కాలేయ వ్యాధులకు అడ్డుకట్ట

26-01-12

శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. జీర్ణక్రియలోనూ, రక్తంలోని విషపదార్థాలను తొలగించడంలోనూ ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఒక్కోసారి కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల కాలేయానికి ఇన్‌ఫెక్షన్స్‌ సోకుతాయి. ఈ ఇన్‌ఫెక్షన్లను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. అయితే హోమియో మందులు వాడటం ద్వారా కాలేయ వ్యాధులను సమర్ధవంతంగా తగ్గించుకోవచ్చని అంటున్నారు డా. మధు వారణాశి. 

శరీరంలో కాలేయం పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది పొట్ట కుడి భాగాన, ముదురు ఎరుపు రంగులో ఉదరం కింద ఉంటుంది. కాలేయానికి రెండు లోబ్స్‌ ఉంటాయి. వీటిలో నాలుగేసి విభాగాలుంటాయి. వీటిని సెగ్మెంట్స్‌ అంటారు. కాలేయంలో ప్రతి సెగ్మెంట్‌కు రక్తాన్ని ప్రసరింపజేసే నాళాలుంటాయి. కాలేయం మూడవ వంతు ఆరోగ్యంగా ఉన్నా అది చేసే పనులన్నీ చేయగలుగుతుంది. సాధారణంగా మనం తీసుకొనే ఆహారాన్ని యధాతధంగా కణాలు స్వీకరించలేవు. వీటిని శరీరానికి అనుగుణంగా మార్చే ప్రక్రియలో కాలేయం(లివర్‌) ప్రధాన పాత్ర పోషిస్తుంది. హానికారక పదార్థాలను వేరుచేయడం, జీర్ణప్రక్రియకు తోడ్పడే బైల్‌(పిత్త రసం)ను ఉత్పత్తి చేయడం, రక్తం గడ్డకట్టుటలో ఉపయోగపడే పదార్థములను తయారుచేయటం, పోషకపదార్థాలు, విటమిన్లను నిలువ చేయటం, ప్రొటీన్లు, కొవ్వుపదార్థాలు, కార్బోహైడ్రేట్ల తయారీలో, గ్లూకోజ్‌, కొలెస్ర్టాల్‌ వినియోగంలో, అన్యపదార్థాల విసర్జనలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సెక్యూరిటీ గార్డు మాదిరిగా పనిచేస్తూ శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. కాలేయంలో 70 శాతం భాగం చెడిపోయినా మిగిలిన భాగం అన్ని పనులను నిర్వర్తించగలుగుతుంది. కాలేయ వ్యాధులలో చెప్పుకోదగినవి హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌ -సి, క్రానిక్‌ వైరల్‌ హెపటైటిస్‌, ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌. 

వైరల్‌ హెపటైటిస్‌
 వైరస్‌ కాలేయంలో చేరి కాలేయపు కణజాలాన్ని పాడుచేస్తుంది. దీనివల్ల కొన్ని కణాలు చనిపోవడం వలన హెపటైటిస్‌ వస్తుంది. ముందు సామాన్య లక్షణాలుగా కనిపించి తరువాత క్రానిక్‌గా మారుతుంది. ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సునాయసంగా వ్యాపిస్తుంది. వైరస్‌ రకాన్ని బట్టి హెపటైటిస్‌ రకాన్ని నిర్ధారిస్తారు. ఈ వైరస్‌లను హెపాటో ట్రోఫిక్‌ వైరసెస్‌ అంటారు. వీటిలో హెపటైటిస్‌-బి , హెపటైటిస్‌-సి, హెపటైటిస్‌-ఎ ముఖ్యమైనవి. ఈ వైరస్‌ను నిర్లక్ష్యం చేసినా, దీర్ఘకాలం పాటు వ్యాధి కొనసాగినా లివర్‌ క్యాన్సర్‌, లివర్‌ సిర్రోసిస్‌, అసైటిస్‌ రావడానికి ఆస్కారం ఉంటుంది. 
లక్షణాలు
నీరసం, విపరీతమైన అలసట, జ్వరం, తలనొప్పి, ఆకలి మందగించడం, ఆకలి తగ్గిపోవడం, వికారం, కుడివైపున డొక్కలో నొప్పి, తరచుగా విరేచనాలు, బరువు తగ్గిపోవడం, మూత్రం పసుపు పచ్చగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కూడా ఉంటాయి. 
హెపటైటిస్‌-సి
భారతదేశంలో దాదాపు 1కోటి 40 లక్షల మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. ఇందులో ఏటా 8వేల నుంచి పది వేల మంది చనిపోతున్నారు. 85 శాతం రోగులలో ఇన్‌ఫెక్షన్స్‌ మొండిగా మారి ఇబ్బందికి గురిచేస్తున్నాయి. హెపటైటిస్‌-సి వలన కొంతకాలానికి కాలేయం పాడైపోవడం వలన ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. దీర్ఘకాలికంగా హెపటైటిస్‌-సి ఉన్నప్పుడు ఇతరులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌
మద్యం అలవాటు ఉన్న వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. నిత్యం ఆల్కహాల్‌ సేవించడం వలన కాలేయం పాడయిపోతుంది. అతిగా మద్యం సేవించడం వలన శరీరానికి పోషకాలు అందకపోవడం, బరువు తగ్గడం, కాలేయం దెబ్బతినడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, గుండెలో మంట, పుల్లటి తేన్పులు, పాంక్రియాస్‌ చెడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
ఫ్యాటీ లివర్‌
కాలేయంలోని కణాల స్థానంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్‌ అంటారు. మద్యం తీసుకునే వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కాలేయం పెరగడం వల్ల కడుపులో నొప్పి, ముఖంపైన మచ్చలు, బుగ్గలపైన మచ్చలు కనిపిస్తాయి. 
జాగ్రత్తలు
మద్యం తాగడం మానేయాలి. లైంగిక వ్యాధులు రాకుండా చూసుకోవాలి. ఒకరికి ఉపయోగించిన సిరంజీలను ఉపయోగి ంచకూడదు. సురక్షితం కాని శృంగారంకు దూరంగా ఉండాలి. మసాలా పదార్థాలు తగ్గించాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. సాధారణ వ్యాధులకు శక్తివంతమైన యాంటీబయోటిక్స్‌ వాడటం తగ్గించాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే సిర్రోసిస్‌ రాకుండా నివారించుకోవచ్చు. 
హోమియో చికిత్స
హోమియో మందులను అనేక వనరులను కలిపి తయారుచేస్తారు. ఈ మందులు వ్యాధి మూల కారణంను తొలగించి, సమూలంగా వ్యాధిని తగ్గిస్తాయి. హోమియో చికిత్సను ప్రకృతి నియమాలపై ఆధారపడి ఇవ్వడం మూలంగా వ్యాధి సంపూర్ణంగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాలేయ సమస్యలు వచ్చినపుడు మానసిక, శారీరక లక్షణాలపై ఆధారపడి చికిత్స అందించడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. హోమియో మందుల వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధిని తట్టుకునే సామర్థ్యం వస్తుంది. ఈ మందుల వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. హోమియో చికిత్స తీసుకోవడంతో పాటు ఆహార నియమాలు పాటిస్తే కాలేయ వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు.
 
డా. మధు వారణాశి, ఎం.డి
ప్రముఖ హోమియో వైద్యులు
ప్లాట్‌ నెం 188, 
వివేకానందనగర్‌ కాలనీ, 
కూకట్‌పల్లి, హైదరాబాద్‌,
ఫోన్‌ : 8897331110,  8886 509 509.