తన కోపమే తన శత్రువు

ఆంధ్రజ్యోతి, 12-06-2013: తన కోపమె తన శత్రువు అని మన పెద్దలు ఊరికే అనలేదు. దీనివల్ల శరీరానికే కాక, సామాజికంగా కూడా కొన్ని కష్టనష్టాలు ఉన్నాయనే వాళ్లు ఈ సూక్తిని చెప్పారనుకోవాలి. కోపం మీద అనేక దేశాలలో ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవల ఇంగ్లండ్‌లో దీనిపై రెండు బృందాలు విడివిడిగా పెద్దయెత్తున పరిశోధనలు జరిపాయి. వారి పరిశోధన వ్యాసాల్ని ‘డైలీ ఎక్స్‌ప్రెస్‌’ అనే మేగజైన్‌ ప్రచురించింది. ఒక బృందానికి నాయకత్వం వహించిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ చార్లీ ఒమెన్‌ కోపం వల్ల వచ్చే సమస్య గురించి వివరంగా చెప్పారు. ఒకసారి కోపం వస్తే, అందులోనూ పట్టపగ్గాలు లేని కోపం వస్తే శరీరం మున్ముందు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. 

కోపం వల్ల వెనువెంటనే కలిగే నష్టాలను అటుంచి, దీర్ఘకాలంలో అది అనర్థాలకు దారి తీయడం మాత్రం ఖాయమని ఆయన తెలిపారు. కొందరిలో కోపం క్షణికమే కానీ, ఎక్కువ మందిలో ఇది దీర్ఘకాలిక ం. కోపం రావడమంటే ఆయుర్దాయం తగ్గడమే. కోపం క్షణికమే అయితే, శరీరంపై తక్కువ ఫలితం కనిపిస్తుంది. ప్రతి రోజూ ప్రతి క్షణం కోపంగానే ఉండే మనుషుల్లో ఆయుర్దాయం బాగా తక్కువగానే ఉంటుంది. సగటు మనిషికి ఏడాదికి కనీసం 336 సార్లు కోపం వస్తుందట. నెలకు 28 సార్లు కోపం రావడం చాలా సహజమైన విషయమేనట.
 
కోపం రావడానికి కారణాలు ఏవైనప్పటికీ, కోపం వల్ల మాత్రం శరీరం కొద్ది కొద్దిగా కృశించిపోవడమో, శిథిలమైపోవడమో జరుగుతుందని ఒమెన్‌ చెప్పారు. కళ్లు ఎర్రబడ్డాయంటే దాని అర్థం రక్తంలో అవాంఛనీయమైన మార్పులు వస్తున్నాయి. రక్తంలో మార్పు వచ్చిందంటే దాని ప్రభావం గుండె, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై పడినట్టేనని అర్థం చేసుకోవాలి. అంతేకాదు, వ్యాధి నిరోధక శక్తి కూడా కొద్దిగా తగ్గిందని గ్రహించాలి. చిన్న చిన్న విషయాలకు కూడా పట్టపగ్గాలు లేని కోపం వచ్చేస్తుంటుంది కొందరికి. యవ్వనంలో అయితే దీని ప్రభావం శరీరం మీద రెండు మూడు రోజులు ఉంటుంది. అదే నడివయసులో అయితే దీని ప్రభావం కనీసం వారం పది రోజులు తప్పకుండా ఉంటుంది.
 
ఇక 60 ఏళ్లు దాటిన తరువాత కోపం రాకపోవడమే మంచిది. ఇంగ్లండ్‌లోని బెనెండెన్‌ హెల్త్‌కేర్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో కూడా ఆగ్రహావేశాలపై పరిశోధనలు జరిగాయి. కోపం తాలూకు ప్రభావాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఇది శరీరానికి ఎంత చెరుపు చేస్తుందో గమనించి నిర్ఘాంతపోయారు. ఈ సంస్థకు చెందిన డాక్టర్‌ లారెన్స్‌ క్రిస్టెన్‌సన్‌ ఓ వ్యాసం రాస్తూ, స్ర్టెస్‌ మేనేజ్‌మెంట్‌ లాగే ‘యాంగర్‌ మేనేజ్‌మెంట్‌’కు కూడా ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ‘‘ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు తినకపోయినా ఫరవాలేదు. వ్యాయామం చేయకపోయినా ఫరవాలేదు. కోపాన్ని మాత్రం తగ్గించుకోవాలి. దీన్ని ఎంత తగ్గించుకుంటే శరీరానికి అంటే ఆరోగ్యానికి అంత మంచిది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆధునిక జీవనశైలిలో ప్రతి దానికీ కోపం వెళ్లగక్కడం ఎక్కువవుతోందని, 64 శాతం మంది రోజుకు నాలుగైదుసార్లు కూడా కోపాన్ని ప్రదర్శించడం జరుగుతోందని ఈ అధ్యయనాల్లో వెల్లడైంది. కోపం తాలూకు ప్రభావం మొదటగా, నేరుగా గుండె పైనే ఉంటుందని, రక్తపోటు, మెదడులో రక్త నాళాలు చిట్లడం, మూత్రపిండాలు దెబ్బ తినడం, మానసికంగా కుంగిపోవడం, నరాలు బలహీనపడడం వంటివి కోపాన్ని అంటిపెట్టుకుని ఉండే అనారోగ్యాలని లారెన్స్‌ వివరించారు.
 
నిజానికి కోపాన్ని మనసులోనే దాచుకోవడం కన్నా దాన్ని ఏదో విధంగా బయటికి వెళ్లగక్కడమే మంచిది. దీన్ని లోపల ఉంచుకోవడం కూడా మంచిది కాదు. అయితే, అసలు కోపం రాకుండా చేసుకోవడం వల్ల శరీరానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. ‘‘నాకు కోపం వస్తుంది లేక నాకు కోపం వస్తోంది అని ముందుగానే చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది’’ అని ఇందులో హెల్త్‌కేర్‌ సంస్థ పరిశోధనల్లో పాల్గొన్న డాక్టర్‌ కుబ్జెన్‌స్కీ సలహా ఇచ్చారు. గుండె జబ్బులతో బాధలు పడుతున్నవారు ఎంత నిబ్బరంగా, ప్రశాంతంగా వ్యవహరిస్తే శరీరానికి అంత మంచిదని ఆమె సూచించారు. కోపమనేది ఒక్కోసారి పుంసత్వాన్ని కూడా దెబ్బ తీస్తుందని ఆమె తెలిపారు.
 
దీర్ఘవ్యాధులకు మూలం 
తరచూ కోపం వస్తుంటే వెంటనే నరాలు, మానసిక నిపుణులను సంప్రతించడం మంచిదని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. కోపాన్ని తేలికగా తీసుకోవద్దని, అది కూడా ఓ అనారోగ్యమేనని వారు చెబుతున్నారు. డయాబెటిస్‌, బీపీల మాదిరిగానే కోపం కూడా నిశ్శబ్దంగా మరణాన్ని తీసుకు వస్తుందని వారు తెలిపారు. దీనికి తోడు శరీరంలో ఇదివరకే మానసిక దిగులు, రక్తపోటు, హృద్రోగాలు తిష్ఠవేసుకుని ఉన్న పక్షంలో ప్రాణాంతక పరిస్థితి తలెత్తడం ఖాయం. 
కోపం రాగానే భయాందోళనలు పెట్రేగుతాయి. నోరు ఎండిపోతుంది. శరీరం వణికిపోతుంది. అరచేతులు చల్లబడతాయి. నీరసం ఆవహిస్తుంది. భావోద్వేగాలు పెల్లుబుకుతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొద్ది సేపటిలో శరీర స్థితిగతులే మారిపోతాయి. వీటన్నిటి ప్రభావం శరీరం మీద ఉంటుందనడంలో సందేహం లేదు. మరో విశేషమేమిటంటే, సాధారణంగా మగవారిలో వ్యక్తమైనంత కోపం మహిళల్లో వ్యక్తం కాదు. మహిళలు తమ కోపాన్ని మనసులోనే పెట్టుకోవడం జరుగుతుంటుంది. అయితే, కోపాన్ని బయటకు వెళ్లగక్కినా, లోపల దాచుకున్నా కొద్దిపాటి తేడాతో ఒకే రకమైన ఫలితాలనిస్తుంది. కోపం తీరుతెన్నుల్ని బట్టి శరీరానికి పైన చెప్పిన వ్యాధులే కాక మరి కొన్ని వ్యాధులు సోకే ప్రమాదం కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
 
తన కోపమె తన శత్రువనే నానుడి అర్థం లేనిది కాదనే సంగతి నిర్ధారణ అయినందువల్ల కోపాన్ని నిగ్రహించుకోవడానికి ఏం చేయాలన్నది ఆలోచించాలి. ఎవరికి వారు కాస్తంత ప్రశాంతంగా వ్యవహరించడం నేర్చుకోవాలి. యోగా కూడా ఇందుకు చాలా వరకు సహకరిస్తుంది. మరో ఎక్కువగా కోపం వస్తున్నప్పుడు ఆ వాతావరణం నుంచి కొద్దిసేపు నిష్క్రమించడం కూడా కొంత ఉపయోగపడుతుంది. తరచూ కోపం వస్తుంటే వెంటనే మానసిక వ్యాధుల నిపుణులను సంప్రతించడం చాలా ముఖ్యం.