అతడి నోట ఆ మాటే రాకపోతే..!

ఆంధ్రజ్యోతి (08-01-2020): 
ప్రశ్న: డిగ్రీలో అతడు నా క్లాస్‌మేట్‌. నాది కాస్త రిజర్వ్డ్‌ పర్సనాలిటీ కావడం వల్ల క్లాస్‌లో ఎవరితోనూ అంత క్లోజ్‌గా ఉండే దాన్ని కాదు. అయితే డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లోకి వచ్చాక నా మౌనాన్ని దృష్టిలో ఉంచుకుని, ‘అందగత్తెనని గర్వం!’ అన్న అతడి ఒకే ఒక్క మాట నన్ను కుదిపేసింది. ‘అదేం లేదు’ అన్న నా సమాధానం... నాకు చేరువ కావడానికి అతడికి ఉపయోగపడింది. అతడు ఓ ప్రవాహం లాంటివాడు. ఎక్కడికైనా దూసుకు వెళతాడు. డిగ్రీ తర్వాత పీజీ కోసం హైదరాబాద్‌ వెళ్లాను. అతడూ వచ్చాడు. అక్కడ తెలిసిన వాళ్లెవరూ లేకపోవడం వల్ల నేను కూడా అతడితో సన్నిహితంగానే ఉన్నాను. నా బర్త్‌డే జూన్‌లో అని తెలుసుకుని, ఆ రోజున గ్రాండ్‌గా ఫంక్షన్‌ చేయడం మొదలెట్టాడు. ప్రతి ఏటా నా బర్త్‌ డే జరుపుతున్నాడు. వింత ఏమిటంటే, ఒక బర్త్‌డేకు అనుకోకుండా నేను బెంగుళూరు వెళితే, నేను లేకున్నా నేనున్నట్లే ఫంక్షన్‌ చేశాడని తెలిసింది. ‘ఎందుకలా చేశావు?’ అంటే ‘నా ఆనందమది’ అన్నాడు.
 
నా కోసం అతడు పడే ఆరాటం చూస్తే ఒక్కోసారి కొద్ది క్షణాలే అయినా నా గుండె లయ తప్పుతుంది. అలాగని అతని కళ్లల్లో ఏనాడూ ప్రేమ కనిపించలేదు కానీ తెలియని ఆర్థ్రత తొణకిసలాడుతుంది. అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. అతను పెళ్లికి ప్రపోజ్‌ చేస్తే ‘సరే’ అనడానికి నేను సిద్ధమే. కానీ, అతడి గొంతులోంచి ఆ మాటే పెగలదు. ఒకవేళ నా దారిన నేను వెళ్లిపోతే, అతడు తట్టుకోలేడని నా అంతరాత్మ చెబుతోంది. ఈ స్థితిలో నన్ను ఏం చేయమంటారో చెప్పండి.
 -టి. వైదేహి, ఖమ్మం
 
డాక్టర్ సమాధానం: మనసులోని భావాన్ని ఎప్పటికప్పుడు అభివ్యక్తం చేసే తత్వం అందరిలో ఉండదు. కొందరు ఎంతో కాలం మదనపడి, ఎప్పటికోగానీ వ్యక్తం చేయరు. అయితే అంతర్మథనానికి గురయ్యే వారంతా ఏదో ఒక రోజు కచ్ఛితంగా మనసులోని భావాన్ని చెబుతారన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు. ఒక విధంగా మీ హృదయాల్లో ఎంతో కొంత సాన్నిహిత్యం ఉందనిపిస్తున్నా మీరిద్దరూ భిన్నధృవాల్లాగే ఉన్నారు. అదీ కాక అతడి వ్యవహారమంతా స్నేహానికి పరిమితమైనదే కావొచ్చు. అదే నిజమైతే కొన్నాళ్లకు అది ప్రేమగా మారదని కూడా చెప్పలేం. ఒకవేళ తనలో ప్రేమభావనే ఉన్నా, తీరా వ్యక్తం చేస్తే ఎక్కడ బెడిసి కొడుతుందోనన్న భయం కూడా అతడిని కట్టడి చేస్తూ ఉండొచ్చు. అయినా ఎంతసేపూ అతడిని టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారు గానీ, ఇప్పటిదాకా మీరు ఒక్కసారైనా మీ భావాల్ని అతడి ముందు వ్యక్తం చేశారా? లేదు కదా! మీలో అతడి పట్ల ప్రేమే ఉంటే దాన్ని మీరైనా వ్యక్తం చేసి ఉండవచ్చు. నిజానికి, ఈ విషయంలో మీకే స్పష్టత ఉన్నట్లు లేదు. మీరే మీ ప్రేమను అతడి ముందు వ్యక్తం చేసి చూడండి. అటో ఇటో తేలిపోతుంది.
 
డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ చింతపంటి, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌, హైదరాబాద్‌