ఎప్పుడూ గొడవలే..!

(ఆంధ్రజ్యోతి, 05-12-2019): 

నాకు 31 సంవత్సరాలు. పెళ్లి కాలేదు. అన్నయ్యకు కూడా కాలేదు. మా నాన్న ప్రభుత్వోద్యోగం చేసి రిటైరయ్యారు. నా సమస్యంతా మా అమ్మానాన్న, అన్నయ్యతోనే. నేను ఏం చెప్పినా తప్పు అంటున్నారు. నాన్న ఎప్పుడూ తాగుతూ ఉంటారు. అమ్మ అనవసర వాదనలు చేస్తూ ఉంటుంది. పనికి వచ్చే మాట ఒక్కటీ మాట్లాడదు. నాన్న, అన్న కూడా అంతే. నేను చెప్పింది ముగ్గురూ తప్పు అంటారు. అదే బయటివాళ్లతో చెప్పిస్తే వింటారు. అది కూడా వాళ్లు చెప్పినంతవరకే. కాసేపటికి మళ్లీ మొదటికే వస్తారు. ఏమైనా అంటే ‘అంత మీ నాన్నే చేశాడు’ అని అమ్మ ఆమె పెళ్లి రోజు నుంచి మొదలెడుతుంది. నాన్నేమో సంపాదన మొత్తం బయటవాళ్లకు ఇచ్చాడు. డబ్బు పోయినా ఇంట్లో ప్రశాంతత మాత్రం లేదు. రోజులో 10 గంటలు గొడవలు, ఒకరి మీద మరొకరు అరుచుకోవడాలు... దాంతో నాన్న, అన్నయ్య తాగుడే పనిగా పెట్టుకున్నారు. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. మా ఇంటి పరిస్థితి మారాలంటే ఏం చేయాలి?
 
-వేణుగోపాల్‌
 
మీ ఇంటి పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. అయితే మీరుగానీ, మీ అన్నయ్యగానీ ఏం చదువుకున్నారో, ఏం చేస్తున్నారో రాయలేదు. నిష్ర్కియాపరత్వం వల్ల ఇలా ఉన్నారేమో! మీ తల్లిదండ్రులంటే వయసు, సరైన చదువు లేక అలా ఉన్నారనుకోవచ్చు. మీ అన్నదమ్ములకు ఏమైంది? ఏదన్నా ఉద్యోగం చేసుకుంటే ఏ సమస్యా ఉండదు కదా! పైగా పెళ్లి కాలేదని బాధపడుతున్నారు. ఏ పనీ చేయకుండా తాగుతూ కూర్చునేవారికి ఎవరు మాత్రం పిల్లనిస్తారు? ఇంత బాధపడుతూ కూడా మీరు తిరిగి అలానే అయిపోతానేమో అనుకుంటున్నారంటే ఎంత నిస్పృహలో ఉన్నారో అర్థమవుతోంది. తాగుడు వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయో నిత్యం చూస్తూ కూడా ఆ ఊబిలోనే కూరుకుపోవడం చాలా విచారకరం. అయితే ఇంటి పరిస్థితి పట్ల బాధ, బాధ్యత ఉన్న వ్యక్తిగా మీరు చొరవ తీసుకోవచ్చు. ముందు మీ కంటూ ఒక ఉద్యోగం, సంపాదన అవసరం. అప్పుడే మీ మాటకు విలువ ఉంటుంది. మీరు చెప్తే వింటారు. ఆ తర్వాత మెల్లగా మీ ఇంట్లో వాళ్లకు నచ్చజెప్పండి. లేదా కొన్నాళ్లు దూరంగా వెళ్లండి. మనుషులు దూరంగా ఉంటే విలువ తెలుస్తుంది. ముందు మీకంటూ బాధ్యత తెలిస్తే పరిస్థితులు మెల్లగా కుదుటపడతాయి.
 
 
కె.శోభ
ఫ్యామిలీ కౌన్సెలర్‌, హార్ట్‌ టు హార్ట్‌