ఒంటరితనం అనారోగ్యకరం

ఆంధ్రజ్యోతి, 22-10-2013:ఒంటరితనమంటే ఇష్టమా? ఒంటరి జీవితానికి తప్పని పరిస్థితుల్లో అలవాటు పడిపోయారా? ఒంటరిగా ఉండాల్సి వస్తోందా? ఒంటరితనం వల్ల అనేకానేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన వైద్య పరిశోధకుల బృందం తేల్చి చెప్పింది. ఒంటరితనమనేది అసౌకర్యంగా, విషాదంగా ఉండడంతో పాటు శరీరంలోని వ్యాధి నిరోధక శక్తికి ఎంతగానో చేటు తెస్తోందని ఈ బృందం ఇటీవల ఓ అధ్యయనం ద్వారా వెల్లడించింది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా క్షీణించిపోవడంతో పాటు, నిర్ధారణ చేయలేని అనేక అనారోగ్యాలు కూడా శరీరంలో ప్రవేశిస్తున్నట్టు ఈ బృందం వందలాది మందిని పరిశీలించిన తరువాత కనుగొంది.
 
ఇల్లూ, ఆఫీసూ తప్ప మరేమీ పట్టక, ఇంట్లోనూ, ఆఫీసులోనూ కూడా తన పనేదో తాను చేసుకుంటూ పోతూ, ఎవరితోనూ కలవకపోవడమే ఓ మానసిక సమస్య కాగా, అది క్రమంగా శరీరంలో సృష్టించే తీవ్రస్థాయి అనారోగ్య సమస్యలు ఒకపట్టాన చికిత్సకు లొంగవని కూడా డాక్టర్లు చెబుతున్నారు. ఒంటరితనంతో ఉండాలనుకునేవారు ఎక్కువగా ఎవరితోనూ కలవడానికి, మాట్లాడడానికి ఇష్టపడరు. ఎక్కువ సేపు మాటా పలుకూ లేకుండా ఉండడంలోనే ఆనందాన్ని పొందుతారు. కానీ, ఈ ఆనందం ఎక్కువ కాలం కొనసాగదని, ఏదో ఒక రోజున సైలెంట్‌ కిల్లర్‌లా శరీరాన్ని కుప్పకూలుస్తుం దని ఈ బృందానికి నాయకత్వం వహించిన ప్రముఖ హృద్రోగ నిపుణురాలు డాక్టర్‌ లీసా జెరెంకా హెచ్చరించారు.
 
అందరితోనూ కలివిడిగా తిరిగే వారి కంటే ఒంటరిగా ఉన్నవారిలో మానసిక ఒత్తిడి అనేక రెట్లు ఎక్కువగా ఉంటుందని కూడా డాక్టర్లు చెబుతున్నారు. పైగా ఎంత పౌష్టికాహారం తీసుకున్నా వంటబట్టదని, పిండిపదార్థాలు, మాంసకృత్తులు క్రమంగా విషతుల్యంగా మారిపోతాయని వారు వివరించారు. గుండె జబ్బులు, డయాబెటిస్‌, ఆర్థిరైటిస్‌, ఆల్జీమర్‌ ్స వంటివి ఒంటరి జీవులకు ఇతరుల కంటే త్వరగా వచ్చే ప్రమాదముంది. శరీరం బలహీనపడడం, ఒక్కొక్క అవయవమే శక్తి కోల్పోవడం వంటివి ఒంటరి జీవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్లకు త్వరగా వయసు పైబడుతుందని కూడా జెరెంకా చెప్పారు. ఒంటరితనమంటే దీర్ఘకాలిక మానసిక ఒత్తిడితో సమానమని, ఎన్ని వ్యాయామాలు చేసినా, ఎంత పౌష్టికాహారం తీసుకున్నా వ్యర్థంగా మార్చే శక్తి దీనికి ఉందని ఆమె తెలిపారు.
 
‘‘మనసులోని విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం, ఇతరులతో కలివిడిగా ఉండలేకపోవడం, సరదాగా గడపలేకపోవడం వంటివి ఆయుర్దాయాన్ని తగ్గించడమే కాక, చాలా తీవ్రస్థాయి అనారోగ్య సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. పైగా అటువంటి వాళ్లలో అతి చిన్న అనారోగ్య సమస్య కూడా తీవ్రస్థాయిలో ఉంటుంది. పడిశెం కూడా ఎక్కువ కాలం పీడిస్తుంది’’ అని జెరెంకా చెప్పారు. స్థూలకాయం, స్థనాల కేన్సర్‌ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారి మీద పరిశోధన జరిపినప్పుడు ఈ ఒంటరితనం తెచ్చి పెట్టే సమస్యలన్నీ వెలుగులోకి వచ్చాయి.
 
మరో విశేషమేమిటంటే, యు.సి.ఎల్‌.ఎ లోన్లీనెస్‌ స్కేల్‌ సహాయంతో ఈ ఒంటరితన సమస్యలను పరిశీలించినప్పుడు, సామాజిక సంబంధాలు లేనివారిలోనూ, ఒంటరిగా ఉండాలనుకునేవారిలోనూ నపుంసకత్వం, జడత్వం ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు కూడా వెల్లడైంది. కలివిడిగా ఉండేవారు, అందరితోనూ సరదాగా ఉండేవారు చాలా త్వరగా అనారోగ్యాల నుంచి కోలుకుంటున్నారని, రొమ్ము కేన్సర్‌, హెర్పిస్‌, ప్రొటీన్ల క్షీణత, క్షయ, ఉబ్బసం, శ్వాసకోశ సంబంధమైన ఇతర సమస్యలు వంటి అనారోగ్యాల నుంచి కూడా వారే బాగా కోలుకుంటున్నట్టు తమ పరిశోధనల్లో వెల్లడైందని ఆమె తెలిపారు. ఒంటరిగా ఉండాలని కోరుకునేవారిలో యాంటీ బాడీస్‌ ఎక్కువగా ఉన్నట్టు తేలింది. 
దీర్ఘకాలం ఆరోగ్యంతో బతకాలన్నా, వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా, శరీరంలో అనారోగ్యాలు నయం కావాలన్నా అందరితోనూ కలిసి మెలిసి ఉండడం, సరదాగా ఉండడం అనే లక్షణాలు మందులకంటే ఎక్కువ శక్తిమంతంగా పనిచేస్తాయని, ఒంటరితనంతో ఉండడమంటే శరీరాన్ని వ్యాధులకు చేజేతులా అప్పగించడమే జరుగుతుందని డాక్టర్‌ జెరెంకా చెప్పారు. స్నేహితులు, సరదాలు ఎక్కువగా ఉన్నవారిలో అనారోగ్యాలు సోకడం చాలా అరుదని ఆమె తెలిపారు.