సంసారం ఒక అనుబంధం..

ఆంధ్రజ్యోతి, 22-06-2015: ఆలుమగలన్నాక జగడాలు సాధారణమే. అలకలు ఓ కొలిక్కి వస్తేనే అందం. అలాకాకుండా చిలికి చిలికి గాలివానలా మారితేనే అసలు సమస్యంతా. మాయాబజార్‌లో పింగళివారన్నట్టు కలహం అంటే ప్రణయ కలహంగా భావిస్తే సంసారం హాయిగా సాగిపోతుంది. భార్యాభర్తల మధ్య చికాకులు కలిగించే విషయాలు ఎన్ని ఉంటాయో.. వాటిని అధిగమించే అవకాశాలూ అన్నే ఉంటాయి. అవి పాటిస్తే చాలు మీ అనుబంధం మరింత బలపడుతుంది.

భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే వారి మధ్య తరచూ ఏవో గొడవలు వస్తూనే ఉంటాయి. ఈ సమస్యకు అసలు కారణం సమయాభావం. ఆలుమగలు కలుసుకునే సమయమే చిక్కకపోతే.. వారి మధ్య సామరస్యం ఎలా ఉంటుంది. అందుకే ఇద్దరూ ఎక్కువ సమయం కలసి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫీసు పనులను అక్కడే పూర్తి చేసుకోవాలి. ఇంటికి వచ్చాక ఉభయకుశలోపరి తప్ప అన్య విషయాలు పట్టించుకోకండి. 

వంట, బట్టలు ఉతకడం, గిన్నెలు కడగటం, సూపర్‌ మార్కెట్‌కు వెళ్లడం, కూరగాయలు తేవడం, ఇంటి అద్దె, కరెంట్‌ బిల్లులు.. సంసారమన్నాక ఇలాంటి బోలెడన్ని మతలబులు ఉంటాయి. అన్నీ ఒకరి నెత్తినే వేస్తే.. కొన్ని రోజుల్లోనే ఇంటిలోన పోరు ఇంతింత కాదనిపిస్తుంది. ఇద్దరు ఒకటై చేయి కలిపి చూడండి. పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ఆ కాసేపు కూడా మీరిద్దరూ కలిసి ఉండే అవకాశమూ చిక్కుతుంది. 

ఇద్దరూ ఏకాంతంగా గడపడానికి అవకాశాలు కల్పించుకోవాలి. ఎక్కడికి వెళ్లినా పిల్లలను కూడా వెంటేసుకుని వెళ్లాల్సిన పనిలేదు. అప్పుడప్పుడూ మీరిద్దరే షికారుకు వెళ్లేలా ప్లాన్‌ చేసుకోండి. గుడికో.. రెస్టారెంట్‌కో.. సరదాగా వెళ్లి కొత్త ఊసులు పంచుకోండి. అవి మీలో కొంగొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. 

పర్సనల్‌ పనులు ఎన్ని ఉన్నా.. ఫ్యామిలీకే అధిక ప్రాధాన్యం ఇవ్వండి. ముఖ్యంగా మగాళ్లు, ఆదివారం రాగానే ఫ్రెండ్స్‌ను కలవాలని బయటకు వెళ్లిపోకండి. అవకాశం ఉంటే మీ భార్యను కూడా తోడు తీసుకెళ్లండి. అంతేకాదు.. షాపింగ్‌ అయినా, మార్కెట్‌కు వెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్లడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. 

ఆలుమగలు అయినంత మాత్రాన ఇద్దరి అభిరుచులు, ఆసక్తులు ఒకేలా ఉండాలని లేదు. అయితే ఒకటో రెండో అభిరుచులు కలిసేలా చూసుకోండి. ఒకరి అసక్తులను ఇంకొకరు తెలుసుకుని వాటిని గౌరవించండి. ఇవన్నీ ఫాలో అయిపోతే.. మీ సంసారం ఆనందంగా సాగిపోతుంది.