కిడ్నీలో రాళ్లా..?.. అయితే వీటిని తినడం మానేయండి..!

(ఆంధ్రజ్యోతి, 22-12-2019)
ప్రశ్న: నాకు ఇరవై మూడేళ్లు. రెండు కిడ్నీల్లోనూ రాళ్లు ఉన్నాయని వైద్య పరీక్షల్లో తెలిసింది. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

- షేక్‌ వలీ, ఖమ్మం 

డాక్టర్ సమాధానం: ఆక్సలేట్లు లేదా ఫాస్ఫరస్‌తో కాల్షియం కలవడం వల్ల కిడ్నీలో రాళ్లు తయారవుతాయి. యూరిక్‌ ఆసిడ్‌ అధికంగా ఉన్నా కూడా ఏర్పడవచ్చు.  రాళ్లు రాకుండా ఉండాలన్నా; వచ్చిన రాళ్లు తగ్గాలన్నా నీళ్లు బాగా తాగాలి. రోజుకు కనీసం రెండు లీటర్ల మూత్రం పోవడానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి. వేసవిలో మరిన్ని నీళ్లు తాగాలి. మజ్జిగ, నిమ్మరసం, బత్తాయి రసం కూడా మంచివే. నిమ్మ జాతి పండ్ల నుండి వచ్చే సిట్రేట్‌ కిడ్నీలో రాళ్లు తయారవకుండా నివారిస్తుంది.  కాల్షియం సరైన పాళ్ళలో లేకపోతే కూడా ఈ రాళ్లు వస్తాయి. కాల్షియం సమృద్ధిగా లభించే పాలు, పెరుగు, పన్నీర్‌, చీజ్‌తో పాటు అన్ని ఆకుకూరలు తీసుకోండి. అయితే సప్లిమెంట్ల రూపంలో అధికంగా కాల్షియం తీసుకున్నా స్టోన్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. యూరిక్‌ ఆసిడ్‌ అధికంగా ఉన్నవారు మాంసాహారం ఎక్కువగా తింటే ప్రమాదకరం. వారానికి రెండు సార్లకు మించవద్దు. ఆక్సలేట్లు అధికంగా ఉండే ఆకుకూరలు వారానికి ఒకసారి చాలు. రాళ్లు కరిగేంతవరకు టమోటా మితంగా తినండి. సోడియం ఎక్కువగా ఉండే బయటి చిరుతిళ్ళు, బేకరీ ఫుడ్స్‌, రెస్టారెంట్‌ ఆహారం మానేయండి. ఫాస్ఫరస్‌ అధికంగా ఉండే శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.
 
 
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, 
వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను [email protected] కు పంపవచ్చు)