరిపడా శారీరక శ్రమ చేస్తూ ఆహారాన్ని సంపాదించుకునేవారు. దానివల్ల జీవక్రియల వేగం సక్రమంగా ఉండి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు కూర్చున్న చోటికే అన్నీ అందుబాటులోకి రావడం వల్ల శారీరక శ్రమ అన్నదే లేకుండా పోయింది. దానికి తోడు మానసికంగా ఒత్తిడికి గురికావడంతో తినే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోకుండా, అదుపు తప్పి తింటూ ఒంట్లో కొవ్వు పెరిగేందుకు కారణమవుతున్నారు. ఫలితంగా ఊబకాయం బారినపడుతూ నానా అవస్థలు పడుతున్నారు. మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుని ప్రతిరోజూ కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించి సరైన పద్ధతిలో తిన్నప్పుడు ఎంత పని ఒత్తిడి ఉన్నా అది ఆరోగ్యంపై ప్రభావం చూపదంటున్నారు నిపుణులు.
 
మారుతున్న జీవనశైలి
ప్రతిమనిషి జీవితంలో ఒత్తిడి ఒక భాగం. ఆదిమ కాలం నుంచి మనిషి ఒత్తిడిలోనే మనుగడ సాగిస్తున్నాడు. అయితే చాలాకాలం మనిషి ఒత్తిడిని జయించాడేగాని దాని బారినపడి జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకోలేదు. కానీ ఈ ఆధునిక కాలంలో మనిషి ఎందుకు ఒత్తిడిని ఎదుర్కోలేకపోతున్నాడు? దీనికి ఒకటే కారణం... మారుతున్న జీవనశైలి. ప్రస్తుతం ప్రతిఒక్కరూ  టార్గెట్లను అనుస‌రించి ప‌నిచేయాల్సి ఉంటుంది. పోటీ వాతావ‌ర‌ణంలో ప్ర‌త్య‌ర్ధుల‌ను ఎదుర్కోవాల‌న్నా, క‌స్ట‌మ‌ర్‌కు అత్యుత్తమ స‌ర్వీస్‌ అందించాల‌న్నా టార్గెట్ అనేది చాలా కీల‌క‌మైన విష‌య‌ం. అయితే అనుకున్న గ‌డువులోగా పని పూర్తికావాల‌న్న ఒత్తిడి ఉద్యోగుల‌పై తీవ్రంగా ప్ర‌భావం చూపుతోంది. ఫ‌లిత‌మే మానసిక కుంగుబాటు, ఊబ‌కాయం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు. ముఖ్యంగా కార్పొరేట్ ఆఫీసుల్లో ప‌నిచేసేవారు ఈ విధ‌మైన ప‌ని ఒత్తిడికి గుర‌వుతున్నారు. మంచి వేతనాలు తీసుకుంటున్నా గ‌డువులోగా ప‌ని పూర్తిచేయాల‌న్న ఒత్తిడి వాళ్ల ఆరోగ్యానికి ప్ర‌తికూలంగా మారుతోంది.

టార్గెట్లే మూలం!

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఉద్యోగులు తీవ్ర‌మైన ప‌ని ఒత్తిడిలో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ముఖ్యంగా టార్గెట్లు, నివేదిక‌లు, బాసిజం వంటివి ఉద్యోగుల‌పై మాన‌సిక ఒత్తిడిని పెంచుతున్నాయి. కార్పొరేట్ రంగంలో ప‌నిచేస్తున్నవారైతే మ‌రింత‌గా ప‌ని ఒత్తిడికి గుర‌వుతున్నారు. దీంతో చాలామంది ఉద్యోగుల‌ను శారీర‌క స‌మ‌స్య‌ల‌కు తోడు మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా వేధిస్తున్నాయి. మెల్ల‌గా మొద‌ల‌య్యే ఈ స‌మ‌స్య త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డంతో త‌ర్వాత పెను స‌మ‌స్య‌గా మారుతోంది. ముఖ్యంగా ఆఫీస్‌లో ప‌ని ఒత్తిడి ఊబ‌కాయానికి దారితీస్తోందని తాజా అధ్య‌య‌నాలు తేల్చి చెపుతున్నాయి. ఒక్కసారి ఊబ‌కాయం వ‌స్తే ఆ త‌ర్వాత ర‌క్త‌పోటు, షుగర్ వంటి వ్యాధులు మెల్ల‌గా శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తున్నాయి. దీంతో ప‌నిచేసే వ‌య‌స్సు, స‌త్తా ఉండ‌గానే చాలామంది అనారోగ్యం పాల‌వుతున్నారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా వ్యాయామానికి త‌గిన స‌మ‌యం కేటాయించ‌డం, స‌రైన ప‌ద్ధ‌తిలో స‌రైన తిండి తిన‌డం వ‌ల‌న ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. లేదంటే ఎంత ఉన్న‌తస్థితిలో ఉన్నా, ఎంత శాల‌రీ తీసుకుంటున్నా, అదంతా ఎందుకూ కొర‌గానిదిగానే మారుతుంది. ఒత్తిడిని ద‌రిచేర‌నీయ‌కుండా ఆరోగ్య‌వంత‌మైన జీవన‌శైలిని అవ‌లంబించిన‌ప్పుడే కెరీర్‌లోని మజాను ఆస్వాదించేందుకు వీలు క‌లుగుతుంది. 
 
మహిళల్లోనే ఎక్కువ!
మానసిక ఒత్తిడి వల్ల అధికబరువు, ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం పురుషులతో పోల్చినప్పుడు మహిళల్లోనే ఎక్కువంటున్నారు అమెరికాకు చెందిన కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఎందుకంటే వారి జీవితాల్లో జరిగిన బాధాకరమైన, ప్రతికూల సంఘటనలను పురుషులకంటే మహిళలే ఎక్కువగా గుర్తుచేసుకుంటూ దీర్ఘకాలికంగా ఒత్తిడికి లోనవుతారని వారు విశ్లేషిస్తున్నారు. తద్వారా మహిళల్లో మానసిక ఒత్తిడి పెరిగి శారీరక, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఎక్కువే.  

సరైన ప్రణాళిక ముఖ్యం

మానసిక ఒత్తిడి శ‌రీరంలో అద‌న‌పు కొవ్వును విడుద‌ల చేస్తుంది. అద‌నంగా విడుద‌లైన కొవ్వు స్థాయిలకు సరిపడా శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డంతో శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంది. వీటి ఫ‌లితమే ఊబ‌కాయం. ఎన్నో వైద్య నివేదిక‌లు తేల్చి చెప్పిన విష‌య‌మేమిటంటే ప‌ని ఒత్తిడి శ‌రీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంద‌ని. ఇటువంటి ప‌రిస్థితుల్లో త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోకుంటే ఆరోగ్యం పెను ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశ‌ముంది. ఈ విష‌యంలో ఉద్యోగులు త‌మ వ్య‌క్తిగ‌త ఆరోగ్యంపై త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. స‌రైన ప్ర‌ణాళికతో ఒత్తిడిని తగ్గించుకుంటూ శారీరక సమస్యలకు చెక్‌పెట్టాలి. 
 
ప్రారంభదశలోనే గుర్తించాలి
ఒకే చోట‌ కూర్చుని ప‌నిచేయ‌డానికి తోడు శారీరక వ్యాయామం లేక‌పోవ‌డం, మానసిక ఒత్తిడి పెరిగిపోవ‌డంతో అది కాస్తా ఊబ‌కాయానికి దారితీస్తోంది. మ‌రోవైపు ఒత్తిడితో అధికంగా తిన‌డం, జీవక్రియ వేగం మంద‌గించ‌డం వంటి కార‌ణాలు కూడా ఒబేసిటీకి కార‌ణ‌మ‌వుతున్నాయి. దీంతో య‌వ్వ‌నంలోనే చాలామంది వ‌య‌సు పైబడినవారిలా క‌న‌బడుతున్నారు. అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముట్ట‌డంతో నెల‌కు రెండుమూడు సార్లు డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాల్సి వ‌స్తోంది. అందువల్ల 
ఒత్తిడిని అధిగ‌మించేందుకు ప‌నిలో కొన్ని మార్పులు చేసుకోవ‌డంతోపాటు జీవ‌న‌శైలిని మార్చుకునేందుకు ప్రయత్నించాలి. అవ‌స‌ర‌మైతే ముంద‌స్తుగా డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించి ప్రారంభ ద‌శ‌లోనే ఒత్తిడిని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

పౌష్టికాహారం

బరువు తగ్గడానికి ఎలాంటి మంత్రాలు, మ్యాజిక్ చిట్కాలు లేవు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే సరియైన మార్గం. బర్గర్‌లు, పిజ్జాలు, నూనెతో చేసిన వంటలు పూర్తిగా తగ్గించాలి. ఎప్పుడైనా ఒకసారి తింటే ఫర్వాలేదు. కానీ ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ఐరన్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా, సరైన బరువుతో ఉంటారు. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారాలు, నూనె వంటలు తినడం వలన బరువు ఎక్కువై, కొవ్వు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది.

నిర్ణీత సమయాల్లో..

 ఒక రోజంతా కొన్ని నిర్ణీతమైన సమయాల్లో ఆహారం తీసుకోవడం ఉత్తమం. ప్రతీ రెండు నుంచి మూడు గంటలకి ఒకసారి ఖచ్చితంగా తినాలి. ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది. కొంతమందికి రాత్రి సమయాల్లో కూడా ఆకలి అవుతుంది. అలాంటి సమయాల్లో తినకుండా నీరు తాగాలి. రాత్రుల్లో దాహాన్ని ఆకలి అని భ్రమపడకూడదు. మితిమీరకుండా తినడం అలవాటుగా మార్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

వ్యాయామం

బరువు తగ్గాలంటే తక్కువగా, మితంగా తినాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు తగిన వ్యాయామం చేయాలి. కార్డియో, ఏరోబిక్, కండరాలని బలోపేతం చేసే వ్యాయామాలు చేసినట్లయితే బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యాయామాలు చేసే సమయాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే తగిన ఫలితం ఉంటుంది.

విశ్రాంతి

వ్యాయామం చేయడం వల్ల శరీరం చాలా ఒత్తిడికి గురై శరీరమంతా నీరసంగా మారుతుంది. కాబట్టి వ్యాయామం తర్వాత కొంత సమయం విశ్రాంతికి కేటాయించాలి. ఈ విశ్రాంతి వల్ల మనసు, శరీరం తేలికపడుతుంది. అంతేకాకుండా, కండరాలు కూడా బలోపేతం అవుతాయి. 
ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ప్రతిఒక్కరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం, ఒత్తిడి లేని, ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించటం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. మానసిక ఆరోగ్యమే మనిషి ఆరోగ్యకరమైన జీవన విధానం. 
 
సాంకేతిక‌త‌కు బ‌లికాకూడ‌దు
మ‌న అవ‌స‌రాల కోసం సృష్టించుకున్న ఒక వేదికే సాంకేతికత. ఇది ప్రత్యేకంగా ఎక్కడినుంచో వచ్చిన అద్భుత ఆయుధం కాదు. దీన్ని అర్థం చేసుకోకుండా సాంకేతికతను స‌రైన ప‌ద్ధ‌తిలో ఉప‌యోగించుకోక‌పోవ‌డం అనేక అన‌ర్ధాల‌కు దారితీస్తోంది. ప్ర‌స్తుతం సొసైటీలో చాలామంది ఏదైనా ఒక ఘ‌ట‌న జ‌ర‌గ్గానే ముందు దాన్ని చిత్రీక‌రించి త‌మ పేజ్‌లో పోస్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కానీ దానికంటే ముందు ఆ ఘ‌ట‌న‌కు సాటి మ‌నిషిగా తాను నిర్వ‌ర్తించాల్సిన బాధ్య‌త‌ల‌ను మ‌ర్చిపోతున్నారు. ఒక మ‌నిషికి ప్ర‌మాదం జ‌రిగి గాయాల‌తో బాధ‌ప‌డుతుంటే అత‌నికి సాయం చేయ‌కుండా ఆ యాక్సిడెంట్‌ను చిత్రీక‌రించ‌డానికే ప్రాధాన్యాన్నివ్వడం వ్యక్తిగా మనిషి ఏ స్థాయికి దిగజారిపోయాడో తెలియ‌జేస్తోంది. అలాగే సెలెబ్రిటీల‌తో ఫోటోలు దిగ‌డం, వాటిని పోస్ట్ చేసి అత‌ను నాకు బాగా కావాల్సినవాడు అని చెప్పుకోవ‌డం వంటి మానసిక రుగ్మ‌త‌ల‌కు గుర‌వుతున్నారు. మ‌రికొందరు తాము పెట్టిన ఫోటోలకు లైక్ రాకుంటే మాన‌సికంగా చిరాకు ప‌డిపోతున్నారు. ఫేస్‌బుక్ కావ‌చ్చు, మ‌రే ఇత‌ర డిజిట‌ల్ మీడియా కావ‌చ్చు... స‌రైన రీతిలో వాడుకోవ‌డం చేత‌కాక‌పోతే అది జీవితాన్నే బలిచేస్తుంది. సౌక‌ర్యం కోసం రూపొందించుకున్న సాంకేతికతే శత్రువుగా మారి ప్రాణాలను హరిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో  మరెన్నో విపత్కర ప‌రిణామాలు సంభవించే ప్ర‌మాదం ఉంది. ప్ర‌స్తుతం రాజ్య‌మేలుతున్న డిజిటల్ మీడియా అయినా, ఆ త‌ర్వాత రాబోతున్న స్పేస్ టెక్నాల‌జీ అయినా, ఏదైనా సౌక‌ర్యం కోసం మాత్ర‌మేనని గుర్తించాలి. అందుబాటులో ఉన్న సాంకేతికతను అవసరాలకు వాడుకోవాలే తప్ప, బానిసలుగా మారకూడదు, జీవితాల్ని బలిచేసుకోకూడదు.