లక్ష్యాల వేటలో ఏమైపోతానో...!

ఆంధ్రజ్యోతి, 25-07-2018: ‘‘పేదవాడికి లక్ష్యాలు ఉండకూడదు. లక్ష్యాలు ఉన్నవాడికి పేదరికం ఉండకూడదు’’ అంటూ ఉంటారు. కానీ దురుదృష్టవశాత్తు నాకు ఈ రెండూ ఉన్నాయి. అయితే ఈ వైరుధ్యాన్ని అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కొంత మంది సంపన్నులను కలిశాను. వాళ్లల్లో చాలా మంది నా ప్రాజెక్టు ఐడియా విని ‘చాలా అద్భుతం’ అని మెచ్చుకున్నారు. ఇలా రెండేళ్లుగా జరుగుతూనే ఉంది. కానీ, వాళ్లల్లో ఏ ఒక్కరూ పెట్లుబడితో ముందుకు రాలేదు. దానికి ఆ విషయాన్ని వివరించడంలో నా లోపం ఏదైనా కారణమా? లేక అవతలి వాళ్లలో నిబద్ధత లేకనా? ఈ ప్రతిపాదనలతోనే ఏళ్లు గడిచిపోతున్నా అనుకున్నది నెరవేరడం లేదు. లక్ష్యాల వేటలో చివరికి మనుగడే కష్టమైపోతుందేమోనని భయమేస్తోంది. ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరిపోవడం పెద్ద ఆత్మ వంచనలా అనిపిస్తోంది. ఏం చేయమంటారో చెప్పండి?

- జీ. ఎస్‌, రాజీవ్‌, హైదరాబాద్‌
 
పేదరికానికీ లక్ష్యానికీ ముడిపెట్టడం అనేది ప్రాధమిక తప్పిదం. అన్ని వర్గాల్లోని అందరికీ లక్ష్యాలు కలిగి ఉండే హక్కు, అధికారం ఉన్నాయి. కాకపోతే, ఆ లక్ష్యాన్ని సాధించుకునేందుకు అవసరమైన శ్రమశక్తి, ఓపిక ఉన్నాయా లేదా అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అదే సమయంలో తమకున్న అవకాశాల విస్తృతి ఎంతో, పరిమితులు ఏమిటో ఒక అంచనా అయితే ఉండాలి. ఆ అంచనాలేమీ లేకపోతే, అడుగడుగునా ఆచరణపరమైన అవాంతరాలు వచ్చిపడుతూనే ఉంటాయి. అదలా ఉంచి మీ ప్రాజెక్టు ఐడియా ఇతరులకు నచ్చినంత మాత్రాన పెట్టుబడికి వాళ్లు సిద్ధమైపోవాలనేమీ లేదు. మీ ఐడియా గురించి మాట వరుసకు బావుందని, పెట్టుబడి పెట్టేద్దాం అని చెప్పడం వేరు. నిజంగానే వారికి అది నచ్చడం వేరు. వాళ్లకు అది నిజంగానే గొప్ప ప్రాజెక్టు అనిపించి, కచ్ఛితంగా లాభదాయకంగా ఉంటుందని అనిపిస్తే, పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తారు. అలా రావడం లేదంటే ఆ ప్రాజెక్టు పైన వారికి నమ్మకం కలగ లేదనే అర్థం. అసలు ఆ లక్ష్యం పైన మీకు ఎంత నమ్మకం ఉందనేది కూడా ప్రశ్నే. అంతటి నమ్మకమే మీలో ఉంటే, ఇంకా ఎంతో మంది ముందు ఆ ప్రాజెక్టు గురించిన ప్రతిపాదన తేవాలి. మౌలికంగా, ఈ లక్ష్యం ద్వారా మీరు సాధించాలనుకున్న ఉన్నతి స్థాయి పరమైనదా? ధనపరమైనదా? ప్రతిష్ఠ పరమైనదా? అనే విషయమేదీ మీరు రాయలేదు.
 
నిజానికి లక్ష్యాలన్నింటికీ భారీ మొత్తం పెట్టుబడులేమీ అవసరం లేదు. ఇది మీరు ప్రారంభించాలనుకుంటున్న తొలి ప్రాజెక్టే అయితే, ఎదుటి వారికి కొన్ని భయాలు ఉంటాయి. తొలి ప్రాజెక్టే భారీ పెట్టుబడులకు సంబంధించినది అయితే సహజంగానే వెనుకంజ వేసే అవకాశాలు ఎక్కువ. ఒక ప్రాజెక్టు ద్వారా విజయం సాధించి, మీ శక్తి సామర్థ్యాలు రుజువైతే, ఆ తర్వాత భారీ పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ఒకరు ముందుకొస్తారు. కాబట్టి మీ తొలి ప్రాజెక్టు భారీ పెట్టుబడులు అవసరమె ఉండకపోతే మేలు. మరో విషయం ఏమిటంటే మీ ప్రాజెక్టు స్వల్పకాలంలో పూర్తవుతుందా? దీర్ఘకాలం పడుతుందా అనేది కూడా ముఖ్యమే. చాలా మంది పెట్టుబడి దారులు స్పల్పకాలికమైన వాటికే ముందుకు వస్తారు. లక్ష్యాల వేటలో చివరికి బతుకే చిక్కుల్లో పడుతుందేమోనన్న భయం మీకు ఎందుకు కలుగులోంది? అలాంటి అపనమ్మకాల్ని దరిచేరనీయకండి. ఎంతో మందిని ఇంకా కలవండి, ప్రాజెక్టు ఎంత గొప్పదో అని మాత్రమే కాకుండా, ఎంత లాభకరమైందో కూడా వారికి వివరించండి. మీ ప్రాజెక్టు బలమైనదీ, లాభకరమైన దే అయితే పెట్టుబడి దారులు వెనుకో ముందో మీతో చేయి కలుపుతారు, మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు.
- డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చింతపంటి; కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌,
ట్రాంక్విల్‌ మైండ్స్‌ క్లినిక్‌ , మాదాపూర్‌, హైదరాబాద్‌.
 
ఈ డిజిటల్‌ ఏజ్‌లో యువతీయువకులు ఎదుర్కొనే మానసిక సంఘర్షణలు అనేకం. అనుబంధాల్లో అయోమయం, చదువులో ఒత్తిడి, వృత్తి ఉద్యోగాల్లో ఆందోళన, సహచరులతో మనస్పర్ధలు... మీ సమస్య ఏదైనా సరే బెటర్‌ లైఫ్‌కు రాసి పంపండి. వాటికి మానసిక నిపుణుల ద్వారా పరిష్కార మార్గాలు అందిస్తాం.
మా మెయిల్‌ ఐడీ: [email protected]